స్ర్తీ విద్యతోనే పురోగతి

ABN , First Publish Date - 2021-03-09T05:03:10+05:30 IST

స్ర్తీలు విద్యా వంతులైతే, సమాజం పురోభివృద్ధి చెందుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌ అన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఆనందగజపతి ఆడిటోరియంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు.

స్ర్తీ విద్యతోనే పురోగతి
ఇందిరా మహిళా సంఘానికి చెందిన సభ్యులును సత్కరిస్తున్న దృశ్యం

కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ 

కలెక్టరేట్‌, మార్చి 8: స్ర్తీలు విద్యా వంతులైతే, సమాజం పురోభివృద్ధి చెందుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌లాల్‌ అన్నారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఆనందగజపతి ఆడిటోరియంలో  సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతే కుటుంబంతో పాటు ఆ గ్రామం, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందనడానికి తన జీవితమే ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యుత్‌, రవాణా సదుపాయాలు కూడా లేని ఒక మారుమూల కుగ్రామంలో తాను జన్మించినప్పటికీ తన తల్లి విద్యావంతురాలు కావడం వల్ల ఐఏఎస్‌ కాగలిగానన్నారు. తన తల్లి తనతోపాటు గ్రామంలోని ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దారని వెల్లడించారు. ఫలితంగా సుమారు 300 మంది ఉద్యోగాలు పొంది గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అందుకే ఆడపిల్లలను బాగా చదివించాలని కోరారు. ప్రసుత్తం సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్‌ బి.పద్మావతి మాట్లాడుతూ స్ర్తీల సౌశీల్యాన్ని, వారి పురోగతిని చాటిచెప్పడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదపడతాయని చెప్పారు. స్ర్తీ అక్షయపాత్ర లాంటిదని, సహనానికి, ఓర్పునకు అమె ప్రతీక అని పేర్కొన్నారు. సీపీవో విజయలక్ష్మి మాట్లాడుతూ స్ర్తీ ఆర్థికంగా.. సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే మహిళా సాధికారత సాధ్య పడుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తల్లిదండ్రులు రత్నమ్మ, రామ్‌నాయక్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ రాజేశ్వరి, జిల్లా వైద్యాధికారి రమణకుమారి, ఇతర శాఖల జిల్లా అధికారులు నాగరాణి, మంజులవీణ, విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. 

స్వయం సహాయక సంఘ సభ్యులకు సత్కారం

జాతీయ స్థాయిలో ఉత్తమ సంఘంగా అవార్డు సాధించిన డెంకాడకు చెందిన ఇందిర స్వయం సహాయక సంఘాల సభ్యులను కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అభినందించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం డీఆర్‌డీఏ కార్యాలయంలో వారిని సత్కరించారు. ముందుగా ఢిల్లీ నుంచి ఆన్‌లైన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అవార్డుల జాబితాను ప్రకటించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ డెంకాడ పొదుపు సంఘం సాధించిన విజయం జిల్లాలోని ఇతర మహిళల్లో స్ఫూర్తిని నింపుతుందన్నారు. కార్యక్రమంలో జేసీ వెంకటరావు, డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు ,ఏపీడీ సావిత్రి, ఏసీ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

మహిళా ఉద్యోగులకు  సన్మానం 

మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మహిళా ఉద్యోగుల సంఘం ఆద్వర్యంలో ఎస్‌పి బి.రాజకుమారి, డీఈవో నాగమణితోపాటు జిల్లా మహిళా ఉద్యోగులను కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సతీమణి జి.జ్యోతి పాల్గొన్నారు.



Updated Date - 2021-03-09T05:03:10+05:30 IST