Kuwait: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త హఠాన్మరణం.. భారత రాయబారి సంతాపం!

ABN , First Publish Date - 2022-03-17T13:58:51+05:30 IST

ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, సహారా ఎయిర్ కండిషనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఐజాజ్ అహ్మద్ సర్ఫరాజ్ బుధవారం ఉదయం(కువైత్ కాలమానం ప్రకారం) కువైత్‌లోని సభా ఆస్పత్రిలో కన్నుమూశారు.

Kuwait: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త హఠాన్మరణం.. భారత రాయబారి సంతాపం!

కువైత్ సిటీ: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, సహారా ఎయిర్ కండిషనింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఐజాజ్ అహ్మద్ సర్ఫరాజ్ బుధవారం ఉదయం(కువైత్ కాలమానం ప్రకారం) కువైత్‌లోని సభా ఆస్పత్రిలో కన్నుమూశారు. లక్నోకు చెందిన సర్ఫరాజ్ కువైత్‌లో 20 ఏళ్ల నుంచి ఎయిర్ కండిషనింగ్‌ సర్వీసులకు సంబంధించిన సహారా కంపెనీని నడిపిస్తున్నారు. ఈ సంస్థలో 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తుండగా.. అత్యధికులు భారత్‌కు చెందిన వారని తెలుస్తోంది. సర్ఫరాజ్ వ్యాపారాలతో పాటు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. దీనిలో భాగంగా పేదలకు ఉచితంగా విద్య బోధన కోసం ఎడ్యుకేషన్ ఇన్సిట్యూషన్స్, ట్రస్టులు ఏర్పాట్లు చేశారు. భారత్‌లో నెలకొల్పిన సర్ఫరాజ్ & కిద్వాయ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఈ కోవలోనిదే. లక్నో సమీపంలోని గ్రామాలకు చెందిన పేద విద్యార్థులకు ఈ సంస్థలో పూర్తి ఉచితంగా విద్య బోధన ఉంటుంది. 


ఇక సర్ఫరాజ్ కువైత్‌లోని భారతీయ కమ్యూనిటీకి మద్దతు ఇవ్వడంలో చాలా చురుగ్గా ఉండేవారు. అలాగే సమాజానికి మద్దతుగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలలోనూ పాల్గొన్నారు. గత నెలలో యూపీ ఎన్నారై ఫోరమ్ నిర్వహించిన రక్తదాన ప్రచారానికి కూడా ఆయన హాజరయ్యారు. సర్ఫరాజ్‌కు భార్య షగుఫ్తా కిద్వాయ్, పిల్లలు నిదాల్ అహ్మద్, బిలాల్ అహ్మద్ ఉన్నారు. ఆయన హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, కువైత్‌లోని ప్రవాసులు శోకసంధ్రంలో మునిగిపోయారు. 


భారత రాయబారి సంతాపం..

కువైత్‌లోని భారత రాయబారి సిబి జార్జ్ ఐజాజ్ అహ్మద్ సర్ఫరాజ్ ఆకస్మిక మరణం పట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రాయబారి రాసిన సంతాప లేఖలో వ్యాపార, ఆర్థిక రంగంలో భారత్-కువైత్ సంబంధాలను ప్రోత్సహించడంలో సర్ఫరాజ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. "సర్ఫరాజ్ కువైత్‌లో అనేక భారతీయ కమ్యూనిటీ సంబంధిత కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంలో చురుకుగా పాల్గొన్నారు. కువైత్‌తో పాటు భారతదేశంలో కూడా అనేక దాతృత్వ కార్యక్రమాలకు సహకరించారు." అని రాయబారి పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-17T13:58:51+05:30 IST