ఈ సైకలాజికల్ ట్రిక్స్‌తో ఇతరులను ఈజీగా ఆకట్టుకోండి.. మిమ్మల్ని చూసినవారంతా వారేవా అంటారు!

ABN , First Publish Date - 2021-12-29T17:19:58+05:30 IST

చాలామంది తమ మాటలతో..

ఈ సైకలాజికల్ ట్రిక్స్‌తో ఇతరులను ఈజీగా ఆకట్టుకోండి.. మిమ్మల్ని చూసినవారంతా వారేవా అంటారు!

చాలామంది తమ మాటలతో, వ్యవహార శైలితో ఇతరుల మనసులను గెలుచుకుంటారు. ఈ విధమైన ప్రవర్తన కలిగినవారి కారణంగా వారి చుట్టుపక్కల ఉండేవారికి పాజిటివ్ ఎనర్జీ అందుతుంది.  మీరు కూడా ఈ విధంగా అందరినీ ఆకట్టుకుని, వారి హృదయాలను గెలుచుకోవాలని అనుకుంటాన్నారా? అయితే ఈ సైకలాజికల్ ట్రిక్స్‌ను మీ జీవితంలో భాగం చేసుకోండి. తద్వారా మీరు అందరి మన్ననలు అందుకోవడంతోపాటు, వారి స్నేహాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మానసిక నిపుణులు తెలిపిన ఆ సైకలాజికల్ ట్రిక్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుందాం.


చూపులు కలసిన శుభవేళ

ఐ కాంటాక్ట్ గొప్పదనం గురించి మీరు ఇంతకుముందు వినే ఉంటారు. సాధారణంగా చాలామంది ఇతరులతో మాట్లాడేటప్పుడు 30 నుంచి 60 శాతం సమయం మాత్రమే ఎదుటివారి కళ్లలోకి చూస్తూ మాట్లాడుతారు. దీనివలన ఇరువురి మాటల మధ్య కొంతమేరకే స్పష్టత ఏర్పడుతుంది. అందుకే ఇతరులను ఆకట్టుకోవాలనుకుంటున్న మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు 70 శాతం సమయాన్ని వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. మనిషి మెదడు.. ఐకాంటాక్ట్ ద్వారా ఫీలింగ్స్‌ను ఇట్టే పసిగడుతుంది. అందుకే మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకూ వారి కళ్లలోకి చూసి మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఫలితంగా ఎదుటివారిలో మీపై ఆత్మీయతా భావం ఏర్పడుతుంది. 

ఉపశమనం కల్పించండి

ఐకాంటాక్ట్ ద్వారా మీరు ఇతరుల మనసులో ఉన్నది స్పష్టంగా గ్రహించగలుగుతారు. మీరు ఏదైనా ప్రశ్నించినప్పుడు.. వారు దానికి సమాధానం ఇస్తున్నప్పుడు, మీరు శాంతంగా.. వారి కళ్లలోకి చూస్తూ వారు చెప్పేది అర్థం చేసుకోండి. ఫలితంగా వారు మీతో వారి సమస్యలను చెప్పుకుని ఉపశమనం పొందుతారు. ఆ తరువాత నుంచి మిమ్మల్ని వారి సొంతమనిషిలా భావిస్తారు. 


మాటలు ఇలా కలపండి

ఇతరులతో మనస్ఫర్థలు ఏర్పడినప్పుడు వాటిని తొలగించేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేసి, వారితో మాటలు కలపండి. ఇటువంటి ప్రయత్నం మీతోనే ప్రారంభమైతే అవతలి వారికి మీపై సదభిప్రాయం ఏర్పడుతుంది. ఫలితంగా ఇతరులతో మీకు సాన్నిహిత్యం ఏర్పడుతుంది. 

వివాదాలు సద్దుమణిగేలా చూడండి

మీ ముందు ఎటువంటి వివాదాలు కనిపించినా అవి సద్దుమణిగేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి. అక్కడున్న పరిస్థితులను అర్థం చేసుకుని పరిష్కారం మార్గం చూపండి. ఇలా చేయడం వలన అక్కడి పరిస్థితులు చక్కబడటమే కాకుండా మీపై చుట్టుపక్కల వారికి పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. 

మిర్రర్ ఇమేజ్‌లా మారండి

మీరు ఎవరి నుంచి అయినా నమ్మకాన్ని పొందాలంటే ఎదుటివారి బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. అయితే ఈ విషయం వారు గమనించకుండా చూసుకోండి. ఎదుటివారిని మీరు ఎంతగా అర్థం చేసుకుని, వారికి సహాయ పడగలుగుతారో వారు అంతలా మీపై నమ్మకాన్ని పెంచుకుంటారు. 

నవ్వుతూ, ఆత్మీయంగా పలుకరించండి

ఎవరినైనా కలుసుకునేటప్పుడు చిరునవ్వుతో వారిని ఆత్మీయంగా పలుకరించండి. ముఖంపై చిరునవ్వు చెదరకుండా వారితో మాట్లాడితే.. ఎదుటివారు మీకు సన్నిహితులయ్యేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. 

Updated Date - 2021-12-29T17:19:58+05:30 IST