స్టాఫ్‌ నర్సులకు హెడ్‌ నర్సులుగా పదోన్నతులు

ABN , First Publish Date - 2022-08-08T06:07:31+05:30 IST

వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న ఏడుగురు స్టాఫ్‌ నర్సులకు హెడ్‌ నర్సులుగా పదోన్నతులు కల్పించారు.

స్టాఫ్‌ నర్సులకు హెడ్‌ నర్సులుగా పదోన్నతులు

ఆదివారం ప్రక్రియ నిర్వహణపై విమర్శలు

డీపీసీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయిందంటున్న అధికారులు

విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : వైద్య, ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న ఏడుగురు స్టాఫ్‌ నర్సులకు హెడ్‌ నర్సులుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు సదరు ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతుల ప్రక్రియను ఆదివారం రీజనల్‌ డైరక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి నిర్వహించారు. ఆయా ఉద్యోగులకు పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులను అందించారు. ఆదివారం పదోన్నతులు నిర్వహించడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఈ విషయాన్ని ఆర్డీ దృష్టికి తీసుకెళ్లగా ఆయా పోస్టులకు సంబంధించిన డీపీసీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయిందని, ముందుగానే సదరు ఉద్యోగులకు సమాచారం అందించి ఆదివారం పదోన్నతులు ప్రక్రియ నిర్వహించామన్నారు. డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత విజయవాడలోనే ఎక్కువగా ఉంటున్నామని, దీనివల్ల పదోన్నతుల ప్రక్రియకు అవాంతరం కలుగకూడదన్న ఉద్దేశంతోనే ఆదివారం విశాఖకు వచ్చి నిర్వహించినట్టు వెల్లడించారు.


ఇదిలా, ఉంటే స్టాఫ్‌ నర్సు నుంచి పబ్లిక్‌ హెల్త్‌ నర్సు పదోన్నతులు వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. మెరిట్‌ లిస్టును పరిగణలోకి తీసుకుని పదోన్నతులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్టు సీనియారిటీ లిస్టులో ఉన్న పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై ఆర్డీని వివరణ కోరగా సీనియారిటీ లిస్టు ప్రాతిపదికగానే పదోన్నతులు కల్పిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. 

Updated Date - 2022-08-08T06:07:31+05:30 IST