దోపిడీదారులకు మాన్సాస్‌లో స్థానం లేదు

ABN , First Publish Date - 2021-06-18T08:47:29+05:30 IST

మాన్సాస్‌ ట్రస్టులో దోపిడీదారులకు స్థానం ఉండదని ట్రస్టు చైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి వద్ద మాన్సాస్‌ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు

దోపిడీదారులకు మాన్సాస్‌లో స్థానం లేదు

ఇసుక తవ్వకాల అనుమతుల వివరాలివ్వండి 

ట్రస్టు కార్యాలయానికి అశోక్‌ గజపతిరాజు 

ఈవో, కరస్పాండెంట్‌ గైర్హాజరుపై ఆగ్రహం 

21లోగా ఆడిట్‌ వివరాలు ఇవ్వాలని ఆదేశం 


విజయనగరం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): మాన్సాస్‌ ట్రస్టులో దోపిడీదారులకు స్థానం ఉండదని ట్రస్టు చైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి వద్ద మాన్సాస్‌ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఎవరిచ్చారో చెప్పాలని, ఆ వివరాలను సమగ్రంగా అందించాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. చైర్మన్‌ హోదాలో ఆయన గురువారం ట్రస్టు కార్యాలయంలోని తన చాంబర్‌కు వెళ్లారు. వివిధ రికార్డుల్లోని సంతకాలను పరిశీలించారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎంతవరకు జీతాలు చెల్లించాలో పరిశీలించి నివేదించాలని ఆదేశించారు. ఈవో, కరస్పాండెంట్‌ గైర్హాజరు కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సా్‌సలో క్రమం తప్పకుండా ఆడిట్‌ జరిగేదని, కానీ దశాబ్ద కాలంగా ఆడిట్‌ జరగలేదని బయట ఆరోపణలు వస్తున్నాయని, పూర్తి ఆడిట్‌ వివరాలను ఈనెల 21లోగా తనకు అందించాలని ఆదేశించారు. ఏడాదికాలంలో కార్యాలయంలో వివిధ కొనుగోళ్ల కింద ఖర్చు చేసిన రూ.5లక్షలకు సంబంధించిన వివరాలను రెండు రోజుల్లో అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యాసంస్థల సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రస్టు కార్యాలయాన్ని విజయనగరం నుంచి విశాఖ జిల్లాకు ఎందుకు తరలించాల్సి వచ్చిందో, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేమిటో పరిశీలిస్తామన్నారు.  

Updated Date - 2021-06-18T08:47:29+05:30 IST