నిజాయితీతో సేవలు అందించండి

ABN , First Publish Date - 2020-09-22T10:06:45+05:30 IST

పోలీసుశాఖలో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు నిజాయితీతో ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. ఒంగోలులో

నిజాయితీతో సేవలు అందించండి

ఎస్పీ రాజకుమారి 

విజయనగరం క్రైం, సెప్టెంబరు 21: పోలీసుశాఖలో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు నిజాయితీతో ప్రజలకు సేవలు అందించాలని ఎస్పీ రాజకుమారి సూచించారు. ఒంగోలులో శిక్షణ పొంది విధుల్లో చేరడానికి జిల్లాకు వచ్చిన 33 మంది పురుష, 13 మంది మహిళా కానిస్టేబుళ్లతో జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ సమావేశమయ్యారు.


పోలీసుశాఖలో పనిచేసే అవకాశం అందరికీ రాదని, ఎంతో శ్రమపడి ఇతరులతో పోటీపడి విజయం సాధించడం వల్లే ఉద్యోగం పొందామన్న విషయం మరువద్దన్నారు. మన వృత్తిని గర్వంగా, గౌరవంగా భావించాల ని సూచించారు. రాజ్యాంగబద్ధంగా, అంకితభావంతో సేవలు అందించడం వల్ల పోలీసుశాఖకు మంచి పేరు-ప్రతిష్టలు తీసుకురావాలన్నారు.


పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మానవత్వంతో వ్యహరించాలని, తగిన సహకారం అందించాలని చెప్పారు. మహిళలు, బాలలు, వృద్ధులు, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు.. బడుగు, బలహీనవర్గాలకు సహాయపడాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ వెంకటప్పారావు, శేషాద్రి, ఆర్‌ఐలు ఈశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 


ఫిర్యాదులను పరిష్కరించండి

పోలీసుస్టేషన్ల పరిధిలో వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని ఎస్పీ రాజకుమారి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఫోన్‌లో ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీసు అధికారులతో నేరుగా మాట్లాడి సమస్యపై  విచారించి న్యాయం చేయాలని ఆదేశించారు.


కరోనా వైరస్‌ కారణంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందనను తాత్కాలికంగా నిలుపుదల చేసి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకూ టెలీ స్పందన కార్యక్రమాన్ని చేపట్టి ఫోన్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్నామన్నారు. ప్రజలు 08922-276163 నెంబరుకు ఫోన్‌ చేసి సమస్యను తెలియజేయవచ్చునని చెప్పారు.

Updated Date - 2020-09-22T10:06:45+05:30 IST