సీఎం అబద్ధాలు చెప్పారు

ABN , First Publish Date - 2022-03-18T08:12:23+05:30 IST

కల్తీ సారా, జే బ్రాండ్‌ మద్యం రాష్ట్ర శాసనసభలో మళ్లీ గందరగోళానికి దారితీశాయి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల తీవ్ర నిరసన, ప్లకార్డుల ప్రదర్శన, సభాపతితో వాగ్వాదం, అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు, మార్షల్స్‌ రంగ ప్రవేశం,

సీఎం అబద్ధాలు చెప్పారు

సభాహక్కుల తీర్మానం పెట్టిన టీడీపీ

పోడియం వద్దకు చేరుకుని నిరసన

సారా మరణాలను సహజ మరణాలంటారా? అని ప్రశ్న 

సీఎంతో అబద్ధాలు చెప్పించిన ఘనత మీదే

గౌరవ సభాపతి షేమ్‌ షేమ్‌ అని నినాదాలు

చివరకు సస్పెన్షన్‌తో బయటకు

రోజంతా మండలిలో నిలువుగాళ్లపైనే.... కొనసాగిన టీడీపీ సభ్యుల నిరసనలు


అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కల్తీ సారా, జే బ్రాండ్‌ మద్యం రాష్ట్ర శాసనసభలో మళ్లీ గందరగోళానికి దారితీశాయి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల తీవ్ర నిరసన, ప్లకార్డుల ప్రదర్శన, సభాపతితో వాగ్వాదం, అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు, మార్షల్స్‌ రంగ ప్రవేశం, సభలోనే మార్షల్స్‌ ఉండడం, చివరకు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌...దాదాపు గంటా నలభై నిమిషాల సేపు ఈ పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయి. ఈ సమయమంతా టీడీపీ సభ్యులు నిలువుకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతూనే ఉన్నారు. గురువారం ఉదయం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే తెలుగుదేశం శాసనసభ్యులు... సీఎం సభను తప్పుదోవ పట్టించారని, కల్తీ సారా మరణాలు, జే బ్రాండ్‌ మద్యం మరణాలను సహజ మరణాలుగా అబద్ధాలు చెబుతున్నారంటూ...సభా హక్కుల తీర్మానం ఇచ్చారు. దీనిపై వాయిదా తీర్మానం కూడా ఇచ్చి చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. పోడియం వద్దకు చేరుకుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ చర్చకు పట్టుబట్టారు. ప్లకార్డులను చింపి విసిరేశారు. దీంతో సభాపతి మార్షల్స్‌ను పిలిపించారు. మార్షల్స్‌ పెద్దసంఖ్యలో సభలోకి వచ్చారు.


తెలుగుదేశం శాసనసభ్యులు చినరాజప్ప, అనగాని సత్యప్రసాద్‌, గద్దె రామ్మోహన్‌రావు, వెలగపూడి రామకృష్ణబాబు, ఆదిరెడ్డి భవానీ, రామరాజు, గొట్టిపాటి రవికుమార్‌, నిమ్మల రామానాయుడు, వేగుళ్ల జోగేశ్వరరావు, ఏలూరి సాంబశివరావు, బెందాళం అశోక్‌లను పోడియం వద్దనుంచి వెనక్కి నెట్టేశారు. సభాపతి పోడియంకు, విపక్ష సభ్యుల బల్లలకు మధ్య మార్షల్స్‌ అలాగే సభలో అడ్డంగా నిలబడి ఉన్నారు. దీంతో తెలుగుదేశం శాసనసభ్యులు తమ సీట్లలో కూర్చోకుండా...అలాగే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సభాపతి పలుమార్లు వారిని ‘ఇది తగదు’ అని వారించారు. ఇదేం పద్ధతి, ఇది బాగాలేదని హెచ్చరించారు. కల్తీ సారా మరణాలను సహజ మరణాలని సీఎం అనడం ఏం పద్ధతి అని, అది కూడా బాగాలేదని తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేశారు. ‘‘సీఎంతో అబద్ధాలు చెప్పించిన ఘనత మీదే’’ అని సభాపతిని ఉద్దేశించి అన్నారు. గౌరవ సభాపతి...షేమ్‌ షేమ్‌ అంటూ నినాదాలు చేశారు. ఈలోపు ప్రశ్నల గంట నడుస్తూనే ఉంది. సభ్యులు ప్రశ్నలు అడగడం...వాటికి సంబంధిత మంత్రులు సమాధానాలు చెప్పడం సాగిపోతూనే ఉంది.


ఫోన్లు తేవొద్దు,వీడియోలు తీయొద్దని రూలింగ్‌

ఈ గందరగోళంలోనే సభాపతి తమ్మినేని సీతారాం విపక్ష తెలుగుదేశం సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘సెల్‌ఫోన్లు లోపలకు తెచ్చి, వీడియోలు తీసి మీడియాకు ఇస్తున్నారు. సెల్‌ఫోన్లు సభలోకి తేకూడదు’’ అని ఆయన అనగా.. తామే కాదు, అధికారపక్ష సభ్యులు కూడా సెల్‌ఫోన్లు తెస్తున్నారని తెలుగుదేశం సభ్యులు చెప్పారు. దీంతో సభాపతి...ఎవరు తెచ్చినా తప్పే అంటూ ఒక రూలింగ్‌ ఇచ్చారు. ‘‘సెల్‌ఫోన్లు సభకు తీసుకురాకూడదు. సభలో సెల్‌ఫోన్లతో వీడియోలు తీయకూడదు. సభ్యులు మాట్లాడుతున్నప్పుడు గొడవ చేయకూడదు. కాగితాలు చింపి విసరకూడదు. సభ్యులంతా దీనికి కట్టుబడి ఉండాలి’’ అని స్పష్టం చేశారు. ఆ తర్వాత మధ్య మధ్యలో సభాపతి... తెలుగుదేశం సభ్యులను ఇదేం పద్ధతి అనడం, వారు నినాదాలు చేయడం కొనసాగింది. ఒక దశలో తెలుగుదేశం సభ్యులు బల్లల మీద చరుస్తూ చప్పుడు చేశారు. ‘‘అధికారపక్ష ఎమ్మెల్యేలే ఇవి కల్తీ సారా మరణాలు అన్నారు. వైద్యులు చెప్పారు. కానీ సీఎం అబద్ధం చెప్పారు’’ అని నిరసించారు. ఈ సమయంలో తెలుగుదేశం సభ్యులు 11మందిని సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. దీంతో వారు బయటకు వెళ్లిపోయా రు. బయటకు వెళ్లే సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో ఒకరు విజిల్‌ వేయడం వినిపించింది. మరోవైపు సభాపతి తమ్మినేని సీతారాం తెలుగుదేశం సభ్యు లు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన, వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. సభా హక్కుల తీర్మానం సరైన రూపంలో లేదంటూ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. 


మండలిలో బడ్జెట్‌ స్టేట్‌మెంట్‌..

శాసనమండలిలో గురువారం  బడ్జెట్‌ 2022-2023పై సాధారణ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు వైసీపీ, పీడీఎఫ్‌ సభ్యులు మాట్లాడారు. అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చను ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన సమాధానాలతో ముగించారు. 2022-23 సంవత్సరానికిగాను రూ.2,56,257 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నానని సభ ఆమోదించాలని కోరారు. బడ్జెట్‌పై చర్చ... ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ ముగిసిన వెంటనే చైర్మన్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు.

Updated Date - 2022-03-18T08:12:23+05:30 IST