అడవి తల్లికి రక్షాబంధనం

ABN , First Publish Date - 2022-08-13T07:55:34+05:30 IST

అడవి తల్లికి రక్షాబంధనం

అడవి తల్లికి రక్షాబంధనం

కృత్రిమ మేధతో వన్యప్రాణుల సంరక్షణ.. కెమెరాలన్నీ జీపీఎ్‌సతో అనుసంధానం

లక్షలకొద్దీ ఫొటోలు, వీడియోల విశ్లేషణ

జంతువులు గాయపడ్డా గుర్తించే వీలు

వేటగాళ్ల కదలికలపై నిరంతరం నిఘా

దేశంలోనే మొదటిసారిగా వినియోగం

ముంబై స్టార్ట్‌పతో ప్రభుత్వ ఒప్పందం


హైదరాబాద్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కవ్వాల్‌ అభయారణ్యంలో పెద్ద పులి అలికిడి.. ఏటూరునాగారం ఏజెన్సీలో ఎలుగుబంట్ల హడావుడి.. నల్లమలో చిరుతల సంచారం ఇక క్షణాల్లో తెలిసిపోతుంది. ఉట్నూరు అటవీ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా.. నర్సాపూర్‌ అరణ్యంలో  నిప్పు రాజుకున్నా.. పోచారంలో వేటగాళ్లు ఉచ్చులు బిగించినా.. అనంతగిరిలో స్మగ్లర్లు చొరబడినా ఇట్లే పసిగట్టేయొచ్చు. అది కాకులు దూరని కారడవైనా.. ఏనుగులుండే దండకారణ్యమైనా అక్కడ ఏం జరుగుతుందో.. కాలు కదపకుండానే కనిపెట్టేయొచ్చు. ఇదంతా ఎలాగనుకుంటున్నారా..? ‘థింక్‌ ఎవాల్వ్‌’ అనే స్టార్ట్‌పతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ద్వారా. మొత్తం జంతువుల సంఖ్య తెలుసుకునేందుకు.. ఏవైనా గాయపడితే వెంటనే చికిత్స అందించేందుకు.. ఆయుధాలతో ఎవరైనా వెళ్తే వారి ఆటకట్టించేందుకు అధికారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. వన్యప్రాణుల రక్షణతో పాటు అడవుల్లో ప్రతి కదలికను గుర్తించేందుకు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ను ప్రభుత్వం అమలుచేయనుంది. ముంబై కేంద్రంగా ఉన్న థింక్‌ ఎవాల్వ్‌ దీనికి తోడ్పడనుంది.


ఏఐతో ఓ కన్నేసి..

రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో అడవులున్నాయి. అనేక వన్యప్రాణులున్నాయి. వీటి రకాలు, కదలికలను గుర్తించేందుకు ప్రభుత్వం సీసీ కెమెరాలను అమర్చుతోంది. ఎక్కడ ఎలాంటి జంతువులు సంచరిస్తున్నాయి, వాటి సంఖ్యను కొంత తెలుసుకోగలుగుతోంది. ఈ కెమెరాల ఆధారంగానే గతంలో పులుల గణన చేపట్టింది. అయితే, టెక్నాలజీని మరింతగా వినియోగించుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఐటీ శాఖ ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఉన్న స్టార్ట్‌పలను పోటీకి ఆహ్వానించింది. ఏఐతో పాటు మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) ద్వారా  వన్యప్రాణుల రక్షణ, ఇతర సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో చెప్పాలంటూ పోటీ నిర్వహించింది. ఇందులో 59 స్టార్టప్స్‌ పాల్గొనగా ‘ఏఐ ఆధారిత స్మార్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ డ్యాష్‌బోర్డ్‌’ కాన్సె్‌ప్టతో థింక్‌ ఎవాల్వ్‌ విజేతగా నిలిచింది. ఇప్పటికే అడవుల్లో వందల కెమెరాలను ఏర్పాటుచేశారు. ఇవి అందించే చిత్రాలు, వీడియోలను విశ్లేషించడానికి సమయం పడుతోంది. థింక్‌ ఎవాల్వ్‌ సంస్థ సీసీ కెమెరాలను జీపీఎ్‌సతో అనుసంధానించి, వేలాది ఫొటోలు, వీడియోలను క్షణాల్లో విశ్లేషిస్తుంది. గరిష్ఠంగా లక్ష కెమెరాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించగలదు. దీనిని రాష్ట్ర అటవీ శాఖ వినియోగించుకోనుంది.


ఇవీ ప్రయోజనాలు

రాష్ట్రంలోని అడవుల్లో పులుల గణన చేపడుతున్నా ఇతర రకాల జంతువుల సంఖ్యపై స్పష్టత లేదు. కొత్త టెక్నాలజీతో అన్ని రకాల జంతువుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. శాకాహార, మాంసాహార జంతువుల వారీగా గణించవచ్చు.

స్మార్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ డ్యాష్‌ బోర్డ్‌ ద్వారా గాయపడ్డ జంతువుల కదలికలను గుర్తించి వివరాలను అధికారులకు అందిస్తుంది. దీంతో వాటికి వెంటనే చికిత్స అందించే అవకాశం ఏర్పడుతుంది. 

వన్యప్రాణుల వేటపై నిషేధం ఉన్నా.. కొందరు ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వేల ఎకరాల్లో ఉన్న అడవుల్లో వీరిని గుర్తించడం పరిమిత మానవ వనరులతో ఉన్న అటవీ శాఖకు అసాధ్యం. స్మార్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ డ్యాష్‌ బోర్డ్‌ ద్వారా మారణాయుధాలతో ఉన్న వ్యక్తుల కదలికలను గుర్తించి సమాచారాన్ని అధికారులకు పంపుతుంది. 

మంటలను ప్రారంభ దశలోనే గుర్తించి సమాచారం అందిస్తుంది. అధికారులు వెంటనే స్పందించి ప్రమాదాన్ని నివారించవచ్చు. 

రాష్ట్రంలోని అడవుల్లో అనేక రక్షాల పక్షులున్నా వాటిపై స్పష్టత లేదు. స్మార్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ డ్యాష్‌ బోర్డ్‌తో ఏమేం పక్షులున్నాయో గుర్తించవచ్చు. భిన్న జాతుల పక్షులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ‘బర్డ్‌ వాచింగ్‌’ పేరుతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయవచ్చు.


దేశంలోనే తొలిసారి..  

మానవ మనుగడకు అడవులు ఎంత కీలకమో.. అందులోని జంతువులు కూడా అంతే కీలకం. అటవీ జంతువుల రక్షణ దేశంలో పెద్ద సవాల్‌గా మారింది. దీనికి పరిష్కారం చూపించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సామాజిక బాధ్యతలో భాగంగా ‘ఏఐ ఆధారిత స్మార్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ డ్యాష్‌ బోర్డ్‌’ను అభివృద్ధి చేశాం. మా ఆలోచనను ప్రభుత్వం మెచ్చుకుని ఎంపిక చేసింది. ఇటీవలే రాష్ట్ర అటవీ శాఖతో ఒప్పందం కుదిరింది. పనులు త్వరలో ప్రారంభింస్తాం. వన్యప్రాణుల రక్షణకు ఇలాంటి టెక్నాలజీ వాడకం దేశంలోనే మొదటిసారి.

-ఆకాష్‌ గుప్తా, సీఈవో, థింక్‌ ఎవాల్వ్‌ కన్సల్టెన్సీ

Updated Date - 2022-08-13T07:55:34+05:30 IST