‘దారి’ద్య్రం పట్టదా?

Jul 24 2021 @ 23:38PM
విజయనగరంలో గుమ్చీ జంక్షన్‌లో రాళ్లు తేలిన రహదారి వద్ద టీడీపీ నేతల ఆందోళన

  ప్రభుత్వ వైఖరిపై టీడీపీ మండిపాటు 

జిల్లాలో రోడ్ల పరిస్థితిపై నిరసన

- (విజయనగరం రూరల్‌/ సీతానగరం/కొత్తవలస/

పార్వతీపురం రూరల్‌/కొమరాడ)

జిల్లాలో రహదారిద్య్రం పట్టదా? అని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని   ప్రశ్నించారు. రాళ్లు తేలిన దారులు.. నరకానికి నకళ్లుగా మారినా స్పందించక పోవడం తగదన్నారు. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విజయనగం కోట జంక్షన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహనికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళి ఆర్పించారు. అనం తరం కోట జంక్షన్‌ నుంచి గుమ్చీ జంక్షన్‌ వరకూ  పాదయాత్ర నిర్వహించి, రోడ్ల దుస్థితిని ప్రజలకు వివరించారు. సీతానగరం మండలంలో జోగంపేట విప్పలవలస రహదారిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కొత్తవలస రైల్వేస్టేషన్‌ నుంచి జంక్షన్‌ వరకు ఎస్‌.కోట నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. విశాఖ-అరకు రోడ్డుకు సంబంధించి పెందుర్తి నుంచి ఎస్‌.కోట వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రహ దారిని విస్తరించాలని డిమాండ్‌ చేశారు. పార్వతీపురం మండలంలోని  పులి గుమ్మి, బందలుప్పి గ్రామాల మధ్య గోతులమయంగా మారిన రహదారిలో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. కొమరాడ మండలం అంతర్రాష్ట్ర రహ దారిపై  గోతులను పూడ్చాలని టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. అప్పులతో సంక్షేమ పథకాలు అమలు  చేయడం తప్ప రహదారులపై దృష్టి సారించరా! అని మండిపడ్డారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారినా కనీస మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమన్నారు. అడుగుకో గొయ్యి ఏర్పడ డంతో తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ప్రస్తుతం విరివిగా వర్షాలు కురుస్తుండడంతో ఆయా గోతుల్లో వర్షపు నీరు నిల్వ ఉంటోందని, దీంతో వాహనదారులు, ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు. అనేక గ్రామాల్లో మట్టి రోడ్లు బురదమయంగా మారడంతో అత్యవసర సేవలు కూడా అందడం లేదన్నారు. 

 

 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.