సంపన్నులు కట్టరు..!

ABN , First Publish Date - 2022-05-16T07:03:31+05:30 IST

కొత్త జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నగర పంచాయతీలో పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వీటిలో చాలావరకు సంపన్నులే మొండి బకాయిదారులుగా మిగిలిపోయారు.

సంపన్నులు కట్టరు..!

పుట్టపర్తిలో పేరుకుపోయిన పన్ను బకాయిలు

27 మంది కట్టాల్సింది రూ.2 కోట్లుపైనే..

బడా వ్యక్తులంటే అధికారులకు భయమా?

పుట్టపర్తి, మే 15: కొత్త జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నగర పంచాయతీలో పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వీటిలో చాలావరకు సంపన్నులే మొండి బకాయిదారులుగా మిగిలిపోయారు. రూ.కోట్లలో నగర పంచాయతీకి పన్నులు చెల్లించాల్సి ఉంది. 27 మంది పెద్దల పన్ను బకాయిలే రూ.2 కోట్లు పైగా ఉన్నాయి. పది మందికి సంబంధించినవి రూ.కోటిపైగా ఉండడం గమనార్హం. పేద, మధ్యతరగతి ప్రజలను ముక్కుపిండి వసూలు చేసే పంచాయతీ అధికారులు.. పెద్దల విషయంలో మెతక వైఖరి ప్రదర్శిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

సత్యసాయిబాబా అవతరించిన పుట్టపర్తి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందటంతోపాటు శ్రీసత్యసాయి జిల్లాకేంద్రంగా మారింది. మేజర్‌ పంచాయతీ నుంచి నగరపంచాయతీగా ఎదిగి, పదుకొండు సంవత్సరాలైనా పన్ను వసూలులో మాత్రం వెనుక పడ్డది. పన్నుల వసూలు ద్వారానే జీతాలు, ఇతరత్రా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఏటా పన్ను వసూలు శాతం పడిపోతోంది. పెనాల్టీలతో బకాయిలు పెరిగిపోతున్నాయి.


రావాల్సినది రూ.8.5 కోట్లు..

నగర పంచాయతీలో రూ.8.54కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉంది. వసూలైంది 27.27 లక్షలు మాత్రమే. 2022 మార్చి 31 నాటికి బకాయిలు 3.88 కోట్లు ఉండగా.. పెనాల్టీ 2.77 కోట్లు పడింది. ఈ ఏడు కొత్త డిమాండ్‌ రూ.1.89 కోట్లు ఉంది. మొత్తంగా రూ.8.54 కోట్లు రావాల్సి ఉంది. నగర పంచాయతిలో 20 వార్డులుండగా.. 13584 గృహాలున్నాయి. ఇందులో 3 వేల గృహాల వరకు మూతపడ్డాయి. 4 సంవత్సరాలుగా యజమానులు వీటి తలుపులు తీయలేదు. వీరు బయట ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వంద ఇల్లు నివాసయోగ్యం కాకుండా శిథిలావస్థకు చేరుకున్నాయి. పెద్దకమ్మవారిపల్లిలోనే 30 గృహాల వరకు పడిపోయాయి. వీటికి సైతం పన్ను కట్టారు. వీటిపై పన్ను నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.


సంపన్నులంటే భయమేల..?

నగర పంచాయతీలో పదివేల గృహాలకు పన్ను ఒకెత్తయితే.. వందమంది పన్ను అందుకు సమానంగా ఉంటుంది. రూ.50వేలు, అంతకన్నా ఎక్కువ పన్ను బకాయిపడ్డవారు 116 మంది వరకు ఉన్నారు. 27 మంది కట్టాల్సిన పన్ను బకాయి రూ.రెండుకోట్లుపైమాటే. వారు పట్టణంలో  సంపన్నులే. భవనాలు, కార్లు ఉన్నాయి. ఆస్తుల విలువ రూ.కోట్లుపైమాటే. అన్నీ ఉన్నా పన్నులు మాత్రం కట్టరు. బడావ్యక్తులను పన్ను అడగాలన్నా సిబ్బందికి వణుకేనని విమర్శ ఉంది. గతంలో ఓ కమిషనర్‌ బడా వ్యక్తి ఇంటికి వెళ్లి, పన్ను అడిగినందుకు చీవాట్లు పెట్టడంతోపాటు వెంటనే బదిలీ చేయించినట్లు విమర్శలు ఉన్నాయి. సామాన్యులైతే ముక్కుపిండి వసూలు చేస్తారు. బడావ్యక్తులతో ఎందుకు వసూలు చేయలేరంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు



పన్ను వసూలుకు ప్రత్యేక కార్యాచరణ

నగర పంచాయతీలో పేరకుపోయిన పన్నుల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. 9 వార్డు సచివాలయాల సిబ్బంది పన్ను వసూలుకు ఇంటింటికీ వెళ్తున్నారు. సకాలంలో కట్టకపోతే పేరుకుపోతాయనే విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. పన్నులు దీర్ఘకాలికంగా కట్టనివారి కొళాయి కనెక్షన తొలగిస్తాం. పన్ను సకాలంలో చెల్లించి, నగర పంచాయతీ అభివృద్ధికి సహకారం అందించాల్సి ఉంది.

- మునికుమార్‌, కమిషనర్‌ 


Updated Date - 2022-05-16T07:03:31+05:30 IST