నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై జమ్మూ-కశ్మీరు పార్టీల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-21T17:22:16+05:30 IST

జమ్మూ-కశ్మీరు శాసన సభ నియోజకవర్గాల పునర్విభజనపై

నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలపై జమ్మూ-కశ్మీరు పార్టీల ఆందోళన

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు శాసన సభ నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో కొత్తగా ఆరు నియోజకవర్గాలను, కశ్మీరు ప్రాంతంలో కొత్తగా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదించడంతో పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. 


డీలిమిటేషన్ కమిషన్ సమావేశం సోమవారం న్యూఢిల్లీలో జరిగింది. జస్టిస్ (రిటైర్డ్) రంజన ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, జస్టిస్ (రిటైర్డ్) హస్నయిన్ మసూది, మహమ్మద్ అక్బర్ లోన్, బీజేపీ నేతలు జితేంద్ర సింగ్,  జుగల్ కిశోర్ సభ్యులుగా ఉన్నారు. సోమవారం జరిగిన సమావేశం చేసిన ప్రతిపాదనలు ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని రాజకీయ పార్టీలకు ఆగ్రహం తెప్పించాయి. కశ్మీరులో నాలుగు స్థానాలను, జమ్మూలో మూడు స్థానాలను పెంచేందుకు ప్రతిపాదిస్తుందని ఈ పార్టీలు మొదట్లో భావించాయి. 


2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతోంది. ఈ లెక్కల ప్రకారం,  జమ్మూ-కశ్మీరు జనాభా 122.39 లక్షలు. వీరిలో 68.88 లక్షల మంది అంటే 56.28 శాతం మంది కశ్మీరులో ఉన్నారు. 53.50 లక్షల మంది అంటే 43.71 శాతం మంది జమ్మూలో ఉన్నారు. 


డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనల ప్రకారం, జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతం శాసన సభలో 90 మంది సభ్యులు ఉంటారు. జమ్మూ నుంచి 43 మంది సభ్యులు, కశ్మీరు నుంచి 47 మంది సభ్యులు ఉంటారు. అధికరణ 370 రద్దు, జమ్మూ-కశ్మీరు విభజనకు పూర్వం జమ్మూలో 37 శాసన సభ నియోజకవర్గాలు, కశ్మీరులో 46 నియోజకవర్గాలు, లడఖ్‌లో నాలుగు నియోజకవర్గాలు ఉండేవి. ఇప్పుడు లడఖ్ ప్రత్యేకంగా ఓ కేంద్ర పాలిత ప్రాంతం అయిన సంగతి తెలిసిందే. 


ఎస్టీలకు రిజర్వేషన్లు

జమ్మూ-కశ్మీరు పునర్విభజన చట్టం, 2019 ప్రకారం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో నియోజకవర్గాల సంఖ్యను 90కి పెంచారు. ఈ శాసన సభలో 9 స్థానాలను షెడ్యూల్డు తెగలకు కేటాయించారు. వీరికి ఈ విధంగా రిజర్వేషన్ కల్పించడం ఇదే తొలిసారి. అంతకుముందు మాదిరిగానే షెడ్యూల్డు కులాలవారికి ఏడు స్థానాలను కొనసాగిస్తున్నారు. 


ఒమర్ అబ్దుల్లా స్పందన

డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదలనపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ఈ సిఫారసులు ఆమోదయోగ్యం కాదని చెప్పారు. బీజేపీ రాజకీయ ఎజెండాను ఈ కమిషన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. ఇది చాలా నిరుత్సాహకరమన్నారు. శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన చేస్తామని ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాజకీయ వైఖరితో ఈ ప్రతిపాదనలు చేసిందన్నారు. 


నిష్పాక్షిక ప్రతిపాదనలు 

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, డీలిమిటేషన్ కమిషన్ ప్రతిపాదనలు న్యాయంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కమిషన్ కృషిని పార్టీలకు అతీతంగా అందరు అసోసియేట్ మెంబర్స్ ప్రశంసించారన్నారు. 


Updated Date - 2021-12-21T17:22:16+05:30 IST