ప్రమోషన్లు పూజ్యం, జీతాలు దైవాధీనం!

Published: Thu, 04 Aug 2022 01:07:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రమోషన్లు పూజ్యం, జీతాలు దైవాధీనం!

ఇరవై, ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసినా ప్రమోషనుకు నోచుకోని ఉపాధ్యాయులు రాష్ట్రంలో వందలమంది ఉన్నారు. కొంతమంది ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండానే రిటైర్ అవుతున్నారు. పూర్తి విద్యార్హతలు కలిగి, వేలాది ఖాళీ పోస్టులు ఉండి కూడా టీచర్లకు 2001 నుంచి జూనియర్ లెక్చరర్, 2005 నుంచి ఎంఈఓ, డైట్ లెక్చరర్ ప్రమోషన్స్ ఇవ్వటం లేదు. 2015 నుంచి స్కూల్ అసిస్టెంట్, హైస్కూల్ హెడ్మాస్టర్ పదోన్నతులు కూడా ఇవ్వలేదు. విద్యా ప్రణాళికలు రూపొందించే పనిలో ఉండాల్సిన ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్లు, ఛాత్రోపాధ్యాయులకు విద్యనందించాల్సిన డైట్ కళాశాలల లెక్చరర్లకు డీఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరి, ఎస్సీఈఆర్టీ, డైట్ కళాశాలలు ఎలా నడవాలి? జీహెచ్ఎం గ్రేడ్–2లను తన పాఠశాల విధులతో పాటు ఆరు, ఏడు మండలాలకు ఇంచార్జ్ ఎంఈఓలుగా నియమిస్తున్నారు. పనిభారం పెరిగి, వీరు దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. సుమారు రెండు వేల జీహెచ్ఎం గ్రేడ్–2, పదివేల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, పండిట్, పీఈటీల అప్‍గ్రేడేషన్‌తో ఏర్పడిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, మొత్తం 20వేల పోస్టులు పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉండగా, ఏడేండ్లుగా టీచర్లకు ప్రమోషన్లు కల్పించలేదు. ప్రమోషన్ల విషయాన్ని విద్యాశాఖ అధికారులు టీచర్లకు ప్రయోజనం చేకూర్చే అంశంగా చూస్తున్నారే తప్ప, విద్యాబోధన మెరుగుపడుతుందన్న కోణంలో చూడకపోవడం శోచనీయం.


జిల్లాల పునర్విభజన సందర్భంగా అన్ని శాఖల్లో జిల్లాస్థాయి అధికారుల పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం, విద్యాశాఖలో కీలకమైన డీఈఓ, ఎంఈఓ పోస్టులను ఇప్పటికీ మంజూరు చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అవసరాలకు అనుగుణంగా పోస్టులు మంజూరు చేసి, ఉపాధ్యాయుల నియామకం కోసం టీఆర్టీ ప్రకటిస్తే బాగుండేది. కానీ, ఆ ఊసే లేదు. విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ కనీసం విద్యావాలంటీర్లను, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లను నియమించలేదు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు బదిలీలు చేస్తామంటూ పదేపదే చెప్పడమే తప్ప, ఆచరణలో జరిగింది శూన్యం. రెగ్యులర్ టీచర్లతో సమానంగా కేజీబీవీ టీచర్లకు వేతనాలు ఇవ్వరు, కనీసం ఆకస్మిక సెలవులు సైతం ఇవ్వడం లేదు. ఏళ్ళ తరబడి పనిచేస్తున్నా కేజీబీవీ టీచర్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయడం లేదు. మోడల్ స్కూల్ టీచర్లకు మెడికల్ రీయింబర్సుమెంట్ సౌకర్యం లేదు. హెల్త్ కార్డులు లేవు. టీచర్ చనిపోతే కుటుంబసభ్యులకు కారుణ్య నియామకం కూడా ఉండదు. చివరికి జీతాలు చెల్లింపు కూడా అధికారుల దయ, టీచర్ల ప్రాప్తంగా మారిపోయి, ఏ నెలాఖరుకో చెల్లిస్తున్నారు. ఏదో ఒక్కనెల కాదు, ప్రతి నెలా జీతాలు ఆలస్యమే.


ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా 317 జీవోను జారీ చేసి వేలాది మంది ఉపాధ్యాయుల స్థానికతను పాతరేశారు. పుట్టి, పెరిగి, చదువుకున్న జిల్లా నుంచి ఇతర జిల్లాలకు నిర్బంధంగా శాశ్వత బదిలీలు చేశారు. తప్పుల తడకగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు రూపొందించడమే కాకుండా, అభ్యంతరాలను సైతం పరిష్కరించకుండానే ఆఘమేఘాల మీద జిల్లాలకు కేటాయించి, అప్రజాస్వామికంగా వ్యవహరించారు. భార్యను ఒక జిల్లాకు, భర్తను మరో జిల్లాకు కేటాయించి కుటుంబాలను కకావికలం చేశారు. అలొకేషన్ తర్వాత స్పౌజ్ కేటగిరి టీచర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, 13 జిల్లాలను బ్లాక్ చేసి, వారికి తీరని వ్యధని మిగిల్చింది. ఎవరికీ చెప్పాపెట్టకుండా రివర్స్ స్పౌజ్ బదిలీలు చేయడంతో మెజారిటీ టీచర్లకు న్యాయం జరగలేదు. మెడికల్ గ్రౌండ్స్, వితంతువు కేటగిరి వారు పెట్టుకున్న అప్పీళ్లను కోర్టుకు వెళ్తే తప్ప, పట్టించుకోవడం లేదు. ఆర్నెల్లు దాటినా ఉపాధ్యాయులు పెట్టుకున్న అప్పీళ్లను పరిష్కరించే పరిస్థితి లేకపోవడం విచారకరం. పరస్పర బదిలీల కోసం 21 నంబర్ జీవో జారీ చేసినా, ఇరువురిలో ఒకరు తప్పనిసరిగా 317 జీవో పరిధిలో బదిలీ అయి ఉండాలన్న కండిషన్ పెట్టారు. ఈ అసంబద్ధ నిబంధన కారణంగా చాలామంది ఉపాధ్యాయులు పరస్పర బదిలీ పరిధిలోకి రాకుండాపోయారు.


కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంతో రాష్ట్రంలో లక్షా యాభై వేలకు పైగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులు అభద్రతాభావంతో ఉన్నారు. హక్కుగా పొందాల్సిన పెన్షన్, సీపీఎస్ పుణ్యమాని లక్కుగా, దైవాధీనంగా మారిపోయింది. సీపీఎస్ విధానంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సామాజిక భద్రత ఏమాత్రం లేదు. తన డబ్బుతో పెన్షన్ కొనుక్కునే దుస్థితి దాపురించింది. రాజస్థాన్ తదితర రాష్ట్రాలు రద్దు చేసినట్లుగా సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరం. 2003 డీఎస్సీ టీచర్లు పాత పెన్షన్ పథకానికి పూర్తిగా అర్హులైనప్పటికీ ఏళ్ళు గడుస్తున్నా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆ దిశలో చర్యలు తీసుకోకపోవడం అన్యాయం. పాఠ్య పుస్తకాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే మంజూరు చేయాల్సిన స్కూల్ గ్రాంట్స్, ఎమ్మార్సీ, కాంప్లెక్స్ గ్రాంట్స్, విద్యా సంవత్సరం ముగిసే ముందు ఇస్తే ఏం ప్రయోజనం? స్కూల్ కాంప్లెక్సులకు అదనపు బాధ్యతలు అప్పగించారు తప్ప, ఆ మేరకు  గ్రాంట్లలో పెరుగుదల లేదు. గతంలో ఉన్న సర్వీస్ పర్సన్స్‌ని తొలగించడంతో పాఠశాలల్లో పారిశుద్ధ్యం అడుగంటింది. ఈ విషయాలన్నిటిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి. ఉన్నతస్థాయి సమీక్ష చేసి, యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సంఘాలతో చర్చించి, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

మానేటి ప్రతాపరెడ్డి

టిఆర్‌టిఎఫ్ గౌరవాధ్యక్షుడు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.