పబ్‌.. డ్రగ్స్‌ హబ్‌!

Published: Mon, 04 Apr 2022 02:40:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పబ్‌.. డ్రగ్స్‌ హబ్‌!

 • ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో డ్రగ్స్‌ వినియోగం
 • టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల మెరుపుదాడిలో లభ్యం
 • బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ హోటల్‌లో పబ్‌ నిర్వహణ
 • 150 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
 • సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, నాగబాబు కూతురు నిహారిక,
 • అంజన్‌కుమార్‌ యాదవ్‌ కొడుకు సహా ప్రముఖుల పిల్లలు
 • నోటీసులిచ్చి వదిలేసిన పోలీసులు.. పబ్‌ యాజమాన్యంపై కేసు
 • తమ పిల్లలు బర్త్‌డే పార్టీకి వెళ్లారంటున్న కుటుంబ సభ్యులు
 • పబ్‌లో ఉన్నవారంతా డ్రగ్స్‌ వినియోగించినవారు కాదు
 • దర్యాప్తులో గుర్తించి చర్యలు తీసుకుంటాం: డీసీపీ జోయల్‌ డేవిస్‌
 • బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు.. ఏసీపీకి చార్జిమెమో


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో నిషేధిత మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పబ్‌పై జరిపిన మెరుపుదాడిలో ఈ వ్యవహారం బయటపడింది. పోలీసులు దాడి జరిపినప్పుడు పబ్‌లో పలువురు ప్రముఖుల పిల్లలు ఉండడం సంచలనం సృష్టించింది. అయితే పబ్‌లో ఓ బర్త్‌డే పార్టీకి తమ పిల్లలు వెళ్లారని, డ్రగ్స్‌తో వారికి ఎటువంటి సంబంధం లేదని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 6లోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో పెద్ద శబ్దాలు వస్తున్నాయని, పెద్ద ఎత్తున పార్టీ జరుగుతోందని, కస్టమర్లు డ్రగ్స్‌ కూడా సేవిస్తున్నారని పోలీసులకు శనివారం అర్ధరాత్రి సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, స్థానిక పోలీసుల సహాయంతో అర్ధరాత్రి 2 గంటలకు పబ్‌ లోపలికి ప్రవేశించారు. అందులో పెద్దసంఖ్యలో యువతీ యువకులు మద్యం తాగుతూ కనిపించారు. వెంటనే తనిఖీలు చేపట్టిన పోలీసులకు తెల్లటి పౌడర్‌తో కూడిన 5 ప్యాకెట్లు లభించాయి. అందులో కొకైన్‌ ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. వెంటనే పబ్‌ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ (35), పార్ట్‌నర్‌ అభిషేక్‌ ఉప్పల(39)తోపాటు ఆ సమయంలో పబ్‌లో ఉన్న 148 మంది యువతీ యువకులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. 


పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్‌ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌, సినీనటుడు నాగబాబు కూతురు నిహారికతోపాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ కుమారుడు ఉన్నారు. వీరితోపాటు సిద్దార్థ్‌ గల్లా అనే పేరు, ఏపీలోని ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి కూతురు, మాజీ ఎమ్మెల్యే కుమారుడి పేరు కూడా పోలీసులు వెల్లడించిన జాబితాలో ఉన్నాయి. వీరందరినీ పోలీసులు బంజారాహిల్స్‌ పీఎ్‌సలో విచారించి తర్వాత వదిలేశారు. అయితే పోలీసులు తొలుత విడుదల చేసిన జాబితాలో 142 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత సాయంత్రానికి అ లిస్టు కాస్తా 148కి చేరింది. 143 వపేరుగా నిహారిక ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు మిగతా ఐదుగురి పేర్లు వెల్లడించలేదు. ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్‌ ఠాణా వద్ద వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.


పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 20 మంది పబ్‌ సిబ్బంది కాగా, 90 మంది యువకులు, 38 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. పబ్‌ మేనేజర్‌ క్యాబిన్‌ వద్ద నుంచి 5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పబ్‌లో దొరికిన డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఆరా తీస్తున్నామన్నారు. డ్రగ్స్‌ సరఫరా దారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.


అందరూ నిందితులు కాదు..

పబ్‌లో అదుపులోకి తీసుకున్న వారందరూ డ్రగ్స్‌ వినియోగించలేదని, వారిలో కొందరు మాత్రమే డ్రగ్స్‌ తీసుకున్నారని డీసీపీ జోయల్‌ డేవిస్‌ అన్నారు. వారిని గుర్తించి అరెస్ట్‌ చేస్తామన్నారు. దర్యాప్తులో అనుమానం ఉన్నవారి నమూనాలు సేకరిస్తామని, వారు డ్రగ్స్‌ వినియోగించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి నిజాలను వెలుగులోకి తెస్తామన్నారు. పబ్‌ యజమానులు అర్జున్‌ వీరమాచినేని, అభిషేక్‌ ఉప్పల, జనరల్‌ మేనేజర్‌ అనిల్‌లపై కేసులు నమోదు చేశామని డీసీసీ తెలిపారు. పలు చేతులు మారిన పబ్‌ నిర్వహణను గత ఏడాది ఆగస్టు నుంచి అర్జున్‌, అభిషేక్‌లు చూసుకుంటున్నారని పేర్కొన్నారు. పార్టీలోకి డ్రగ్స్‌ ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, పబ్‌ యజమానులకు తెలియకుండా ఇది జరుగుతుందేమోనన్న అనుమానం కూడా ఉందని అన్నారు. మత్తు పదార్ధాలు విక్రయించిన వారిని, సేవించిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదన్నారు. కాగా, పబ్‌కు సంబంఽఽధించిన మరో పార్ట్‌నర్‌ అర్జున్‌ వీరమాచినేని అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


ఆపరేషన్‌ జరిగిందిలా...!

విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు పబ్‌లో లేట్‌ నైట్‌ పార్టీ జరుగుతుందని సమాచారం అందిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు రహస్య ఆపరేషన్‌ చేపట్టారు. కొత్తగా విధుల్లో చేరిన ఎస్‌ఐతోపాటు యువకుడైన మరో కానిస్టేబుల్‌ను సిద్ధం చేశారు. వారు రాత్రి 11 గంటల సమయంలో ఎవరికీ అనుమానం రానివిధంగా సిద్ధమై పబ్‌లోకి వెళ్లారు. అక్కడివారిలో కలిసిపోయి.. లోపల జరుగుతున్న వ్యవహారాన్ని గమనించడం మొదలుపెట్టారు. మొదట్లో భారీగా మందు పార్టీ అని భావించినా.. కొందరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటాన్ని గుర్తించారు. కొందరు పబ్‌లోని ఒక గదిలోకి వెళ్లి.. కాసేపటికి బయటకు రావటాన్ని గుర్తించారు. అక్కడ డ్రగ్స్‌ వినియోగం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించి పై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే 28 మంది సభ్యులతో కూడిన ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత పబ్‌ వద్దకు చేరుకుంది. అందరూ లోపలకు వెళ్లి.. తనిఖీలు ప్రారంభించారు. 


దీంతో అక్కడేం జరుగుతుందో లోపలివారికి అర్థం కాక గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం మరో 28 మందితో కూడిన రెండు పోలీసులు బృందాలు పబ్‌ వద్దకు చేరుకుని అందులోని వారందరినీ బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌ వద్దకు తీసుకొచ్చి. స్టేషన్‌ గేటు వేశారు. దీంతో తమను స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ పలువురు ప్రశ్నించారు. తామేం తప్పు చేశామో చెప్పాలని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పబ్‌ లోకి వచ్చింది ఎంత?హైదరాబాద్‌ నడి బొడ్డున.. అదీ బంజారాహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌కు కిలోమీటరు దూరం కూడా లేని ఈ పబ్‌ లో భారీగా డ్రగ్స్‌ వినియోగం జరగటం విస్మయానికి గురి చేస్తోంది. 


ఇంతవరకు డ్రగ్స్‌  వినియోగం గుట్టుగా.. చాటుమాటుగా.. నగర శివారులోనే జరిగేది. అందుకు భిన్నంగా ఒక విలాసవంతమైన పబ్‌లో పార్టీ పేరుతో డ్రగ్స్‌ వినియోగం జరగటం చూస్తే.. హైదరాబాద్‌ లో మాదకద్రవ్యాల వినియోగం జోరు ఎంత పెరిగిందనటానికి ఈ ఉదంతం ఒక నిదర్శనమని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. పబ్‌లోకి డ్రగ్స్‌ ఎంత మొత్తంలో వచ్చిందన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలక అధికారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 60 గ్రాములు పబ్‌లోకి వచ్చిందని తెలుస్తోంది. ప్రాథమికంగా కొకైన్‌ గా భావిస్తున్నప్పటికీ.. ఫోరెన్సిక్‌  నివేదిక ఆధారంగా అదేమిటన్నది తేల్చనున్నారు. పోలీసుల విచారణలో దాదాపు 48 గ్రాముల మాదక ద్రవ్యాన్ని వినియోగించినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. మరో ఐదు గ్రాముల తెల్లటి పొడి లాంటి పదార్థాన్ని (ఐదు పాకెట్లు) స్వాధీనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు పోలీసులు వెల్లడించిన సమాచారంలోనూ ఉంది. అయితే.. పోలీసుల అంతర్గత లెక్కల ప్రకారం మరో ఏడు గ్రాముల పౌడర్‌ లెక్క తేలటం లేదని తెలుస్తోంది. దీని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు డ్రగ్స్‌ను పబ్‌ లోపలకు ఎవరు తెచ్చారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారంతా తాము స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వచ్చామని, తమకు డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. కానీ, బర్త్‌డే పార్టీ ఎవరిదన్నది మాత్రం తెలియడంలేదు. 


సీఐ సస్పెన్షన్‌...ఏసీపీకి మెమో

సాధారణంగా హైదరాబాద్‌లో పబ్‌లు శని, ఆదివారాల్లో రాత్రి ఒంటి గంట వరకు నడుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గంట నుంచి రెండు గంటల పాటు ఎక్కువగా నడుస్తున్నా.. పట్టించుకునే పరిస్థితి లేదు. పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ వద్ద పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. దీంతో పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దందాలు సాగుతున్నాయని గుర్తించిన సీపీ.. బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శివచంద్రను సస్పెండ్‌ చేశారు. బంజారాహిల్స్‌ ఏసీపీకి మెమో జారీ చేశారు. కేసును విచారించాల్సిందిగా జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్‌ నార్త్‌జోన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న కె.నాగేశ్వరరావును బంజారాహిల్స్‌ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.