బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరే

ABN , First Publish Date - 2022-04-17T16:05:52+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోకి వచ్చినా జనం అధికంగా గుమికూడే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పకుండా ధరించాల్సిందేనని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జె. రాధాకృష్ణన్‌ స్పష్టం

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరే

చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడిలోకి వచ్చినా జనం అధికంగా గుమికూడే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పకుండా ధరించాల్సిందేనని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జె. రాధాకృష్ణన్‌ స్పష్టం చేశారు. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలు తొలగిపోవడంతో, మాస్కు ధరించనివారికి జరిమానా విధించబోమన్న ప్రకటనను ప్రజలు అపార్థం చేసుకున్నారని గుర్తు చేశారు. జరిమానా విధించబోమంటే మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అర్థం కాదని వివరించారు. కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు అలల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నదని, ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య జీరోకు చేరిందని చెప్పారు. శనివారం ఉదయం చెన్నైలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. దేశరాజధాని ఢిల్లీలో రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ వ్యాప్తి అధికమైందని, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ వైరస్‌ బాధితుల సంఖ్య పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలంతా కరోనా నిరోధక నిబంధనలు పాటించి అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకూ కరోనా నిరోధక టీకాలు వేసుకోనివారు, రెండో విడత టీకాలు వేసుకోనివారు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి టీకాలు వేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 48 లక్షల మంది టీకాలు వేసుకోలేదని, 1.37 కోట్ల మంది రెండో విడత టీకాలు వేసుకోలేదని చెప్పారు. టీకాలు వేసుకుంటేనే కరోనా వైర్‌సను రాష్ట్రం నుంచి తరిమికొట్టగలమని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా మూడువేల చోట్ల ప్రతిరోజూ టీకాలు వేస్తున్నారని తెలిపారు. చెన్నై సహా ఎనిమిది జిల్లాల్లోనే స్వల్ప సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, మిగిలిన జిల్లాల్లో వైరస్‌ కేసులేవీ ఇప్పటిదాకా నమోదు కాలేదని రాధాకృష్ణన్‌ వివరించారు.  ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకూ రాష్ట్ర ప్రజలందరూ తప్పకుండా ముఖాలకు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-04-17T16:05:52+05:30 IST