GHMC : ఆస్తి పన్ను వసూలు అదిరింది.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..

ABN , First Publish Date - 2022-05-01T12:04:06+05:30 IST

జీహెచ్‌ఎంసీలో ఆస్తి పన్ను వసూలు అదిరింది. పూర్వ ఎంసీహెచ్‌, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ

GHMC : ఆస్తి పన్ను వసూలు అదిరింది.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా..

  • రూ.738.71 కోట్లు 
  • రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు
  • ఫలించిన అధికారుల వ్యూహం
  • గతేడాదికంటే రూ.195కోట్లు అధికం

హైదరాబాద్‌ సిటీ : జీహెచ్‌ఎంసీలో ఆస్తి పన్ను వసూలు అదిరింది. పూర్వ ఎంసీహెచ్‌, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌లో అంచనాలను మించి పన్ను వసూలైంది. ఐదు శాతం రాయితీ గడువు శనివారంతో ముగియగా, చివరిరోజు జీహెచ్‌ఎంసీ ప్రధాన, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లోని సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాల వద్ద పౌరులు బారులు తీరారు. బల్దియా కేంద్ర కార్యాలయంలోని సీఎస్‌సీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్ను చెల్లింపుదారులతో సందడి కనిపించింది. శనివారం రాత్రి 10.15 గంటల వరకు రికార్డు స్థాయిలో రూ.738.71 కోట్ల పన్ను వసూలైంది. 7.22 లక్షల మంది పన్ను చెల్లించినట్టు రెవెన్యూ విభాగం వర్గాలు పేర్కొన్నాయి. 


కిందటి యేడాదితో పోలిస్తే రూ.195 కోట్ల పన్ను అధికంగా వసూలైంది. వసూలైన పన్నులో దాదాపు 45 శాతం ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా జరిగింది. 4.68 లక్షల మంది ఆన్‌లైన్‌లో రూ.325 కోట్ల మేర పన్ను చెల్లించారు. ఎక్కువ మొత్తం పన్ను చెల్లించే వారిపై బిల్‌ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ మొత్తం చెల్లించే పది మంది చుట్టూ తిరగడం కంటే.. రూ.లక్షల్లో పన్ను చెల్లించే వారి వద్దకు వెళ్లడం ద్వారా ఫలితం ఉంటుందని ఉన్నతాధికారులు సూచించారు. ఈ విషయంలో అధికారుల వ్యూహం ఫలించింది. 


ఐదు శాతం రాయితీ నేపథ్యంలో ఎక్కువ పన్ను చెల్లించే వారికి ఆర్థిక ప్రయోజనం కలుగనుండడంతో వారూ చెల్లింపునకు ఆసక్తి చూపారు. బిల్‌ కలెక్టర్లు రూ.281.02 కోట్లు వసూలు చేశారు. సంస్థలోని సీఎ్‌ససీల్లో 78.26 వేల మంది రూ.78.72 కోట్లు, మీ సేవా ద్వారా 81 వేల పైచిలుకు మంది రూ.48.40 కోట్లు చెల్లించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు పన్ను చెల్లింపునకు అవకాశముండడంతో ఆన్‌లైన్‌ ద్వారా వసూలయ్యే పన్ను మరింత పెరిగే అవకాశముంది.


రాత్రి 10.15 గంటల వరకు వసూలైన పన్ను...

రూ.738.71 కోట్లు 

చెల్లించిన వారు - 7,22,654 

ఆన్‌లైన్‌లో చెల్లించిన పన్ను - రూ.330.55 కోట్లు  

బిల్‌ కలెక్టర్ల ద్వారా వసూలైన పన్ను - రూ.281.01 కోట్లు



Updated Date - 2022-05-01T12:04:06+05:30 IST