విధి నిర్వహణలో పీటీడీ బస్సు డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-05-25T06:38:44+05:30 IST

ప్రజా రవాణా శాఖ (పీటీడీ) బస్సు డ్రైవర్‌ ఒకరు విధి నిర్వ హణలో గుండెపోటుతో ప్రాణాలు వదిలారు.

విధి నిర్వహణలో  పీటీడీ బస్సు డ్రైవర్‌ మృతి

గాజువాక డిపోలో పనిచేస్తున్న రాజు

బస్సు ఎలమంచిలి చేరిన తరువాత తీవ్రఅస్వస్థత

కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలింపు

అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడి

ఎలమంచిలి, మే 24: ప్రజా రవాణా శాఖ (పీటీడీ)  బస్సు డ్రైవర్‌ ఒకరు విధి నిర్వ హణలో గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చిన తరువాత తీవ్రఅస్వస్థతకు గురవడంతో తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. 

ఎలమంచిలి మండలం ములకలాపల్లి గ్రామానికి చెందిన వత్సవాయి వెంకట అప్పల నరసింహమూర్తి రాజు (43) పీటీడీ (ఆర్టీసీ) గాజువాక డిపోలో బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తరువాత గాజువాక-ఎలమంచిలి మధ్య నడిచే ‘400 వై’ బస్సులో విధులు నిర్వహిస్తూ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో 34 మంది ప్రయాణికులతో ఎలమంచిలి బస్టాండ్‌కు చేరుకున్నాడు. అనంతరం బస్సు దిగి కాంప్లెక్స్‌లోకి వస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలి పోయాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఎలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రాజు భార్య, కుమార్తె, కుమారుడు ఆస్పత్రికి చేరుకుని భోరున విలపించారు. కాగా బస్సు నడుపుతున్న సమయంలోనే అస్వస్థతకు గురై వుంటారని, తమకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా వుండడానికి గమ్యస్థానానికి చేర్చిన తరువాత కుప్పకూలిపోయారని బస్సులో వచ్చిన ప్రయాణికులు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-05-25T06:38:44+05:30 IST