ఇండియాను ఒంటరిని చేస్తున్న బీజేపీ: Rahul gandhi

ABN , First Publish Date - 2022-06-07T00:54:55+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నుంచి ప్రస్తుతం బహిష్కరణకు గురైన ఇద్దరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ..

ఇండియాను ఒంటరిని చేస్తున్న బీజేపీ: Rahul gandhi

న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నుంచి ప్రస్తుతం బహిష్కరణకు గురైన ఇద్దరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారంనాడు స్పందించారు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ మత దురహంకారం (Bigotry) ఇండియాను ఏకాకిని (Isolated) చేయడమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా మనకున్న స్థానాన్ని దెబ్బతీస్తుందని అని ఓ ట్వీట్‌లో రాహుల్ అన్నారు. ''అంతర్గతంగా విడిపోయి, అంతర్జాతీయంగా బలహీనపడతాం. బీజేపీ సిగ్గుచేటు మత దురహంకారం మనను ఒంటరిని చేయడమే కాకుండా, భారతదేశానికి అంతర్జాతీయంగా ఉన్న స్థానాన్ని కూడా దెబ్బతీస్తుంది'' అని ఆ ట్వీట్‌లో రాహుల్ విమర్శించారు.


మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు నుపర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు  ఇప్పటికే దుమారం రేపాయి. ఖతర్, కువైట్, బహ్రైన్, ఇరాన్, తదితర దేశాలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తమ దేశాల్లోని భారత రాయబారిని పిలిపించి తమ అసంతృప్తిని తెలియజేశాయి. భారతదేశ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని పలు దేశాల్లోని సోషల్ మీడియాలో పోస్టులు సైతం ప్రత్యక్షమయ్యాయి. దీనికి ముందే, బీజేపీ ఆదివారంనాడు ఒక ప్రకటనలో అన్ని మతాలు, మత విశ్వాసాలను భారత్ గౌరవిస్తుందని, మత ప్రముఖులను అవమానించే చర్యలను తీవ్రంగా ఖండిస్తామని తెలిపింది. ఆ వెంటనే బీజేపీ జాతీయ ప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Updated Date - 2022-06-07T00:54:55+05:30 IST