రెచ్చిపోతున్న రియల్‌ మాఫియా

ABN , First Publish Date - 2022-05-11T06:45:57+05:30 IST

ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇప్పుడు పల్లెల్లోనూ విస్తరించి చిచ్చురేపుతోంది. రెచ్చిపోతున్న రియల్‌ మాఫియా ధన దాహానికి ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ అనే తేడానే లేకుండా పోయింది. జిల్లా మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌ మండలాలతో పాటు ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలలో నూ రియల్‌ వ్యాపారులు

రెచ్చిపోతున్న రియల్‌ మాఫియా
ఇంద్రవెల్లిలో గల అక్రమ వెంచర్‌లో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తున్న అధికారులు

 ఏజెన్సీ గ్రామాల్లో అడ్డగోలుగా అక్రమ వెంచర్లు

గిరిజనుల భూములపై రియల్టర్ల కన్ను

ఫిర్యాదు చేస్తేనే అధికారుల హడావుడి

తాజాగా రాజులతండాలో బడాబాబుల పెత్తనం

కలెక్టర్‌ ఆదేశాలు సైతం బేఖాతరు

ఆదిలాబాద్‌, మే10 (ఆంధ్రజ్యోతి): ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇప్పుడు పల్లెల్లోనూ విస్తరించి చిచ్చురేపుతోంది. రెచ్చిపోతున్న రియల్‌ మాఫియా ధన దాహానికి ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ అనే తేడానే లేకుండా పోయింది. జిల్లా మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న నేరడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్‌ మండలాలతో పాటు ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, జిల్లా కేంద్రం పరిసర ప్రాంతాలలో నూ రియల్‌ వ్యాపారులు విచ్చలవిడిగా వెంచర్లను వేస్తూ అమ్మేసుకుంటున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ గద్దల్లా వాలిపోతున్న వ్యా పారులు అమాయక రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని పంట భూములను ప్లాట్లుగా మార్చేస్తున్నారు. అవే ప్లాట్లను పదింతలుగా రేటు పెంచి తిరిగి రైతులకే అమ్మేస్తూ.. అందినకాడికి దండుకుంటున్నారు. దీంతో మండల కేంద్రాల చట్టూ ఉన్న వ్యవసాయ భూములకు రెక్కలు వస్తున్నాయి. రియల్‌ వ్యాపారులు ధరలను పెంచేయడంతో భూముల ధరలు ఆకాశానంటుతున్నాయి. జిల్లాలో ఏజెన్సీ మండలాలైన బోథ్‌, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బేల, నేరడిగొండ, బజార్‌హత్నూర్‌, గుడిహత్నూర్‌, నార్నూర్‌, ఉట్నూర్‌ మండల కేంద్రాల్లో భూదందా యథేచ్ఛగా సాగుతోం ది. రియల్‌ మాఫియా పల్లెలను చుట్టుముట్టి వెంచర్లుగా మార్చడంతో సాగు భూములు కనిపించకుండా పోతున్నాయి. తాజాగా నేరడిగొండ మండలం రాజులతండా గ్రామంలో కొందరు బఢాబాబులు ఊరిని ఆనుకుని ఉన్న రెండు ఎకరాల భూమిపై కన్నేసి వెంచర్‌ వేసేందుకు ప్లాన్‌ చేసి బాధిత రైతు కుటుంబాన్ని బెదిరింపులకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, ఉ ద్యోగులు ఇదేపనిగా పెట్టుకుంటున్నారు. ఇదంతా బహిరంగంగానే జరు గుతున్న పంచాయతీ, రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవ హరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో పారదర్శకంగా పాలన కొనసాగేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను నియమించిన పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. స్థానిక అధికారుల కనుసన్నల్లోనే అక్రమంగా వెంచర్లు వెలుస్తున్నా.. జిల్లా అధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తూ తప్పించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఫ పెరిగిపోతున్న పెత్తనం

ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనేతర పెద్దల పెత్తనం మరింతగా పెరిగిపోవడంతో గిరిజనుల భూములు కనుమరుగవుతున్నాయి. వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనం సాగిస్తున్న అమాయక గిరిజనులకు సాగు భూములు అందుబాటులో లేక కూలీలుగా మారుతూ ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు భూములు ఉన్న పట్టాలు లేకపోవడంతో కొందరు అమాయక గిరిజనులను అడ్డంగా పె ట్టుకొని రియల్‌ దందాకు ఎగబడుతున్నారు. గిరిజన గ్రామాల్లో చక్రం తిప్పుతున్న కొందరు గిరిజనేతర పెద్దలు.. రియల్‌ మాఫియతో చేతులు కలిపి గుట్టుచప్పుడుకాకుండా అమ్మేసుకుంటున్నారు. చూస్తుండగానే యేటా వందల ఎకరాల భూములు ప్లాట్లుగా మారిపోతున్నాయి. గ్రామా ల్లో నిరాశతో కనిపిస్తున్న కొందరు అన్నదాతలకు డబ్బులను ఆశచూపుతు లొంగదీసుకుంటున్నారు. కొందరుపెద్దలు ఇదేపనిగా దళారీదందాకు ఎగ బడుతున్నారు. గ్రామాల్లో కొంత పలుకుబడి ఉండి తెలివి తేటలు ఉన్న వారంతా రియలిస్టేట్‌ వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే సులువుగా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించే అవకాశం ఉండడంతో ఎంతకైనా తెగిస్తున్నారు. వివాదాస్పద భూములను గుర్తించి సెటిల్‌ చేస్తామని నమ్మబలుకుతూ విలువైన భూములను ఛౌక ధరలకే కొట్టేస్తున్నారు. తమ మాట కాదు కూడదంటే లేనిపోని కొర్రీలు పెడుతూ.. అమాయక రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అధికా రులు సైతం బఢాబాబులకే వత్తాసు పలుకడంతో బాధిత రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

ఫ ఏజెన్సీ చట్టాలకు తూట్లు

ఏజెన్సీ ప్రాంతంలో వెంచర్లు, పెద్దపెద్ద భవనాల నిర్మాణానికి ఎలాం టి అనుమతులు ఉండవు. కాని కొందరు పెద్దలు 1/70 యాక్ట్‌కు తూట్లు పొడుస్తూ విచ్చలవిడిగా ఏజెన్సీలో భూదందాను కొనసాగిస్తున్నారు. ఏజెన్సీల్లో భూములు అమ్మాలన్న, కొనాలన్న గిరిజనులే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధనతో ఏమీ చేయలేమని తెలిసి పోయినా గిరిజనేతర రైతులు బినామీ పేర్లతో రియల్‌ వ్యాపారానికి దిగుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి లేఔట్‌ అనుమతులు కూడా ఇవ్వ డానికి వీలు లేదు. కాని నిత్యం విచ్చలవిడిగా వెంచర్లు వెలుస్తునే ఉన్నా యి. కొందరు గిరిజనేతర నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. గిరిజనుల ప్రాణ రక్షణతో పాటు ఆస్తి రక్షణకు పెసా చట్టం ఉన్నా.. ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఏజెన్సీ మండలాల్లో అధికారంలో ఉన్న కొందరు నేతలు గిరిజనుల అ మాయకత్వాన్ని ఆసరాగా అడ్డగోలు దందాలు చేస్తున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు స్వయాన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కొన్నాళ్ల పాటు హడావుడి చేయడం, ఆ తర్వాత అంతా మాములుగానే మారిపోతుంది. రియల్‌ మాఫియాతో అధికారులు కుమ్మకవుతూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏజెన్సీ చట్టాలను అడ్డుపెట్టుకుని, కొందరు అధికారులు అడ్డదారి లో అనుమతులు ఇస్తూ అక్రమ సంపాదనకు ఎగబడుతున్నారు.

అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకుంటాం

: రిజ్వాన్‌ భాషాషేక్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌

జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లను వేస్తే చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి అనుమతులు ఉండవు. ఈ భూముల్లో ఎలాంటి వెంచర్లను ఏర్పాటు చేయరాదు. ఇప్పటికే పలు మండలాల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించి అనుమతులు లేని వెంచర్ల హద్దురాళ్లను తొలగించడం జరిగింది. అనుమతులు ఉన్న వెంచర్లలోనే ప్లాట్ల క్రయ విక్రయాలు జరుపాలి. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం అనుమతి తీసుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 

Read more