బీజేపీ నేత, మేయర్ కారుపై రైతు ఆందోళనకారుల దాడి

ABN , First Publish Date - 2021-07-17T23:24:15+05:30 IST

కేంద్ర నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనలు సాగిస్తున్న రైతులు బీజేపీ..

బీజేపీ నేత, మేయర్ కారుపై రైతు ఆందోళనకారుల దాడి

ఛండీగఢ్: కేంద్ర నూతన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళనలు సాగిస్తున్న రైతులు బీజేపీ సీనియర్ నేత సంజయ్ టాండన్, ఛండీగఢ్ మేయర్ రవి కాంత్ శర్మ వాహనాలను ధ్వంసం చేసిన ఘటన శనివారంనాడు చోటుచేసుకుంది. సెక్టార్ 48లో పోలీసుల కళ్లముందే రైతు ఆందోళనకారులు ఈ దాడికి దిగారు. రైతుల ఆందోళనలు మొదలైనప్పటి నుంచి బీజేపీ ఛండీగఢ్ యూనిట్ నేతలపై దాడి జరగడం ఇదే మొదటిసారి. బీజేపీ పంజాబ్ యూనిట్ విభాగం చీఫ్‌గా పనిచేసిన టాండన్ ప్రస్తుతం పార్టీ హిమాచల్ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నారు.


బీజేపీ నేతలు ఇతర వలంటీర్లతో కలిసి సెక్టార్ 48లోని మోటార్ మార్కెట్‌కు ఉదయం 9 గంటల ప్రాంతంలో వచ్చారు. మార్కెట్ అసోసియేషన్, స్థానిక పార్టీ నేతలు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరు వచ్చినప్పుడు దాడి ఘటన చోటుచేసుకుంది. ''నేను రేంజ్ రోవర్‌లో ఉన్నాయి. అకస్మాత్తుగా నిరసనకారులు నా వాహనం ముందుకు వచ్చారు. వారిలో కొందరు బరువైన వస్తువుతో కారుపై దాడి చేశారు. అది ఇనుపరాడ్డు కావచ్చు. వాళ్లంతా బయట వ్యక్తులే. ముందస్తు వ్యూహం ప్రకారమే దాడి చేశారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగింది. శర్మ వాహనాన్ని కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. పగిలిన విండో స్క్రీన్ ముక్కలు తాకడంతో ఆయన డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. దాడిగి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఛండీగఢ్ పోలీసులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం'' అని టాండన్ మీడియాకు తెలిపారు. నిరసకారులు హింసకు దిగడంతో ఆ ప్రదేశాన్ని విడిచివెళ్లాల్సిందిగా బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు కోరినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన అనంతరం టాండన్, పార్టీ కార్యకర్తలు సెక్టార్ 34 పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్ఎస్‌పీ కుల్‌దీప్ చాహల్‌తో ఆ వివరాలు తెలియజేశారు. కాగా, బీజేపీ నేతలపై దాడి ఘటనలో స్థానిక గాయకుడు సర్బాంస్ పార్తీక్ సహా పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-07-17T23:24:15+05:30 IST