ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించండి

ABN , First Publish Date - 2021-03-07T05:11:28+05:30 IST

ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారుల కు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని, ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు.

ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించండి
పార్వతీపురంటౌన్‌: బ్యాలెట్‌ పేపర్లను పరిశీలిస్తున్న పీవో

  ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ 

పార్వతీపురం, మార్చి 6: ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారుల కు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టాలని, ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు. ఆయన శనివారం తన చాంబర్‌లో సబ్‌ప్లాన్‌ మండలాల పరిధిలోని ఐసీడీఎస్‌ సీడీపీవోలతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పంపిణీపై అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌ప్లాన్‌ మండలాల్లోని పిల్లల్లో పోషకాహార లోపం ఉండకూడదన్నారు. లోప పోషణకుగల కారణాలపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి సీడీపీవోలు కారణాలు వివరించారు. సమావేశంలో పార్వతీపురం, సాలూరు, కురుపాం, భద్రగిరి, పాచిపెంట మండలాల సీడీపీవోలు పాల్గొన్నారు.  

పార్వతీపురం రూరల్‌: మండలంలో గిరిజన ఇంజినీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్మితమైన నూతన బీటీ రహదారులను శనివారం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ పరిశీలించారు. మండలంలో లచ్చిందొరవలస నుంచి తోకుడువలస, తదితర రహదారులను పరిశీలించారు. కార్యక్రమంలో ఈఈ శాంతేశ్వరరావు, తదితర ఇంజినీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.


బ్యాలెట్‌ పేపర్ల పరిశీలన 
పార్వతీపురంటౌన్‌: మున్సిపల్‌ పోలింగ్‌కు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లు శనివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నాయి. 30 వార్డులకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ అధికారులు బ్యాలెట్‌ పేపర్లను సిద్ధం చేస్తున్న ప్రక్రియను ఎన్నికల ప్రత్యేకాధికారి కూర్మనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాల్టీలోని 30 వార్డులకు సంబంధించి 86 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. పోటీదారు లకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్లను కట్టుదిట్టమైన పర్యవేక్షణలో సిద్ధం చేస్తున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఓటు వేసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 
 
 

Updated Date - 2021-03-07T05:11:28+05:30 IST