ఏపీలో ఓటీఎస్‌పై పెరుగుతున్న వ్యతిరేకత..

ABN , First Publish Date - 2021-12-02T15:45:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఓటీఎస్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో...

ఏపీలో ఓటీఎస్‌పై పెరుగుతున్న వ్యతిరేకత..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఓటీఎస్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా అనంతపురంలోనూ వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌ విధానంపై మహిళలు తిరగబడ్డారు. తమ పేరిట ఉన్న ఇళ్లకు తామెందుకు డబ్బులు కట్టాలంటూ వాలంటీర్లను నిలదీశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానాన్ని స్వచ్చంధంగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా కనిపించడంలేదు. కట్టుకున్న ఇళ్లకు లోన్ కట్టాల్సిందే అంటూ వాలంటీర్లు లబ్దిదారుల పీకలపై కత్తిపెట్టినట్లుగా అడుగుతుండడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.


తమపై అధికారులు చెప్పమన్నదే తాము చెబుతున్నామని వాలంటీర్లు లబ్దిదారులతో అంటున్నారు. దీనిబట్టి వారు తమపై అధికారులు చేస్తున్న ఒత్తిడితోనే బలవంతం చేస్తున్నారన్నది అర్థమవుతోంది. తిరగబడినవారి వీడియోలు తీస్తూ భయపెడుతున్నారు. అయినప్పటికీ లబ్దిదారులు ఏ మాత్రం వెరవకుండా ప్రభుత్వ నిర్ణయం సరికాదని వ్యతిరేకిస్తున్నారు. అనంతపురంలోనూ మహిళా వాలంటీర్  ఎదురుతిరిగిన వారి వీడియోలు తీశారు. మహిళల ఎదురుదాడితో వాలంటీర్ వెళ్లిపోయారు. ఎదురుతిరిగిన వారిని టార్గెట్ చేసుకుని వారికి  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఒకరికి వృద్దాప్య పింఛన్ కోత పెట్టిన వైనం కూడా వైరల్‌గా మారింది.

Updated Date - 2021-12-02T15:45:26+05:30 IST