కానరాని లోకాలకు...కథానాయకుడు!

ABN , First Publish Date - 2021-06-05T05:17:51+05:30 IST

తెలుగు కథ మూగబోయింది. చివరి వరకూ కథనే ఊపిరిగా... రచనలనే శ్వాసగా మలచుకున్న ఓ కథానాయకుడి ప్రయాణం ఆగిపోయింది. కథను కన్నీటి సాగరంలో ముంచి...తన ‘యజ్ఞం’ పూర్తి చేసిన సోమయాజి.. ప్రస్థానాన్ని ముగించారు. కథ ఒంటరి కారాదనే భావనతో... దానికి గూడుకట్టి... నీడనిచ్చిన కథాదీపధారి కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) తన సాహితీ పయనాన్ని ముగించి... కానరాని లోకాలకు తరలిపోయారు. ‘కథానిలయం’తో తెలుగు కథకు... ముఖ్యంగా కళింగాంధ్రకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కారా మాస్టారు ఇక లేరనే వార్తను సాహితీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కానరాని లోకాలకు...కథానాయకుడు!
కారా మాస్టార్‌ పార్థివ దేహం వద్ద నివాళి అర్పిస్తున్న కుటుంబ సభ్యులు.. ఇన్‌సెట్‌లో కారా మాస్టార్‌ (ఫైల్‌ఫొటో)

 సుప్రసిద్ధ రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూత

 కారా మాస్టారుగా ప్రసిద్ధి

 సామాన్యులకు కథను చేరువ చేసిన రచయిత

 తెలుగు కథకు వన్నెతెచ్చిన వైనం

 ‘కథానిలయం’తో సిక్కోలుకు ప్రత్యేక గుర్తింపు

(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి/లావేరు)

తెలుగు కథ మూగబోయింది. చివరి వరకూ కథనే ఊపిరిగా... రచనలనే శ్వాసగా మలచుకున్న ఓ కథానాయకుడి ప్రయాణం ఆగిపోయింది. కథను కన్నీటి సాగరంలో ముంచి...తన ‘యజ్ఞం’ పూర్తి చేసిన సోమయాజి.. ప్రస్థానాన్ని ముగించారు. కథ ఒంటరి కారాదనే భావనతో... దానికి గూడుకట్టి... నీడనిచ్చిన కథాదీపధారి కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) తన సాహితీ పయనాన్ని ముగించి... కానరాని లోకాలకు తరలిపోయారు. ‘కథానిలయం’తో తెలుగు కథకు... ముఖ్యంగా కళింగాంధ్రకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కారా మాస్టారు ఇక లేరనే వార్తను సాహితీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.

..............................

సిక్కోలు సాహితీ లోకం ఓ ధ్రువతారను కోల్పోయింది. ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు శుక్రవారం శ్రీకాకుళంలోని స్వగృహంలో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సిక్కోలు గొప్ప రచయితను కోల్పోయినట్లయింది. తెలుగు ప్రజలకు ఆయన ‘కారా మాస్టారు’గా సుపరిచితులు. ఆయన పూర్తి పేరు కాళీపట్నం వెంకటసూర్యరామసుబ్రహ్మణ్యేశ్వరరావు. తన రచనలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. తన కథల సంపుటి ‘యజ్ఞం’తో 1996లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకున్నారు. రాష్ట్ర సాంస్కృతిక మండలి నుంచి హంస అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. కారా మాస్టారులో మంచి రచయితే కాకుండా... విమర్శకుడూ దాగి ఉన్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కానీ రచయితగానే ప్రపంచానికి పరిచయస్థుడు. ఆయన రచనా శైలి సరళంగా ఉంటుంది. అదే సామన్యులకూ ఆయన కథలను దగ్గర చేసింది. వాటిలోని పాత్రలు వారిని ఆకట్టుకునేలా చేసింది. 


 విద్యాభ్యాసం నుంచి ఉద్యోగ విరమణ వరకూ...

కారా మాస్టారు 1924 నవంబర్‌ 9న పేర్రాజు, భ్రమరాంబ దంపతులకు జన్మించారు. ఆయన స్వగ్రామం లావేరు మండలం మురపాక. తండ్రి పేర్రాజు మురపాకతో పాటు మరో ఆరు గ్రామాలకు కరణంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టేవారు. దీంతో కారా మాస్టారిబాల్యమంతా మురపాకలోనే గడిచింది. ఒకటో తరగతి నుంచి 4వ తరగతి వరకు మురపాకలోనే చదివారు. తర్వాత తన పెద్దమ్మ వద్ద చెట్టుపొదిలాంలో ఉంటూ..సమీపంలోని జి.సిగడాంలో ఐదు, ఆరు తరగతులు చదువుకున్నారు. శ్రీకాకుళం ఎన్టీఆర్‌ మునిసిపల్‌ హైస్కూల్‌లో 7 నుంచి 10వ తరగతి వరకు చదివారు. అనారోగ్య కారణాలతో పదో తరగతి చదువు సాగలేదు. తిరిగి స్వగ్రామం మురపాక చేరుకుని అక్కడ రామకృష్ణ గ్రంథాలయంలో ఉండే పుస్తకాలతోనే కారా మాస్టారు సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆనాడే రచనలకు బీజం వేశారు. ముద్దు అనే కథ.. 1, 2 పద్యాలు రాసినప్పటికీ ప్రచురణ కాలేదు. ఆ తరువాత శ్రీకాకుళం చేరుకున్న ఆయన ఎస్‌ఎస్‌ఎల్సీ పూర్తి చేశారు. 1946 మార్చి 19న సీతామహాలక్ష్మీతో ఆయనకు వివాహమైంది. తరువాత విశాఖ జిల్లా భీమునిపట్నంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ట్రైనింగ్‌ పూర్తి చేశారు. 1948 జూన్‌లో విశాఖపట్నంలోని సెయింట్‌ ఆంథోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1979లో ఉద్యోగ విరమణ పొందారు. కారా మాస్టారు, సీతామహాలక్ష్మి దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. భార్య సీతామహాలక్ష్మి 2013లో మృతి చెందారు. ముగ్గురు కుమారులు కూడా కన్నుమూశారు. ఇదిలా ఉండగా,  కారా మాస్టారు పొందూరులోని బ్రాహ్మణ అగ్రహారం వీధిలో నివాసం ఉండే అనపర్తి లక్ష్మీనర్సమ్మ, జగన్నాథేశ్వరరావు(కారా మాస్టారు అమ్మమ్మ, తాతయ్యలు) ఇంటి వద్దనే జన్మించారు. తాతయ్య జగన్నాథేశ్వరరావు పోలీసుశాఖలో పనిచేసేవారు. కారా మాస్టారు తమ వీధిలోనే జన్మించారనే విషయం ఆ వీధిలోని ఈ తరానికి చెందిన చాలా మందికి తెలియకపోవడం గమనార్హం.


 కొవ్వలి రచనలే  బాటలుగా.. 

కారా మాస్టారి తల్లిదండ్రులకు సాహిత్యమంటే మక్కువ. అప్పట్లో మురపాకలో శ్రీరామకృష్ణ పేరుతో గ్రంథాలయం ఉండేది. అక్కడికి వచ్చే ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, భారతి, ప్రతిదిన పత్రికలతో పాటు కొవ్వలి వారి రచనలు, కాశీమజిలీ కథలు, ఎక్కువగా చదువుతుండేవారు. ఆ ప్రభావం తనపై పడిందని కారా మాస్టారు గతంలో ఒకసారి వెల్లడించారు. ‘కొవ్వలి వారి నవలలు చదువుతూ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకునేవారు. అది చూసి నేను ఆశ్చర్యపోయి.. ఆ నవలలు చదవడం ప్రారంభించాను. ఈ క్రమంలో కొవ్వలివారి రచనలే నన్ను రచయితగా మార్చేందుకు బాటలు వేశాయి’ అని కారా మాస్టారు గతంలో చెప్పారు. 1943లో విశాఖపట్నం వచ్చిన తర్వాత హిందూ రీడింగ్‌ రూమ్‌లో ఉన్న పెద్ద లైబ్రరీని చూసిన తర్వాత రచనలపై తనలో ఆసక్తి పెరిగిందని వెల్లడించారు. కారా తొలిరచన ‘ప్లాట్‌ఫారమో’ పేరిట తెలుగు స్వతంత్ర, చిత్రాంగి తదితర పత్రికల్లో వెలువడింది. దీంతో ఆయనకు రచనలపై మరింత ఆసక్తి పెరిగింది.   

 యజ్ఞంతో ప్రజల హృదయాల్లోకి...

 కారా మాస్టారి తొలికథ ‘ప్లాట్‌ఫారమో’ పేరుతో 1943లో ‘చిత్రగుప్త’ పత్రికలో అచ్చయింది. ఆ తర్వాత వీసంలో అయితే గియితే , వెనుక చూపు, నిజమే అయితే, భాయిజాన్‌ వంటి అనేక కథలను రచించారు. 1949-50 మధ్య కాలంలో ఆయన రచనా వ్యాసంగం, నిరంతర పఠన చింతనలు, ఎరుక అనే వ్యాసాలను   రాశారు. 1964-67 మధ్య కాలంలో ‘యువ’ పత్రికలో ‘తీర్పు’ కథ వెలువడింది. దీనితో ఆయన మళ్లీ కథా రచన ప్రారంభించారు. 1971 జనవరి 31న విశాఖపట్నంలో ‘యజ్ఞం’ కథా సంపుటిని మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించారు.


కథకు గూడు...  

కథకు ఓ గూడూ నీడా కల్పించిన ఘనత కారా మాస్టారుకే దక్కుతుంది. ‘కథానిలయం ’ పేరుతో శ్రీకాకుళంలో కథల నిక్షిప్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కథలకు ఓ గూడు ఉండడం దేశంలోనే ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. ‘కథానిలయం’తోనే ఆయన దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అదే స్థాయిలో శ్రీకాకుళం జిల్లా పేరు మారుమోగేలా చేశారు. కొంతమంది మిత్రులతో కలిసి ‘కథావేదిక’ను ఏర్పాటు చేశారు. ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షిక ద్వారా ఎందరో యువ రచయితలను ప్రోత్సహించారు. 1993-99 మధ్య కాలంలో తెలుగు వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లారు. 1996లో ‘యజ్ఞం’ కథకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. తన సాహిత్యం, సత్కారాల ద్వారా వచ్చిన నగదుతో 1997 ఫిబ్రవరిలో శ్రీకాకుళంలోని విశాఖ ఏ కాలనీలో ‘కథానిలయం’ స్థాపించారు. 800 పుస్తకాలతో ప్రారంభమైన కథానిలయంలో ప్రస్తుతం 11,576 పుస్తకాలు ఉన్నాయి. 20,500 పత్రికల సంచికలు, 414 సంకలనాలు, 2,213 సంపుటాలు, 105 వ్యాస సంకలనాలు, 67 ఆత్మకథలు, 97 పరిశోధన పత్రాలు, 95 జీవితచరిత్రలు, 45 ఇతర భాషల్లో ముద్రితమైన తెలుగు అనువాదాలు ఉన్నాయి. 2,400 మందికి పైగా రచయితల వ్యక్తిగత సమాచారం, 285 మంది రచయితల ఫొటోలు కథానిలయంలో పొందుపరిచి ఉన్నాయి. కథానిలయం వార్షికోత్సవ సభలకు ఇతర రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించి... వాళ్ల ప్రసంగాలను వినిపించేవారు. ఇక ‘కథానిలయం’ వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు 13వేల మంది కథకుల వివరాలు, 85 వేల కథలను కూడా అందుబాటులో ఉంచారు. 1910- 2010 మధ్య కాలంలో వివిధ పత్రికల్లో వచ్చిన అనేక కథలు ఇందులో లభ్యమవుతాయి. 1910లో గురజాడ రచించిన ‘దిద్దుబాటు’ కథను మొదటి కథగా ప్రామాణికంగా తీసుకుని ఇంటర్‌నెట్‌లో పొందుపరిచారు. వివిధ యూనివర్సిటీలకు చెందిన ఎంతోమంది పరిశోధక విద్యార్థులకు ‘కథానిలయం’ పరిశోధన శాలగా ఉపయోగపడుతోంది. 


 కొవిడ్‌ నిబంధనల నడుమ.. కన్నీటి నివాళి

కారా మాస్టారు మృతితో సిక్కోలు శోకసంద్రంలో మునిగిపోయింది. శుక్రవారం కుటుంబ సభ్యుల సమక్షంలో కారా మాస్టారు భౌతిక దేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా నిరాడంబరంగానే అంత్యక్రియలు నిర్వహించారు. కారా మాస్టారు భౌతికదేహాన్ని కడసారిగా చూసేందుకు సాహితీవేత్తలు, రచయితలు, ఉపాధ్యాయులు, అభిమానులు.. ఆయన స్వగృహానికి తరలివచ్చారు. కన్నీటి నివాళులర్పించారు. 

 

 మరింత క్లుప్తంగా..

=================

పూర్తి పేరు : కాళీపట్నం వెంకట సూర్య రామ సుబ్రహ్మణ్యేశ్వరరావు

అందరూ పిలిచే పేరు : కారా మాస్టారు 

జననం : నవంబర్‌ 9, 1924

పుట్టిన ఊరు : పొందూరు 

స్వగ్రామం : మురపాక 

తల్లిదండ్రులు : భ్రమరాంబ, పేర్రాజు

విద్యార్హత : ఎస్‌ఎస్‌ఎల్సీ

భార్య : సీతామహాలక్ష్మి

కుమారులు : సుబ్బారావు, పేర్రాజు, వ్యాసమూర్తి, రామచంద్రమూర్తి, వీఎస్‌ ప్రసాద్‌

కుమార్తె : లక్ష్మి, గృహిణి

వృత్తి : ఉపాధ్యాయుడు

ప్రవృత్తి : రచయిత, కథానిలయం నిర్వహణ

కలం పేరు : కాళీపట్నం, కారా


బాధ్యతలు

------------

వ్యవస్థాపకులుగా : కథానిలయం ట్రస్ట్‌

గౌరవాధ్యక్షులుగా : శ్రీకాకుళ సాహితీ, చైతన్యభారతి, గజపతినగరం

సలహాదారుడిగా :రచన సాహిత్య మాసపత్రిక, సాహిత్యనేస్తం, సాహిత్యపక్ష పత్రిక (కడప)

 ట్రస్ట్టీగా : రావిశాస్త్రి మెమోరియల్‌ లైబ్రరీ ట్రస్ట్‌, 

సభ్యులుగా : రాచకొండ రచనా పురస్కారం, మిత్ర సాహితి-విశాఖపట్నం 


ప్రముఖ రచనలు....

-------------------

యజ్ఞం 

అభిమానాలు

రాగమయి

జీవధార

రుతుపవనాలు (కథా సంకలనం)

కారా కథలు

కథా కథనం

కథా యజ్ఞం

రావు

సంకల్పం


పురస్కారాలు..... 

-----------------------

 బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్‌ వారి స్ఫూర్తి పురస్కారం

 ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం

 కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారం


అవార్డులు  

------------------

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు(1995)

తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం (1987)

జ్ఞానపీఠ్‌ అవార్డు (1996)

రాష్ట్ర సాంస్కృతిక విభాగం హంస అవార్డు (1999)

లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ అవార్డు-2008 వంటివి మరికొన్ని....

గౌరవ డాక్టరేట్‌ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - 2007

Updated Date - 2021-06-05T05:17:51+05:30 IST