అసైన్డ్‌ భూములను కాపాడండి..!

Aug 3 2021 @ 02:19AM
వినతిపత్రం ఇస్తున్న ఉగ్ర తదితరులు

కనిగిరి, ఆగస్టు 2: అసైన్డ్‌ ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు దర్జాగా వెలుస్తున్నాయి. ఆయా భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన పేద ప్రజలు నిలువున మోసపోతున్నారు. దీనిపై న్యాయం చేయాలని టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ ప్రకా్‌షను కోరారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం కొండపి ఎమ్మెల్యే స్వామితో పాటు వెళ్లి లేఅవుట్‌ కాపీలతో సహా పూర్తి ఆధారాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ అక్రమాలపై గతంలోనూ ‘ఆంధ్రజ్యోతి’ సహేతికంగా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే.

 కొని మోసపోతున్న ప్రజలు

 అక్రమంగా అనధికారిక వెంచర్లు వేసి అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి ప్లాట్లను అమ్ముతారు. తద్వారా కోట్లాది రూపాయలను రియాల్టర్లు దండుకుంటున్నారు. మాయమాటలు నమ్మిన ప్రజలు ఒక్కొక్క ప్లాటు లక్ష నుంచి మూడు లక్షల వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారి కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది. కనిగిరి నగర శివారు ప్రాంతాల్లో ఎటువైపు చూసినా అక్రమవెంచర్లు ఇబ్బడిముబ్బడిగా వేసినా అధికారులకు మాత్రం అవేవీ కనపడక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆయా శాఖల ఉన్నతాధికారులకే తెలియాలి. కందుకూరు రోడ్డులోని కస్తూర్భాగాంధీ పాఠశాల సమీపంలో 26వ సర్వే నెంబర్‌లో దాదాపు 3 ఎకరాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి పట్టాలు కూడ ఇప్పిస్తామని ఒక్కొక్క పట్టాకు ఆయా భూమి యజమాని 15 వేల నుంచి 25 వేల వరకు అదనంగా వసూళ్లు చేసిన సంఘటనలు ఉన్నాయి. 

 అక్రమంగా  వెంచర్లు వెలసిన నంబర్లు ఇవే..

కనిగిరి మండలంలో 202/ఏ, 203/సి, 615/2, 870/1, 900/ఏ, 901/ఏ, 901/సిలలో, చాకిరాల రెవెన్యూ గ్రామ పరిధిలోని 26/3, 26/7, 26/8, తుమ్మకుంట రెవెన్యూ గ్రామ పరిఽధిలోని 300/5, 302/2, శంఖవరం రెవెన్యూ గ్రామ పరిఽధిలోని 187/1, 187/2, 581, 653/ఏ1, 653/ఏ2, 719/2, 725/1, 726/3, చల్లగిరిగల రెవెన్యూ గ్రామ పరిఽధిలోని 297/ఏ, 298/ఏ, 404/ఏ, 404/బి, పేరంగుడిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని 26వ సర్వేనెంబర్‌, చిన్నఇర్లపాడు రెవెన్యూ గ్రామ పరిఽధిలోని 43/2, 46/2, బాలవెంకటాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని 5/1 సర్వే నెంబర్లలలో అక్రమంగా వెంచర్లు వేశారు. దాదాపు 79 ఎకరాల్లో అక్రమ వెంచర్లు వేయగా, ఇంకా పలుచోట్ల ప్రభుత్వ, అసైన్డ్‌, డొంక, వాగు, పోరంబోకు భూములు అక్రమార్కుల చేతుల్లో కబ్జాకు గురయ్యాయి. ఇంతపెద్ద ఎత్తున భూ దందా జరుగుతున్న అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో మీనమీషాలు లెక్కిస్తున్నారు. ఈ మేరకు అమాయకపు ప్రజలు మోస పోతునన్నారని గుర్తించిన కనిగిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం అసైన్డ్‌, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన అధారాలను కలెక్టర్‌ ముందు ఉంచారు. ఏలేవారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.