పబ్లిక్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-04T15:47:00+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా పది, ప్లస్‌-1, ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పాఠశాలల విద్యాశాఖ ఉన్నతాధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. రెండేళ్ల తర్వాత విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలకు

పబ్లిక్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

- స్ట్రాంగ్‌రూంలకు ప్రశ్నాపత్రాలు

- రేయింబవళ్లు పోలీసు బందోబస్తు

- సీసీ కెమెరాలతో నిఘా


చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా పది, ప్లస్‌-1, ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పాఠశాలల విద్యాశాఖ ఉన్నతాధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. రెండేళ్ల తర్వాత విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతుండటంతో పటిష్ట చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్లస్‌-2 పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల ఐదున ప్రారంభమవుతున్నాయి. రాష్ట్రమంతటా 3119 పరీక్షా కేంద్రాల్లో 8.37 లక్షల మంది విద్యార్థులు  హాజరవుతున్నారు.  పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 6న 3936 పరీక్షా కేంద్రాల్లో ప్రారంభమవుతున్నాయి. ఇక ప్లస్‌-1 (11వ తరగతి)  పరీక్షలు ఈ నెల 10న ప్రారంభమవుతున్నాయి. ఈ  పరీక్షలను ఎలాంటి వివాదానికి తావు లేకుండా ప్రశ్న పత్రాలు లీక్‌ కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రాలకు చేరిన ప్రశ్నపత్రాలను ఎంపిక చేసిన ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు. చెన్నైలో 16 చోట్ల ప్రశ్నపత్రాలను భద్రపరిచారు. ఈ గదుల వద్ద సాయుధ పోలీసులు పహరా కాస్తున్నారు. ప్రశ్నపత్రాలు భద్రపరచినగదుల్లోపల, బయట,  భవనం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగా ఆయా పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించనున్నారు. పరీక్షా కేంద్రంలో హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కన్నా ఎక్కువగా ప్రశ్నపత్రాలను పంపిణీ చేస్తే సంబంధిత నిర్వహణ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాలల విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు.

Read more