నిరసనా.. విందు భోజనమా?

ABN , First Publish Date - 2022-07-29T08:16:42+05:30 IST

ఉభయసభల్లో దుష్ప్రవర్తన ఆరోపణలపై సస్పెండైన ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రాంగణం లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద 50 గంటల నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.

నిరసనా.. విందు భోజనమా?

సస్పెండైన ఎంపీల దీక్ష తీరిది

న్యూఢిల్లీ, జూలై 28: ఉభయసభల్లో దుష్ప్రవర్తన ఆరోపణలపై సస్పెండైన ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రాంగణం లో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద 50 గంటల నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 11 గంటలకు మొదలైన వీరి దీక్ష శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట కు ముగియనుంది. ఈ సందర్భంగా వారి ఆహార మెనూ చూసి సహచర ఎంపీలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రాంతాలను బట్టి బుధవారం రాత్రి వేర్వేరుగా మెనూ ఆర్డరిచ్చారు. తందూరీ చికెన్‌, ఇడ్లీ-సాంబార్‌, పెరుగన్నం, రోటీ-దాల్‌-పనీర్‌, గజర్‌ కా హల్వా, పండ్లు, శాండ్‌విచ్‌లు ఆరగించారు.


ఒక పార్టీయే ఈ భారమంతా మోయకుండా.. వంతులవారీగా మెనూలు ఆర్డర్‌ ఇస్తున్నారు. గురువారం ఉదయం అల్పాహారం సరఫరా బాధ్యత డీఎంకే తీసుకుంది. మధ్యా హ్న భోజనం వంతు టీఆర్‌ఎ్‌సది. రాత్రి డిన్నర్‌ సరఫరా బాధ్యత ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)ది. బుధవారం ఉదయం రాజ్యసభ నుంచి సస్పెండైన 20 మంది ఎంపీలు (టీఎంసీ-ఏడుగురు, డీఎంకే-ఆరుగురు, టీఆర్‌ఎ్‌స-ముగ్గురు, సీపీఎం-ఇద్దరు, సీపీఐ, ఆప్‌-ఒక్కొక్కరు) దీక్ష ప్రారంభించగా.. లోక్‌సభ నుంచి సస్పెండైన నలుగురు కాంగ్రెస్‌ సభ్యులు తర్వాత వచ్చి చేరారు. వీరరతా తమ సస్పెన్షన్లను నిరసిస్తూ, సభలో ధరల పెరుగుదలపై చర్చకు డిమాండ్‌ చేస్తూ దీక్షకు దిగా రు. ఎంపీలకు ఎండ తగలకుండా టెంట్‌ వేయాలని ఆప్‌ భావించింది. అయితే పార్లమెంటు భద్రతా అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో సంతో్‌షకుమార్‌ (సీపీఐ), సంజయ్‌సింగ్‌ (ఆప్‌) సహా ఐదుగురు ఎంపీలు మాత్రమే బుధవారం రాత్రి ఆరుబయట నిద్రకు ఉపక్రమించారు. గురువారం ఉదయాన్నే వారి కోసం టీఎంసీ ఎంపీ మౌసమ్‌ నూర్‌ టీ తీసుకొచ్చారు. కాగా.. తమ నడతకు క్షమాపణ చెబితేనే ఎంపీలపై సస్పెన్షన్‌ ఎత్తివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రసక్తే లేదని.. ధరల పెరుగుదలపై ఉభయసభల్లోనూ చర్చించాల్సిందేనని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-07-29T08:16:42+05:30 IST