నడి వయసు నలత... ప్రోస్టేట్‌

ABN , First Publish Date - 2021-02-23T07:00:10+05:30 IST

యాభై అయిదేళ్ల ప్రభాకర్‌కు ప్రతి రోజూ సాయంత్రం పార్క్‌లో, మిత్రులతో కాలక్షేపం చేయడం అలవాటు. కానీ కొన్ని రోజులుగా తనకెంతో ఇష్టమైన ఆ వ్యాపకాన్ని మానుకుని, ఇంటికే పరిమితమైపోయారు...

నడి వయసు నలత...  ప్రోస్టేట్‌

యాభై అయిదేళ్ల ప్రభాకర్‌కు ప్రతి రోజూ సాయంత్రం పార్క్‌లో, మిత్రులతో కాలక్షేపం చేయడం అలవాటు. కానీ కొన్ని రోజులుగా తనకెంతో ఇష్టమైన ఆ వ్యాపకాన్ని మానుకుని, ఇంటికే పరిమితమైపోయారు. ఇందుకు కారణం ఆయన ఎదుర్కొంటున్న ఓ ఇబ్బంది. రాత్రుళ్లు ఒకటికి నాలుగుసార్లు మూత్రవిసర్జన కోసం మేలుకుంటున్నారాయన. అయినా ఇంకా మూత్రం మిగిలిపోయినట్టే అనిపించడం, తెలియకుండానే దుస్తుల్లో మూత్రం లీక్‌ అవుతుండడం... లాంటివి ఆయన్ను తరచుగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్య ఆయన ఒక్కరికే పరిమితం కాదు. అదే వయసులో ఉన్న ఎంతోమంది మగవాళ్లను వేధించే సమస్యే ఇది. 50, ఆ పై వయస్కులైన పురుషులలో కనిపించే ఈ సమస్యకు కారణం ప్రోస్టేట్‌ గ్రంథి పెరగడం.


పెరిగే వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉండడం సహజం. ఆ కోవలోకి వచ్చేదే ప్రోస్టేట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌. మధ్యవయసులోకి అడుగు పెట్టిన మగవాళ్లందరిలో ప్రోస్టేట్‌ గ్రంథి పెరగడం మొదలుపెడుతుంది. అయితే గ్రంథి పెరుగుదల ఒక్కకరిలో ఒక్కోలా ఉండవచ్చు. కొందరిలో ఏడాదికి 0.5 గ్రాముల చొప్పున, మరికొందరిలో ఒక గ్రాము చొప్పున పెరుగుతూ ఉండవచ్చు. అంతమాత్రాన  ప్రతి ఒక్కరికీ చికిత్స అవసరం లేదు. ఈ గ్రంథి పెరగడం మూలంగా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పుడు మాత్రమే సమస్యగా పరిగణించి, చికిత్స మొదలుపెట్టాలి. ప్రోస్టేట్‌ గ్రంథి పెరగడం మూలంగా మూత్ర సమస్యలు మొదలై దైనందిన జీవితం ఇబ్బందిగా మారుతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు.


పదే పదే అదే ఇబ్బంది

ప్రోస్టేట్‌ గ్రంథి పెరిగితే, ఆ ప్రభావం ప్రధానంగా మూత్రాశయం మీద పడుతుంది. గ్రంథి పెరుగుదలను బట్టి లక్షణాల తీవ్రతలో హెచ్చుతగ్గులుంటాయి. ప్రోస్టేట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌లో ప్రధానంగా కనిపించే లక్షణాలు....


  1. రాత్రుళ్లు మూత్రవిసర్జన కోసం రెండు నుంచి నాలుగు సార్లు నిద్ర లేస్తూ ఉండడం
  2. మూత్రవిసర్జన సమయంలో మూత్రం వెలుపలికి రాకపోవడం
  3. మూత్రవిసర్జనకు ఎక్కువ సమయం పడుతూ ఉండడం
  4. మూత్రవిసర్జన చేసిన కొద్దిసేపటికే మళ్లీ చేయాలనిపించడం
  5. మూత్రవిసర్జన సమయంలో మంట
  6. దుస్తుల్లో మూత్రం లీక్‌ అవడం


సర్జరీ కొందరికే...

ప్రోస్టేట్‌ గ్రంథి పెరిగిన ప్రతి ఒక్కరికీ సర్జరీ అవసరం ఉండదు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రతిస్తే మందులతో సమస్య అదుపులోకి వస్తుంది. అలా కాకుండా మూత్రవిసర్జన జరగనప్పుడు, మూత్రవిసర్జనకు సంబంధించి సమస్య ఎక్కువై దైనందిన జీవితం ఇబ్బందిగా మారినప్పుడు సర్జరీ అవసరం పడవచ్చు. మూత్రవిసర్జన పూర్తిగా జరగకుండా మూత్రాశయంలో మూత్రం మిగిలిపోవడం మూలంగా తరచుగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లకు గురవుతూ ఉన్నా, మధుమేహులై ఉండి జ్వరం బారిన పడుతున్నా తప్పనిసరిగా యూరాలజిస్ట్‌ను సంప్రతించాలి. ఇలాంటివారికి తీవ్రతను బట్టి లేజర్‌ సర్జరీ అవసరం పడుతుంది. 100లో 2 నుంచి 3ు మందికి మాత్రమే ఈ సర్జరీ చేయాల్సి రావచ్చు. లేజర్‌ సర్జరీలో మూత్రవిసర్జన మార్గానికి అడ్డుపడుతున్న పెరిగిన ప్రోస్టేట్‌ గ్రంథిని కోసి తొలగిస్తారు. ఇది కోత లేని సర్జరీ. 


కేన్సర్‌ను ఓడించవచ్చు!

మిగతా కేన్సర్లతో పోలిస్తే ప్రోస్టేట్‌ కేన్సర్‌ను చికిత్సతో లొంగదీసుకోవడం తేలికే! ఎంతటి తీవ్ర దశలో బయల్పడినా సమర్థమైన చికిత్సతో జీవితకాలాన్ని 10 నుంచి 15 ఏళ్ల వరకూ పెంచుకునే వీలుంది. కుటుంబ చరిత్రలో కేన్సర్‌ కలిగినవాళ్లు కొంత అప్రమత్తంగా ఉండాలి. 50 ఏళ్లకు చేరుకున్నప్పటి నుంచి, ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేయించుకుంటూ ఉంటే ఈ కేన్సర్‌ను తొలి దశలోనే కనిపెట్టవచ్చు. ప్రారంభంలో కేన్సర్‌ చికిత్స వల్ల సత్ఫలితాలుంటాయి. 




ప్రోస్టేట్‌ కేన్సర్‌


కొందర్లో ప్రోస్టేట్‌ గ్రంథిలో కేన్సర్‌ పెరుగుదల తలెత్తవచ్చు. 500 మందిలో నలుగురు లేదా ఐదుగురికి మాత్రమే తలెత్తే ప్రోస్టేట్‌ కేన్సర్‌, కేవలం 60 అంతకన్నా ఎక్కువ వయసున్న పురుషుల్లోనే కనిపిస్తుంది. వీరిలో గ్రంథి పెరుగుదల వేగం ఎక్కువ. ఇలాంటి వారికి మొదట బయాప్సీ చేసి, కేన్సర్‌ వ్యాధిని నిర్థారించుకోవాలి. ఆ తర్వాతే కేన్సర్‌ తీవ్రతను బట్టి రోబోటిక్‌ సర్జరీ, హార్మోనల్‌ చికిత్సలు ఎంపిక చేస్తారు. సాధారణంగా ప్రోస్టేట్‌ కేన్సర్‌ తీవ్ర దశకు చేరుకున్న తర్వాతే బయల్పడుతూ ఉంటుంది. గ్రంథి విపరీతంగా పెరిగిపోయి, కేన్సర్‌ శరీరంలోని ఇతర అవయవాలకు పాకిన దశలో చికిత్స వల్ల పూర్తి ఫలితాలు సాధించడం కష్టం. కాబట్టి కేన్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించడం కోసం 50 ఏళ్లకు చేరుకున్న ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకోసారి ప్రోస్టేట్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. ప్రోస్టేట్‌ స్పెసిఫిక్‌ యాంజీజెన్‌(పిఎస్‌ఎ) పరీక్ష ద్వారా ఫలితాన్ని బట్టి కేన్సర్‌ ప్రోస్టేట్‌ గ్రంథికే పరిమితమై ఉందా? లేదా  లింఫ్‌నోడ్స్‌, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందా? అనేది తెలుస్తుంది. ఆ తీవ్రతను అంచనావేసి, తగిన చికిత్సను వైద్యులు నిర్ణయిస్తారు. 


లైంగిక సామర్ధ్యానికి ఢోకా లేదు

ప్రోస్టేట్‌ గ్రంథి గురించి, లైంగిక శక్తిలో దాని పాత్ర గురించి బోలెడన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి ఈ గ్రంథి చికిత్స, సర్జరీల వల్ల లైంగిక సామర్థ్యం, అంగ స్తంభనం, లైంగిక తృప్తిలో ఎటువంటి లోటూ జరగదు. సుఖప్రాప్తి సమయంలో వీర్యం స్ఖలనం జరగదు. లైంగిక సామర్థ్యం పూర్వం మాదిరిగానే ఉంటుంది. ప్రోస్టేట్‌ సమస్య 50 ఏళ్లు దాటిన తర్వాతే మొదలవుతుంది కాబట్టి ఆ వయసులో పిల్లలను కనాల్సిన అవసరమూ ఉండకపోవచ్చు. కాబట్టి వీర్య స్ఖలనం కాకపోయినా చింతించాల్సిన అవసరం లేదు. 




తొలగించినా నష్టం లేదు

మూత్రవిసర్జన నియంత్రణలో ప్రోస్టేట్‌ గ్రంథి పాత్ర ఉంటుంది. అలాగే స్వల్ప పరిమాణంలో వీర్యం ప్రోస్టేట్‌ గ్రంథిలో ఉత్పత్తి అవుతుంది. ఇంతకుమించి ఈ గ్రంథితో అదనపు ప్రయోజనాలు ఉండవు. కాబట్టి కేన్సర్‌ సోకిన ప్రోస్టేట్‌ను నిరభ్యంతరంగా తొలగించుకోవచ్చు. అలాగని ముందుగానే ఈ గ్రంథిని తొలగించుకుని కేన్సర్‌ ముప్పు తప్పించుకోవాలని అనుకోవడం పొరపాటే. తండ్రికి ప్రోస్టేట్‌ కేన్సర్‌ వచ్చింది కాబట్టి కేన్సర్‌ రాకముందే ఈ గ్రంథిని తొలగించుకుందామనుకునే కొడుకులూ ఉంటారు. కానీ అలా తొలగించుకోవాలనే ఆలోచన మానుకుని స్ర్కీనింగ్‌ పరీక్షతో ప్రోస్టేట్‌ మీద ఓ కన్నేసి ఉంచితే సరిపోతుంది.


నియంత్రణ మన చేతుల్లోనే..

సాధారణంగా ప్రోస్టేట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ ఇతరత్రా ఆరోగ్య పరీక్షల కోసం చేసిన స్కానింగ్‌లో బయల్పడుతూ ఉంటుంది. అప్పటికి లక్షణాలూ ఉండకపోవచ్చు. అంతమాత్రాన కంగారు పడవలసిన అవసరం లేదు. మరింత పెరగకుండా ఆ గ్రంథి మీద, బయల్పడే లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి. ఇందుకోసం వైద్యుల సూచన మేరకు స్ర్కీనింగ్‌ టెస్ట్‌ చేయించుకుంటూ, మూత్ర సంబంధ ఇబ్బందులను కనిపెడుతూ ఉంటే అవసరాన్ని బట్టి మందులతోనే ఈ గ్రంథి పెరుగుదలకు అడ్డుకట్ట వేసుకోవచ్చు. ఈ మందులు కొందరికి ఐదేళ్ల పాటు పనిచేస్తే, మరికొందరిక పదేళ్ల పాటు పనిచేస్తాయి. అయితే ఈ మందుల ప్రభావం తగ్గిపోయినా, మందులు వాడుతున్నప్పటికీ మూత్ర సమస్యలు పెరిగిపోతున్నా సర్జరీ అవసరం పడవచ్చు. కేన్సర్‌ అయితే రోబోటిక్‌, కేన్సర్‌ కానప్పుడు లేజర్‌ సర్జరీలు చేయవలసి ఉంటుంది. 


పెద్దవయసులో సర్జరీ

కంటికి సంబంధించి శుక్లాల సమస్య పెద్ద వయసులోనే మొదలవుతుంది. అలాగని సర్జరీ చేయించుకోకుండా ఉండలేం కదా? అలాగే ప్రోస్టేట్‌ సర్జరీ కూడా! సమస్య పెద్ద వయసులోనే మొదలవుతుంది కాబట్టి ఆ వయసులో సర్జరీ తప్పదు. సాధారణంగా సర్జరీ అనగానే పెద్దవయసులో అంతటి సర్జరీ తట్టుకోగలరా? అనే సంశయం, భయం మొదలవుతాయి. కానీ లేజర్‌ సర్జరీలో ఎటువంటి కుట్లూ, కోతలూ ఉండవు కాబట్టి భయాలు వీడాలి. 

డాక్టర్‌ ఎ. సూరిబాబు,

సీనియర్‌ యూరాలజిస్ట్‌, రోబోటిక్‌ అండ్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌,

యశోదా హాస్పిటల్స్‌,

సికింద్రాబాద్‌.

Updated Date - 2021-02-23T07:00:10+05:30 IST