నిగూఢ కరెన్సీలపై నిషేధం

ABN , First Publish Date - 2021-06-15T09:54:51+05:30 IST

ఒకహాలులో వందమంది కంప్యూటర్ ప్రొఫెషనల్స్ విడివిడిగా కూర్చుని ఉన్నారు. యాభై అడ్డు వరుసలు, యాభై నిలువ వరుసల సుడోకు ప్రహేళికను పూరించడంలో వారు...

నిగూఢ కరెన్సీలపై నిషేధం

ఒకహాలులో వందమంది కంప్యూటర్ ప్రొఫెషనల్స్ విడివిడిగా కూర్చుని ఉన్నారు. యాభై అడ్డు వరుసలు, యాభై నిలువ వరుసల సుడోకు ప్రహేళికను పూరించడంలో వారు నిమగ్నమై ఉన్నారు. ముందుగా పూరించిన వ్యక్తి ఆనందంగా ఆ విషయాన్ని చాటి, తన పరిష్కారాన్ని అందరికీ చూపించాడు. వారు దానిని పరీక్షించి అతన్ని ‘విజేత’గా ప్రకటించి బహుమానంగా ఒక బిట్ కాయిన్‌ను ఇచ్చారు. తదుపరి దశ సుడోకు ప్రహేళికకు వారంతా తమ సూచనలు చేశారు. మాస్టర్ కంప్యూటర్ ఒకటి ఆ సూచనలన్నిటినీ పరిశీలించి 70 అడ్డు వరుసలు, 70 నిలువు వరుసలతో కొత్త ప్రహేళికను రూపొందించింది. అదే వంద మంది ఈ కొత్త ప్రహేళికను పూరించడానికి పూనుకున్నారు. ముందుగా విజయవంతంగా పూరించిన వ్యక్తికి ఒక బిట్ కాయిన్ బహుమతిగా ఇచ్చారు. ఈ వందమంది తమ మధ్య వ్యాపారానికి బిట్ కాయిన్‌ను ఉపయోగించుకుంటారు. ఒక వ్యక్తి పది ఆపిల్స్‌ను ఒక బిట్ కాయిన్‌కు విక్రయిస్తాడు. మరొక వ్యక్తి ఒక బిట్ కాయిన్‌కు వాటిని కొనుగోలు చేస్తాడు. బిట్ కాయిన్‌ను తమ సొంత కరెన్సీగా గుర్తించడం వల్లే ఈ వ్యాపారం సాధ్యమయింది. చిన్న పిల్లలు గోళీకాయలతో క్రయవిక్రయాలు జరపడం లాంటిదే ఇది కూడా. రెండు గోళీలకు ఒక బాలుడు ఒక పోస్టేజ్ స్టాంప్‌ను అమ్మితే మరొక బాలుడు రెండు గోళీలు ఇచ్చి వాటిని తీసుకుంటాడు. 


బిట్ కాయిన్ అనేది క్రిప్టో కరెన్సీ (నిగూఢ కరెన్సీ). ఇది, మాస్టర్ కంప్యూటర్ ఉత్పాదితమైన ఒక సంఖ్య మాత్రమే. ఎవరికైతే ఈ సంఖ్య ఉంటుందో అతను బిట్ కాయిన్ యజమాని. ఆ సంఖ్య ఒక సంకేత నిక్షిప్త సందేశం. కనుకనే దానికి క్రిప్టో కరెన్సీ అనే పేరు వచ్చింది. 


మరో హాలులో 200 మంది కంప్యూటర్ ప్రొఫెషనల్స్ తమ సొంత సుడోకు ప్రహేళికను పూరిస్తున్నారనుకోండి. ఆ ప్రహేళికను విజయవంతంగా పూరించిన వ్యక్తికి వారు తమ సొంత క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ను బహుమానంగా ఇస్తారు. రెండో హాలులోని 200 మంది మాత్రమే తమ సుడోకు ప్రహేళికకు పరిష్కారాన్ని తెలుసుకుంటారు. ఒక కరెన్సీని ఆ ప్రహేళికాకారులలో అత్యధికులు అంగీకరించినప్పుడు దాని వైయక్తిక సొంతదారు ఆ బిట్ కాయిన్లను విక్రయించి ఒక కారును కొనుగోలు చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో బ్యాంకులు కూడా ఆ క్రిప్టో కరెన్సీలను అంగీకరిస్తాయి. 


సుడోకు ప్రహేళిక క్లిష్టత పరిష్కరింపబడిన ప్రతి ప్రహేళికతో మరింతగా పెరుగుతుంది. 2000 అడ్డు వరుసలు, 2000 నిలువు వరుసల సుడోకు ప్రహేళికను స్వహస్తాలతో పూరించడం సాధ్యం కాదు. కనుక ఈ ప్రహేళికలను పూరించేందుకు బిట్ కాయిన్ ఉత్సాహికులు ‘ప్యాక్టరీ’లను నెలకొల్పారు. మాస్టర్ కంప్యూటర్ రూపొందించిన అత్యంత సంక్లిష్ట సుడోకు ప్రహేళికలను పరిష్కరించేందుకు ఈ ఫ్యాక్టరీలలో సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ప్రహేళిలకను పూరించే క్రమంలో అవి భారీ పరిమాణంలో విద్యుత్‌ను వినియోగించుకుంటాయి. ఈ ‘వ్యాపారస్థులు’ కంప్యూటర్‌ల ఏర్పాటుకు, విద్యుత్ కొనుగోలుకు మదుపులు చేసి, తాము గెలుచుకున్న బిట్ కాయిన్‌లను లాభాలుగా పొందుతారు. కరెన్సీ నోట్లను ముద్రించేందుకు మన రిజర్వ్‌బ్యాంక్ కాగితం, సిరాను ఉపయోగించిన విధంగానే బిట్ కాయిన్ల తయారీకి విద్యుత్‌ను వినియోగిస్తారు. ఈ దృష్ట్యా కరెన్సీలతో మొదటి సమస్యేమిటంటే విద్యుత్‌ను భారీ పరిమాణంలో ఉపయోగించుకోవలసి రావడం. అది పర్యావరణంపై ఎనలేని భారాన్ని మోపడమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


మరింత ముఖ్యమైన విషయమేమిటంటే నేరస్థులు ఇప్పుడు తమకు క్రిప్టో కరెన్సీల రూపేణానే చెల్లింపులు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన ‘కలోనియల్ ఆయిల్ కంపెనీ’ కంప్యూటర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఒక అక్రమ సాప్ట్‌వేర్‌ను ఆ కంప్యూటర్లలో ప్రవేశపెట్టారు. దానిని వారు మాత్రమే తొలగించగలరు. దానిని తొలగించేందుకు 30 లక్షల డాలర్లను చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. ఆ కంపెనీ వారికి ఆ మొత్తాన్ని సమర్పించుకోవడం అనివార్యమయింది. అమెరికా ప్రభుత్వం ఆ మొత్తంలో సగభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఏ విధంగా స్వాధీనం చేసుకున్నదీ తెలియదు. అదలా ఉంచితే సైబర్ నేరగాళ్లకు క్రిప్టో కరెన్సీ రూపేణా చేసిన చెల్లింపులు బ్యాంకు లావాదేవీలలో ఏ విధంగాను నమోదు కాలేదు.


క్రిప్టో కరెన్సీల రూపేణా తాము డిమాండ్ చేసిన సొమ్మును అందుకోవడం నేరగాళ్లకు సదుపాయంగా ఉండడం వల్లే నేరాలు పెచ్చరిల్లి పోతున్నాయని భావిస్తున్నారు. ఇది ప్ర‍పంచవ్యాప్త పరిణామంగా ఉంది. కంప్యూటర్లను, విద్యుత్‌ను భారీగా వినియోగించుకునే ఈ క్రిప్టో కరెన్సీలు పర్యావరణానికి హానికరమే కాకుండా సాంఘిక సంక్షేమానికి దారితీసే ప్రత్యక్ష వస్తువుల ఉత్పత్తికి వీసమెత్తు కూడా దోహదం చేయవు. నేరాల పెరుగుదలకు ఆలంబన కావడం ద్వారా అవి సమాజానికి కీడు చేస్తున్నాయి. ఇంతకూ క్రిప్టో కరెన్సీల విలువ అనిశ్చితమైనది. అంతేకాక అవి ఏ క్షణాన అయినా అదృశ్యమైపోవడానికి ఆస్కారముంది. కనుక క్రిప్టో కరెన్సీలను నిషేధించడం ప్రపంచ దేశాలకు శ్రేయస్కరం. ఈ క్రిప్టో కరెన్సీలను బ్యాంకులు గుర్తించకపోతే, ఏ ఆర్థిక లావాదేవీలోనూ అవి చెల్లుబడి కావు. వాటి ఉపయోగమూ సహసిద్ధంగా నిలిచిపోయేందుకు ఆస్కారముంది. సమాజానికి పెద్ద హాని తొలగిపోతుంది.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-06-15T09:54:51+05:30 IST