మరో ఎత్తిపోతల

ABN , First Publish Date - 2020-08-08T09:55:43+05:30 IST

జిల్లాలో మరో ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

మరో ఎత్తిపోతల

జీఎన్‌ఎ్‌సఎ్‌స కెనాల్‌ ఆధారంగా ఓర్వకల్లు వద్ద..

రూ.1200 కోట్లతో ప్రతిపాదన.. 10వేల ఎకరాల సేకరణ 

కెనాల్‌ నుంచి లిఫ్ట్‌ చేయకూడదనే నిబంధనలు

గుండ్రేవులే ఉత్తమం అంటున్న నిపుణులు 

ఓర్వకల్లు లిఫ్ట్‌ తప్పనిసరంటున్న అధికారులు


కర్నూలు, ఆంధ్రజ్యోతి: జిల్లాలో మరో ఎత్తిపోతల పథకానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఓర్వకల్లు సమీపాన గడివేముల మండలం గని వద్ద ఈ పథకానికి 10 వేల ఎకరాల భూసేకరణ కోసం అఽధికారులు యత్నిస్తున్నారు. రూ.1200 కోట్ల అంచనాలతో జలవనరుల శాఖాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఓర్వకల్ల్లు, యంబాయి, ఉయ్యాలవాడ పరిసరాల్లోని వాటర్‌ క్యాచ్‌మెంట్‌తో పాటు అందుబాటులోని జీఎన్‌ఎ్‌సఎ్‌స కెనాల్‌ నుంచి నీటిని లిఫ్ట్‌ చేస్తూ 15.7 టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు చేయాలన్నది అధికారుల నిర్ణయం.


వాస్తవానికి ఎత్తిపోతల పథకాలు నదీ జలాలపై ఏర్పాటు చేయవచ్చుగానీ కెనాల్స్‌పై నిర్మించడానికి వీల్లేదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ప్రతిపాదిత లిఫ్ట్‌ ఇరిగేషన్‌ 80 శాతం జీఎన్‌ఎ్‌సఎ్‌సపైనే ఆధారపడి ఉంటుంది. నిపుణులు మాత్రం జిల్లా నీటిపారుదల ప్రయోజనాలకు గుండ్రేవుల ఉత్తమమని అంటున్నారు. ఈ కొత్త ప్రతిపాదన కొందరి ప్రయోజనాల కోసమే ముందుకు వచ్చిందని విమర్శిస్తున్నారు. దీని వల్ల ఇప్పటికే ప్రభుత్వం పక్కన పెట్టిన గుండ్రేవుల శాశ్వతంగా మరుగునపడిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 


శ్రీశైలం జలాశయం నుంచి విభజన చట్టం కింద 38 టీఎంసీలను జీఎన్‌ఎ్‌సఎ్‌సకు తీసుకోవాలి. బానకచర్ల నుంచి మొదలయ్యే జీఎన్‌ఎ్‌సఎ్‌స కర్నూలు జిల్లాను దాటుకుని కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వరకు సుమారు 500 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. కాగా ఆ కెనాల్‌పై ఆధారపడి సుమారు 8.44 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతోంది. ఓర్వకల్లు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ వల్ల ఆ ప్రాంతంలో 20 వేల ఎకరాలకు మాత్రమే ప్రత్యేకంగా నీరందుతుంది. దీనివల్ల నీరందకుండాపోయే లక్షల ఎకరాల రైతులు ఈ లిఫ్ట్‌ను వ్యతిరేకించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రాయలసీమ లిఫ్ట్‌ పథకం సిద్ధమైతే తద్వారా జీఎన్‌ఎ్‌సఎ్‌సకు పెరిగే నీటి నుంచి ఈ ప్రతిపాదిత లిఫ్ట్‌కు నీరు తీసుకోవచ్చని అధికారులు అంటున్నారు.


అయితే ఫ్లడ్‌ వాటర్‌ నుంచి అక్రమంగా నీరు తీసుకెళ్లడం సరికాదని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కోర్టుకు వెళ్లింది. ఈ వివాదం తెగక ముందే మరో లిఫ్ట్‌కు ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. ఇన్ని వివాదాలు, వ్యయ ప్రయాసల కంటే గుండ్రేవులపైనే అధికారులు ఒత్తిడి తేవాలని రైతు సంఘాలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

కర్నూలుతో పాటు 220 గ్రామాలకు..

ఓర్వకల్లు ప్రాజెక్టు ద్వారా పరిసర ప్రాంతాల్లోని 20 వేల ఎకరాలకు, కర్నూలు నగరంలోని 40 లక్షల మంది జనాభాకు, చుట్టు పక్కల గల 220 గ్రామాలకు సరిపడా తాగు, సాగు నీరు అందించవచ్చని అంటున్నారు. కర్నూలుకు 60-70 కిలోమీటర్ల దూరం నుంచి నీరు తరలిస్తున్నట్లు అధికారులు అంటున్నారు. కర్నూలు పరిసర ప్రాంతాల్లో స్టోరేజీకి అవకాశం లేనందున లిఫ్ట్‌ ద్వారా కర్నూలుకు నీరివ్వడంతో పాటు ఓర్వకల్లు వద్ద ఎయిర్‌పోర్టు, ఇండస్ర్టియల్‌ హబ్‌ అభివృద్ధి చెందితే పరిశ్రమలకు కూడా నీరందించవచ్చు అనే ఆలోచన ఈ ప్రతిపాదనలో ఉంది. వాస్తవానికి కేసీ కెనాల్‌ నుంచి డ్రింకింగ్‌ వాటర్‌ నగరంలోని పంపింగ్‌ హౌస్‌కు నేరుగా వస్తుండగా 60-70 కిలోమీటర్ల నుంచి ఎందుకు తరలించాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శకులు అంటున్నారు. 


గుండ్రేవులను గుర్తించండి

ఓర్వకల్లు లిఫ్ట్‌ కోసం రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి, ప్రతి ఏటా నిర్వహణకు అదనంగా వెచ్చించడం కంటే ఒకేసారి గుండ్రేవులపై ఖర్చు పెడితే దశాబ్దాల తరబడి కేసీ కెనాల్‌ కింద ఉండే 2.65 లక్షల ఎకరాలు సాగు నీరు అందించవచ్చు. పైగా ఓర్వకల్లు లిఫ్ట్‌ తరహా కాకుండా గుండ్రేవుల పూర్తి గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు కాబట్టి ఇతరత్రా ఖర్చులు కూడా ఉండవనే అభిప్రాయాలు నిపుణులు వెలిబుచ్చుతున్నారు. చంద్రబాబు హయాంలో ఉత్తర్వులు జారీ చేశారన్న కారణంతో ప్రస్తుత ప్రభుత్వం గుండ్రేవులను పక్కన పెట్టి.. ఓర్వకల్లు లిఫ్టు ప్రతిపాదనలు ముందుకు వెళితే ఇక ఆ ప్రాజెక్టును పూర్తిగా పట్టించుకోరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పోటీగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిసి నిర్ణయించాల్సిన గుండ్రేవుల ప్రాజెక్టుకు భూసేకరణ అత్యంత కీలకమని, అక్కడి భూముల ధరకు మూడింతల పరిహారం ఇచ్చే పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


ఓర్వకల్లు ప్రాజెక్టుకు కావాల్సిన 10 వేల ఎకరాలకుగాను ప్రభుత్వ భూములు 6వేల ఎకరాలకు పైగా ఉండగా.. మరో 4 వేల ఎకరాల పట్టా భూములున్నాయనే ధీమా అధికారుల్లో కనిపిస్తోంది.పైగా సొంత భూభాగం కాబట్టి భూసేకరణకు పెద్దగా సమస్యలుండవని అధికారులు అంటున్నారు. గుండ్రేవులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో భారీ నష్టం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. కళ్లెదురుగా ఉన్న నీటిని లిఫ్ట్‌ ద్వారా చుట్టూ తిప్పి తీసుకరావడం ఎందుకని, దీని బదులు గుండ్రేవుల నిర్మిస్తే జిల్లా సశ్యశ్యామలం అవుతుందని అంటున్నారు. 

Updated Date - 2020-08-08T09:55:43+05:30 IST