అధికార దర్పంతో వైసీపీ బరితెగింపు

ABN , First Publish Date - 2021-11-14T06:33:39+05:30 IST

పెనుకొండ కోటలో పాగా వేసేందుకు అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు.

అధికార దర్పంతో వైసీపీ బరితెగింపు
ఓ ఇంటి వద్ద చీర, జాకెట్‌ బ్యాగులతో పంపిణీకి సిద్ధంగా ఉన్న స్థానిక వైసీపీ శ్రేణులు

పబ్లిక్‌గానే పంపకాలు..!

పెనుకొండ కోటలో పాగా వేసేందుకు అడ్డదారులు

ముగిసిన ప్రచారం... ఓటర్లకు తాయిళాల ఎర

ఒక్కో ఓటుకు రూ.2వేల నుంచి రూ.3వేలతోపాటు చీరలు పంపిణీ

ప్రజాప్రతినిధుల సమక్షంలోనే వ్యవహారం

ప్రేక్షకపాత్రలో పోలీసులు

సమయం ముగిసినా... ఎమ్మెల్యేలు అక్కడే తిష్ట

చీరల పంపిణీని ఫొటోతీస్తున్న ఏబీఎన-ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై ప్రభుత్వ విప్‌ ఆగ్రహం

ఫొటోలు, వీడియోలను బలవంతంగా  భద్రతా సిబ్బందితో డిలీట్‌ చేయించిన వైనం

అనంతపురం, నవంబరు13(ఆంధ్రజ్యోతి): పెనుకొండ కోటలో పాగా వేసేందుకు అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. అధికార దర్పంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పబ్లిక్‌గానే పంపకాలు చేపడుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీని కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అన్నివర్గాల ప్రజలకూ సంక్షేమ ఫలాలు అందించామనీ, వైసీపీవైపే కోట ఓటర్లున్నారని గొప్పలు పోతున్న ఆ పార్టీ ముఖ్య నేతలు ఈ ఎన్నికలో గెలుపు కోసం పడుతున్న ఆపసోపాలు చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. రెండున్నరేళ్ల పాలనలో సంక్షేమ ఫలాలు అందించడం మినహా... ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టలేదన్నది నిర్వివాదాంశం. ఈ క్రమంలోనే ఎలాగైనా పెనుకొండ నగర పంచాయతీని గెలిపించుకోవాలనే లక్ష్యంతో అధికారాన్ని ఫణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతుండటం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణ రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నప్పటికీ పెనుకొండ పట్టణాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్న విమర్శలు స్థానికుల నుంచి మూటగట్టుకుంటున్నారు. వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ్య నేతలందరూ భాగస్వాములైనట్లు అర్థమవుతోంది. వారం రోజులపాటు ముఖ్య నేతలంతా పెనుకొండలో తిష్టవేసి, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. వలంటీర్లు, మహిళా సంఘాల ద్వారా ఓటర్లను బెదిరించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. వైసీపీ అభ్యర్థులకు ఓటేయకపోతే సంక్షేమ ఫలాలు రద్దవుతాయనే భయాన్ని ఓటర్లలో నింపేలా వ్యూహాన్ని రచించి, అమలు పరిచారన్న విమర్శలున్నాయి.




ఓటర్లకు తాయిళాలు..

పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల ప్రచార ఘట్టం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. వారం రోజులపాటు అధికార పార్టీ నేతలు విస్తృతంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వలంటీర్లు, మహిళా సంఘాల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారన్న విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ... ఓటుకు నోటు లేనిది ఓటు వేయరని భావించారో ఏమోగానీ... శనివారం సాయంత్రం నుంచే ఓటర్లకు తాయిళాల ఎరకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. పెనుకొండ నగర పంచాయతీలో 20 వార్డులకుగానూ 22వేల మంది ఓటర్లున్నారు. ఈ లెక్కన ఒక్కో వార్డులో 1000కిపైగా ఓటర్లున్నారు. అధికార పార్టీ వ్యూహంలో భాగంగా ఒక్కో వార్డులో 750 మందికిపైగా ఓటర్లకు ఒక్కొక్కరికి రూ.2వేల నుంచి రూ.3 వేలు ముట్టచెప్తున్నట్లు సమాచారం. పోలింగ్‌ రోజున పరిస్థితిని అంచనా వేసి ఆఖరులో ఒక్కో ఓటరుకు రూ.5వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఓటుకు నోటుతోపాటు అన్ని వార్డుల్లోనూ చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన ఏ పార్టీ నేతలైనా ఆ ప్రాంతంలో ఉండేందుకు వీలులేదన్నది ఎన్నికల నిబంధన. అధికార పార్టీ నాయకులకు ఆ నిబంధనలు వర్తించవేమో మరికొందరు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అక్కడే తిష్టవేసి, తాయిళాల పంపకాల్లో భాగస్వాములవుతున్నా ఎన్నికల నిర్వహణ అధికారులుగానీ, పోలీసులుగానీ అడ్డు చెప్పటం లేదు. అదే ప్రధాన ప్రతిపక్ష టీడీపీతోపాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు అక్కడ ఎవరూ ఉండొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారంటే... పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారులు ఏ మేరకు పారదర్శకత పాటిస్తున్నారో తేటతెల్లమవుతోంది.




ఏబీఎన-ఆంధ్రజ్యోతి ప్రతినిధిపై ప్రభుత్వ విప్‌ ఆగ్రహం

ఎన్నికల నిబంధనల మేరకు... ప్రచారం ముగిసిన వెంటనే ఇతర ప్రాంతాల నా యకులు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఆ నిబంధనలను ప్రభుత్వ విప్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తుంగలో తొక్కారు. ఆయనకు అప్పగించిన 18వ వా ర్డులో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఓటర్లకు తాయిళాలు ఎరచూపే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఆయన సమక్షంలోనే ఆ పార్టీ శ్రేణులు.. ఓటర్లకు చీర, జాకెట్‌తోపాటు డబ్బు పంపిణీ చేస్తుండటాన్ని స్థానిక ఏబీఎన-ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ ఫొ టోలు, వీడియోలు తీస్తుండటాన్ని ఆ పార్టీ నాయకులు గమనించారు. విషయాన్ని ప్రభుత్వ విప్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఏబీఎన-ఆంధ్రజ్యోతి స్థానిక రిపోర్టర్‌పై ఆక్రోశాన్ని వ్యక్తం చేయడంతోపాటు రిపోర్టర్‌ సెల్‌ఫోన లాక్కొని తన భద్రతా సిబ్బందితో వీడి యోలు, ఫొటోలు డిలీట్‌ చేయించారు. పోలీసుల సమక్షంలోనే ఆయన ఏబీన రిపోర్టర్‌ను బెదిరించడం చూస్తుం టే... ఎన్నికల నిర్వహణ అధికారులు ఏ మేరకు నిబంధనలు పాటిస్తున్నారో అర్థమవుతోంది.

Updated Date - 2021-11-14T06:33:39+05:30 IST