పబ్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

ABN , First Publish Date - 2022-04-18T01:39:36+05:30 IST

బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూలోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. పబ్ నిర్వాహకుడు అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌ను పోలీసులు

పబ్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రాడిసన్‌ బ్లూలోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. పబ్ నిర్వాహకుడు అభిషేక్‌, మేనేజర్‌ అనిల్‌ను పోలీసులు 4 రోజులు విచారించారు. సోమవారం నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగిన నిందితులు నోరుమెదపలేదు. నిందితులు సహకరించకపోవడంతో ఈ కేసును కొలిక్కి తీసుకురావడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. పబ్‌పై దాడులు, నిందితుల అరెస్టు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ అవి కేసుకు బలాన్ని ఇచ్చేలా లేకపోవడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. ఈ నెల 3న ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌‌పై దాడి జరిగిన తర్వాత నిర్వాహకుడు అభిషేక్‌, అనిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు డెస్క్‌ మీద ఉన్న ఐదు మిల్లిగ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. 


కాగా పబ్‌లో భాగస్వాములుగా ఉన్న కిరణ్‌రాజ్‌, వీరమాచినేని అర్జున్‌ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పదిరోజులు పూర్తవుతున్నా ఇంకా వారి ఆచూకీ దొరకలేదు. మరోపక్క రిమాండ్‌లో ఉన్న నిందితులను కోర్టు అనుమతితో నాలుగు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదని విచారణాధికారులు భావించారు. కానీ, నాలుగు రోజులపాటు సాగిన విచారణలో ఎటువంటి కీలక అంశాలు వెలుగులోకి రాలేదు. దీంతో ఈ కేసును ఎలా చేధించాలనే దానిపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.

Updated Date - 2022-04-18T01:39:36+05:30 IST