ప్రజా సంక్షేమ కార్యకర్తలకు మళ్లీ ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-06-09T13:44:41+05:30 IST

ప్రజా సంక్షేమ కార్యకర్తలకు ప్రత్యామ్నాయ పద్ధతిలో మళ్ళీ ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు

ప్రజా సంక్షేమ కార్యకర్తలకు మళ్లీ ఉద్యోగాలు

- సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ 

- 13,500 మందికి లబ్ధి


చెన్నై, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమ కార్యకర్తలకు ప్రత్యామ్నాయ పద్ధతిలో మళ్ళీ ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నిర్ణయం సమంజసమేనంటూ తేల్చి చెప్పింది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో 13500 మంది ప్రజా సంక్షేమ కార్యకర్తలుగా నియమితులయ్యారు. వీరందరూ తమకు కేటాయించిన ప్రాంతాల్లో స్థానికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడం, ప్రభుత్వ పథకాల ఫలితాలు లబ్దిదారులకు సక్రమంగా అందేలా చూడటం వంటివి చేసేవారు. ఆ నేపథ్యంలో 2011లో అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం వీరిని ఉద్యోగాల నుండి తొలగించింది. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంక్షేమ కార్యకర్తల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. అయితే గత ఏడాది అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం పదకొండేళ్లుగా ఉపాధికోల్పోయిన ప్రజా సంక్షేమ కార్యకర్తలను ఆదుకునేందుకు వారిని గ్రామీణ ఉపాధి  పథకం వాలంటీర్లు, సమన్వయకర్తల పేరుతో ప్రత్యామ్నాయ పద్ధతిలో మళ్ళీ ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ఉద్యోగాల్లో నెలకు రూ.7500 వేతనం చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రజా సంక్షేమ ఉద్యోగుల్లో 75 శాతం మంది హర్షం ప్రకటించారు. ఈ నేపథ్యంలో విల్లుపురం జిల్లాకు చెందిన ప్రజా సంక్షేమ కార్యకర్తల సంఘం అధ్యక్షుడు ధనరాజ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. పదకొండేళ్లుగా ఉపాధి కోల్పోయిన ప్రజా సంక్షేమ కార్యకర్తలకు రూ.7500 వేతనంతో ఉపాధి హామీ పథకంలో వాలంటీర్లు, సమన్వయకర్తలుగా నియమించటం ప్రభుత్వం తీసుకున్న కంటి తుడుపు చర్యంటూ ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించాలని కోరారు. గత పదేళ్లుగా న్యాయపోరాటం సాగిస్తున్న ప్రజా సంక్షేమ కార్యకర్తలకు గతంలా పూర్తి వేతనం చెల్లించాలని, ఏడో వేతన సంఘం ప్రకారం వేతనాలను సవరించాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఆర్‌ షా, అనిరుద్దాబో్‌సతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బుధవారం ఉదయం ఈ పిటిషన్‌ విచారణకు రాగా ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది పి.విల్సన్‌ వాదనలు వినిపిస్తూ... కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ప్రజా సంక్షేమ కార్యకర్తలను ఆదుకోవాలన్న మానవతా దృక్పథంతోనే మళ్ళీ వారిని ప్రత్యామ్నాయ పద్ధతిలో ఉద్యోగావకాశాలు కల్పించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజా సంక్షేమ కార్యకర్తల తొలగింపును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు తుదితీర్పునకు కట్టుబడి ఉండే విధంగానే ఈ నిర్ణయం ప్రకటించిందని, ప్రభుత్వం తీసుకున్న ఈ విధానపరమైన నిర్ణయాన్ని వ్యతిరేకించడం సమంజసం కాదని వివరించారు. రాజకీయ లబ్ది కోసం దాఖలైన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ... ప్రజా సంక్షేమ కార్యకర్తలకు మళ్ళీ ఉద్యోగాలు కల్పించాలని తీసుకున్న నిర్ణయం సమంజసమేనని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రజాసంక్షేమ కార్యకర్తలను ఆ ఉద్యోగాల్లో చేరాల్సిందేనని ప్రభుత్వపరంగా ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని, నచ్చినవారు ఈ ఉద్యోగాల్లో చేరవచ్చని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రజా సంక్షేమ కార్యకర్తలకు ప్రత్యామ్నాయ పద్ధతిలో మళ్ళీ ఉద్యోగాలు కల్పించేలా తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేయలేమని తేల్చి చెప్పింది.           కాగా సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలో 13500మంది లబ్ధిపొందనున్నారు.

Updated Date - 2022-06-09T13:44:41+05:30 IST