ఆగ్రోఫారెస్ట్రీపై..నజర్‌

ABN , First Publish Date - 2020-07-06T10:02:00+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఉద్యాన పంటలకు కేంద్ర బిందువుగా గుర్తించారు.

ఆగ్రోఫారెస్ట్రీపై..నజర్‌

జిల్లాలో అదనంగా 1,500 ఎకరాల్లో సాగుకు ప్రతిపాదన

శ్రీగంధం, వెదురు, సరుగుడు, మలబార్‌ వేప చెట్లు పెంచేలా ప్రోత్సాహం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా ఉద్యాన పంటలకు కేంద్ర బిందువుగా గుర్తించారు. ఆర్థికాభివృద్ధిలో ముందంజలో ఉంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ పంటల సాగు 94,239 ఎకరాల్లో విస్తరించడంతోపాటు సహజ వనరులను కలిగి ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 137ఎకరాల్లో ఆగ్రోఫారెస్ర్టీ సాగవుతున్నాయి. అదనంగా ఆగ్రోఫారెస్ర్టీ 1,500 ఎకరాల్లో వేసేలా ప్రతిపాదించారు. ఈ ఏడాది మరింత ఎక్కువ విస్తీర్ణంలో ఆగ్రోఫారెస్ర్టీ మొక్కలను పెంచాలని రైతులు కోరుకుంటున్నారు. ఉద్యానశాఖకు సాంకేతిక సహకారం ఉండటంతో ఈసారి పెంచిన అదనపు సాగును ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేస్తున్నారు. శ్రీగంధం, వెదురు, సరుగుడు చెట్లు, మలబార్‌ వేప చెట్లను పెంచేలా ఉపాధిహామీ పథకం కింద రైతులను ప్రోత్సహిస్తున్నారు. 


సాగు ఖర్చు గణనీయంగా పెరగడం, గిట్టుబాటు ధర లభించలేకపోవడం వల్ల రైతులు నిత్యం కష్టాలు పడుతున్నారు. సాగుకు దూరం కాకుండా... ఆదాయం పెంచుకునేందుకు రైతులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచేలా పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నేడు అతి తక్కువ ఖర్చుతో అధికలాభాలు ఇచ్చే కలప (వుడ్‌) పంటలను ఉద్యానశాఖ సబ్సిడీ ద్వారా రైతులను ప్రోత్సహిస్తున్నారు. భూముల విలువ పెరగడం నీటి వసతులు తగ్గడం కూలీల లభ్యత లేకపోవడం వంటి సమస్యతో సంప్రదాయ పంటల వ్యవసాయం కొట్టుమిట్టాడుతోంది. ఈనేపథ్యంలో రైతులు సమస్యల సవాళ్లుగా తీసుకుని.. తక్కువ ఖర్చుతో ఉండే దీర్ఘకాలిక పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి డాక్టర్‌ ఎస్‌.సునందరాణి పేర్కొంటున్నారు. 


సిరుల ‘శ్రీగంధం’

డబ్బు చెట్టుగా పిలువబడే శ్రీగంధం చెట్లు సుగంధ పరిమళాలతోపాటు ఎన్నో విశిష్ట ఔషద గుణాలు ఉన్న ఈ కల్పవృక్షంతో లాభాలు అధికంగా వస్తున్నాయి. శ్రీగంధం చెట్టులో ఏ ఒక్క భాగం వృథా కాదు. దీనిని రైతులు నిరభ్యంతరంగా పెం చవచ్చు. ఈ శ్రీగంధం చెట్లు అధికంగా విదేశాల్లో పెంచుతారు. కానీ.. ఇండియాలో దీని ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. తెలంగాణలో పండిన శ్రీగంధం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. సెంటు, ఆయిల్స్‌, అగర్బత్తి, సబ్బులను ఉత్పత్తి చేసేందుకు ఈ చెట్టు తోడ్పడుతుంది. శ్రీగంధం పెంచడానికి ఎర్ర నేలలు అనువైనవి. దీనికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌ ఎల్లప్పుడూ ఉం టుంది.


శ్రీ గంధం మొక్కలను ఏక పంటగా కాకుండా ఇతర పంటలైన మల్బరీ, వేప, నేరేడు, జామ, కంది కలిపి సహ పంటగా సాగు చేస్తే బతుకుదల శాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పరాన్న జీవి.. దీనికి కావాల్సిన నీటిలో లవణాల కోసం ఇతర పంట వేర్లపై ఆధారపడుతుంది. శ్రీగం ధం వేసుకోవాల్సిన రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.15,000- 2000 పెట్టుబడికిగాను రూ.36 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఎకరానికి 5-10 టన్నుల దిగుబడి వస్తుంది. ఇది ఒక టన్నుకి రూ.60 లక్షల ధర పలుకుతుంది. 


మిలియా దూబియా (మలబార్‌ వేప)

మిలియా దూబియా చెట్టు ఇటీవల రైతుల ఆదరణ పొందుతుంది. నీటివసతి ఉన్న భూముల్లో తక్కువ శ్రమ, పెట్టుబడితో స్థిరమైన ఆదాయం వచ్చే ఈ చెట్లను సాగు చేయాలని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. దీనికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ మలబార్‌ వేప చెట్లను ముఖద్వారం, కిటికీలు, వ్యవసాయ పనిముట్లు, ఫ్లైవుడ్‌, ఇంటీరియర్‌ డెకరేషన్‌కు, అగ్గిపుల్లలు, రేకుల తయారీకి ఉపయోగిస్తారు. దీనిని బంజారు భూముల్లో, వృథాగా పడి ఉన్న భూముల్లో సాగు చేసుకోవచ్చు. తెలుగు రాష్ర్టాల్లో కల్పజాతి వృక్షాల్లో మలబార్‌ వేప చెట్టు సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా రాష్ర్టాల్లో దీన్ని ఎక్కువగా పెంచుతున్నారు.


వెదురు (బామ్‌భూ)

వెదురు పేదవారి కల్పవృక్షం. పచ్చ బంగారం, ప్రజల స్నేహితుడని అంటారు. ఈ చెట్లను రాష్ట్రంలో ఆదిలాబాద్‌, ఖమ్మంలో ఎక్కువగా పెంచుతారు. ఈ చెట్ల సాగుకు ఇసుకతో కూడిన బంకమన్ను, ఎర్రనేల, నల్లరేగడి నేలలు అనుకూలం. రైతులు తమకున్న కొద్దిపాటి పొలం గట్లపైన కూడా నాటుకోవచ్చు. చైనా తర్వాత మన రాష్ట్రంలో వెదురు సాగుకి మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. తట్టలు, బుట్టలు, చాట, సంగీత, సాధనాల నుంచి ఫర్నిచర్‌ సామగ్రి వరకు, ఇళ్ల నిర్మాణానికి, మొక్కలకు, ఊతర కర్రలుగా వ్యవసాయంలో ఉంచుకోవచ్చు. ఎకరానికి రూ.40 వేల పెట్టుబడికి రూ.1,65,000 ఆదాయం వస్తుంది. ఎకరానికి 10టన్నుల దిగుబడి వస్తుంది. ఇది టన్నుకు రూ.15 వేలు పలుకుతుంది. ఎకరానికి రూ.15 లక్షల ఆదాయం ఐదు నుంచి పదేళ్ల వరకు ప్రతి సంవత్సరం వస్తుంది.


సరుగుడు 

ఈ మొక్క చాలావేగంగా పెరుగుతుంది. ఇది 50 నుంచి 100ఫీట్ల ఎత్తు పెరుగుతుంది. ఈ మొక్క భూసారాన్ని పెంచుతుంది. వాతావరణం, నత్రజనిని పెంపొందిస్తుంది. దీనిని పేపర్‌ తయారీలో, వ్యూయల్‌ తయారీలో ఉపయోగపడుతుంది. ఇందులో నువ్వులు కానీ, వేరుశనగ, కర్బూజా, పప్పుదినుసులు అంతర్‌ పంట వేసుకోవచ్చు. ఈ పంట నాలుగేళ్లలో వస్తుంది. 16 నుంచి 40 టన్నులు దిగుబడి వస్తుంది. 

Updated Date - 2020-07-06T10:02:00+05:30 IST