వైద్యశాఖలో వసూల్‌ రాజాలు

ABN , First Publish Date - 2022-05-28T09:32:33+05:30 IST

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో వసూల్‌ రాజాలు రెచ్చిపోతున్నారు. సర్వీస్‌ రెగ్యులరైజ్‌ చేయిస్తామని.. పదోన్నతులు

వైద్యశాఖలో వసూల్‌ రాజాలు

- రెగ్యులరైజేషన్స్‌, పదోన్నతుల పేరిట కలెక్షన్లు

- ఎల్టీ, ఫార్మసిస్టులు, హెచ్‌ఏ పోస్టులకే లక్షల్లో వసూలు చేయాలని టార్గెట్‌

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో వసూల్‌ రాజాలు రెచ్చిపోతున్నారు. సర్వీస్‌ రెగ్యులరైజ్‌ చేయిస్తామని.. పదోన్నతులు ఇప్పిస్తామని ఆశ చూపించి కిందిస్థాయి ఉద్యోగుల నుంచి పెద్ద మొ త్తంలో డబ్బు వసూల్‌ చేస్తున్నారు. జిల్లాల్లోని ఉద్యోగ సంఘాలకు సంబంధించిన కొందరు చోటామోటా నేత లు, సచివాలయ స్థాయి అధికారుల అనుచరవర్గం ఈ వసూళ్ల వెనక ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా దక్షిణ తెలంగాణలో ఓ జిల్లానుంచే ఈ వసూళ్ల పర్వానికి తెరలేచినట్లు చెబుతున్నారు. ఇలా వసూళ్లకు పాల్పడే నేతలు హైదరాబాద్‌లోని వైద్య ఆరోగ్యశాఖ ఉ న్నతాధికారులకు తాము చాలా సన్నిహితులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకోసం హెచ్‌వోడీలతో వారి కార్యాలయాల్లోనే ఫోటోలు దిగి వాటిని పలు వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేస్తున్నారు. ఫలానా హెచ్‌వోడీకి తాము చాలా సన్నిహితమంటూ చెప్పుకుంటూ... ఈ వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు. 

అప్పట్నుంచీ షురూ..

గతంలో వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో 272 మంది ల్యాబ్‌ టెక్నిషీయన్లను, 160 మంది ఫార్మసిస్టులను, దాదాపు 1200 మంది హెల్త్‌ అసిస్టెంట్లను తీసుకున్నారు. వారంతా ఇప్పటికీ కాంట్రాక్టు పద్ధతిలోనే పనిచేస్తున్నారు. వారిని రెగ్యులరైజ్‌ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ కొద్దిరోజుల క్రితం అంతర్గత సర్క్యులర్‌ జారీ చేసింది. అలాంటి ఉద్యోగుల వివరాలను సమర్పించాలని కోరింది. ఇక అప్పటినుంచి ఈ వసూళ్ల దందాకు తెరలేచింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ సర్క్యులర్‌ రాగానే సచివాలయంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి అనుచరులు కొందరు రంగంలోకి దిగారు. నేరుగా ఆ అధికారి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందులో రాష్ట్రస్థాయిలో ల్యాబ్‌ టెక్నీషియన్ల (ఎల్టీల) సంఘం ముఖ్యనేతగా పేరున్న ఓ ఉద్యోగి కీలకపాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎల్టీలు, ఫార్మసిస్టులు, హెల్త్‌ అసిస్టెంట్లు పోస్టుల రెగ్యులరైజేషన్‌ పేరిట కోటి రూపాయలు వసూలు చేయడమే వీరి లక్ష్యంగా చెబుతున్నారు. ఈ మేరకు ఖమ్మం జిల్లాల్లో ఫార్మసిస్టులు ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 10-20 వేలు ఇప్పటికే వసూలు చేశారు. అలాగే కరీంనగర్‌ జిల్లాలో ఒక నెల వేతనాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వసూళ్ల కోసమే ప్రత్యేకంగా జిల్లాకోఉద్యోగికి బాధ్యతలు అప్పగించారు. కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి వసూలు చేసే మొత్తాన్నిసచివాలయంలో ఫైల్‌ కదలికలకు, ఆర్థిక శాఖలో క్లియరెన్స్‌ కోసం వినియోగిస్తామని సదరు వసూల్‌ రాజాలు చెబుతున్నట్లు సమాచారం. వాస్తవానికి వైద్య ఆరోగ్యశాఖ ఎవరితోనూ సంబంధం లేకుండానే ఈ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందు కు పనిచేస్తోంది. అయితే డబ్బులిస్తేనే పని అవుతుందన్న ఒక ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చి.. వసూళ్ల కార్యక్రమం చేపట్టిట్లు తెలుస్తోంది. ఈ వ్యవహరంపై కొందరు ఉద్యోగులు ఇంటెలిజెన్స్‌ ఐజీలకు లేఖ రాసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

పదోన్నతులకూ..

వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్‌ ఎడ్యుకేటర్ల పదోన్నతుల విషయంలోనూ వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఈ కేటగిరి పోస్టుల పదోన్నతుల కోసం వైద్యశాఖ సర్వీసు పర్టిక్యులర్స్‌ పంపాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు కొద్దిరోజుల క్రితం ఒక సర్క్యులర్‌ పంపింది. హెల్త్‌ ఎడ్యుకేటర్లుగా పదోన్నతి వస్తే గెజిటెడ్‌ అధికారి హోదా వస్తుంది. దీనివల్ల జీతం పెరగడమే కాకుండా, హోదా కూడా మారుతుంది. దీంతో పదోన్నతుల జాబితాలో ఉన్నవారి నుంచి వసూళ్ల పర్వం సాగుతోంది. ఈ బాధ్యతను దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన చోటామోటా నేతలు తీసుకున్నారు. వారు ఒక్కో హెల్త్‌ఎడ్యుకేటర్‌ నుంచి లక్ష రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ దందాపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ల్యాబ్‌ టెక్నిషీయన్స్‌, ఫార్మసిస్టులు, హెల్త్‌ అసిస్టెంట్‌లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2022-05-28T09:32:33+05:30 IST