మొలకలు రావాలంటే...

ABN , First Publish Date - 2021-11-02T05:30:00+05:30 IST

మొలకల్లో ఉండే పోషకాల గురించి మనందరికీ ఎంతో కొంత అవగాహన ఉంది. అయితే మొలకెత్తించే విధానం గురించి ఎక్కువ..

మొలకలు రావాలంటే...

మొలకల్లో ఉండే పోషకాల గురించి మనందరికీ ఎంతో కొంత అవగాహన ఉంది. అయితే మొలకెత్తించే విధానం గురించి ఎక్కువ మందికి తెలియదు. అలాగే వేటిని మొలకల రూపంలో తినకూడదో కూడా అందరికీ తెలిసి ఉండకపోవచ్చు.


కిడ్నీ బీన్స్‌ పచ్చిగా తినడానికి పనికి రావు. పచ్చి కిడ్నీ బీన్స్‌లోని విషకారకాలు వాంతులు, విరోచనాలు అయ్యేలా చేస్తాయి. అయినా మొలకెత్తించి తినాలనుకుంటే, మొలకలను కనీసం పది నిమిషాలపాటైనా ఉడికించాలి. అలాగే క్వినోవాలో అధిక మొత్తంలో ఉండే సపోనిన్‌ అనే సేంద్రీయ రసాయనం కూడా అలర్జీకి కారణమవుతుంది. ఇక బాదం పప్పును మొలకెత్తించడం కంటే నానబెట్టి, పొట్టు తీసి తినడం మేలు. నానబెట్టడం వల్ల దాన్లోని యాంటీ న్యూట్రియెంట్లు ఛిద్రమవుతాయి. నానబెట్టి తినడం ఇష్టం లేకపోతే వేయించి, తినవచ్చు.


మొలకల పిండి

గోధుమలు, రాగులు.. మొదలైన వాటిని మొలకెత్తించి, పిండి కొట్టి వాడుకోవచ్చు. అయితే కేవలం పావు అంగుళం మేరకు మొలకలు పెరిగితే సరిపోతుంది. తర్వాత నీడలో తడి వదిలే వరకూ ఒక రోజంతా ఆరబెట్టి, పొడి కొట్టుకోవాలి. 


మొలకెత్తించాలంటే....

విత్తనం రకం మీద, నానబెట్టే నీటి పరిమాణం ఆధారపడి ఉంటుంది. అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి ఏంటంటే, ఒక వంతు విత్తనాలను మూడొంతుల నీళ్లలో నానబెట్టడం. ఇలా విత్తనాలను కలిపి, లేదా విడివిడిగా రాత్రంతా నానబెట్టుకుని, మరుసటి ఉదయం శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి, నీరు వార్చేసుకోవాలి. తర్వాత వస్త్రంతో కప్పి, ప్రతి 12 గంటలకోసారి కడిగి, నీరు వార్చుకోవాలి. ఎక్కువ శాతం విత్తనాలు మరుసటి రోజు నుంచే మొలకెత్తడం మొదలుపెడతాయి. మొలకెత్తడం మొదలైనప్పటి నుంచీ, ప్రతి 12 గంటలకోసారి కడుగుతూ, రెండు నుంచి నాలుగు రోజుల పాటు మొలకలను తినవచ్చు. 


వీటిని ఇలా....

నువ్వులు: ఒక కప్పు నువ్వులతో రెండు కప్పుల మొలకలు తయారవుతాయి. వీటిని రెండు గంటల పాటు నానబెడితే సరిపోతుంది. రోజుకు రెండు సార్లు కడుగుతూ ఉండాలి. ఒకటి నుంచి మూడు రోజుల్లో మొలకలొస్తాయి.


బఠాణీలు: ఒక కప్పుతో మూడు కప్పుల మొలకలు తయారవుతాయి. 8 గంటల పాటు నానబెట్టి, రోజుకు రెండు సార్లల కడుగుతూ ఉండాలి. రెండు నుంచి మూడు రోజుల్లో మొలకలొస్తాయి.


క్వినోవా: ఒక కప్పుతో మూడు కప్పుల మొలకలు తయారవుతాయి. వీటిని 30 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. 36 నుంచి 48 గంటల్లో మొలకలొస్తాయి.


గుమ్మడి: ఒక కప్పుతో రెండు కప్పుల మొలకలొస్తాయి. గంట పాటు నానబెట్టి, ప్రతి 8 గంటలకోసారి కడుగుతూ ఉండాలి. 12 నుంచి 24 గంటల్లో మొలకలొస్తాయి.


పొద్దుతిరుగుడు: ఒక కప్పుతో రెండు కప్పుల మొలకలొస్తాయి. గంట పాటు నానబెట్టి, ప్రతి 8 గంటలకోసారి కడుగుతూ ఉండాలి. 12 నుంచి 24 గంటల్లో మొలకలొస్తాయి.


బూజు పడుతుంటే...

మొలకెత్తించే విత్తనాలు, ఉపయోగించే పాత్ర శుభ్రంగా ఉండాలి. పాత్రలో విత్తనాలు కుక్కేయకుండా, జాగా వదలాలి. అలాగే పాత్ర లేదా డబ్బాను గాలి చొరబడని షెల్ఫ్‌లో ఉంచకూడదు. అయినప్పటికీ బూజు పడుతున్నట్టు అనుమానం వస్తే, ఒకటికి రెండు సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి.

Updated Date - 2021-11-02T05:30:00+05:30 IST