కదిరి మార్కెట్‌పై పులివెందుల పెత్తనం

ABN , First Publish Date - 2021-04-22T06:21:17+05:30 IST

పట్టణంలోని కూరగాయాల మార్కెట్‌ పై పులివెందుల వాసుల పెత్తనం మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. వారు చేప్పిందే వేదం. ఇతరులు వేలం పాటకు రాకుండా వారి పద్ధతుల్లో అడ్డుకట్టవేస్తారు.

కదిరి మార్కెట్‌పై పులివెందుల పెత్తనం
కదిరి మున్సిపల్‌ కార్యాలయం

- సిండికేట్‌తో మున్సిపాలిటీ ఆదాయానికి రూ. 10 లక్షల గండి

- ఇంకా వసూలుకాని గత సంవత్సరం బకాయి


కదిరి, ఏప్రిల్‌ 21: పట్టణంలోని కూరగాయాల మార్కెట్‌ పై పులివెందుల వాసుల పెత్తనం మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. వారు చేప్పిందే వేదం. ఇతరులు వేలం పాటకు రాకుండా వారి పద్ధతుల్లో అడ్డుకట్టవేస్తారు. ఈ సంవత్సరం కూడా అదే కొనసాగింది. వేలంపాట పాడడానికి వచ్చిన వారితో సిండికేట్‌ అయ్యి దాదాపు రూ.10 లక్షలు మున్సిపాలిటీ అదాయానికి గండి కొట్టినట్లు తెలుస్తోంది. అధికారులు కూడా వారికి వారికి వంత పాడి తమ అదా యాన్ని తాము చూసుకున్నట్లు అరోపణలు ఉన్నాయి. వేలం పాటలో పాల్గొన్న వారంతా కౌన్సిలర్‌లకు సమీప బంధువులని తెలుస్తోంది. మున్సిపాలిటీ అదా యం పెంచాల్సిన వారే మున్సిపాలిటీ అదాయానికి గండి కొట్టడంపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. గత సంవత్సరం వేలం పాట పాడిన కాంట్రాక్టర్‌ ఇంతవరకు డబ్బు చెల్లించకపోయినా అధికారులు వారిని చూసిచూడనట్లు వదిలేస్తున్నారు. 


 మున్సిపాలిటీ ఆదాయానికి గండి

 సాధరణంగా మున్సిపాలిటీలో కూరగాయాల మార్కెట్‌ వేలం వేయడానికి కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి. అందుకు భిన్నంగా మున్సిపాలిటీలో వ్యవహారించినట్లు తెలుస్తోంది. మొదట మార్కెట్‌ వేలం పాటకు పత్రికా ప్రకటనలు ఇచ్చారు. అయితే మూడుసార్లు వాయిదా పడింది. దీన్ని అలుసుగా తీసుకొని నిబంధనలు పాటించకుండా వేలం నిర్వహించారు. వేలంపాట విలువ నిర్ణయించాలంటే గత మూడు సంవత్సరాల సరాసరి తీసుకోవాలి. వాస్తవానికి గత మూడు సంవత్సరాల సరాసరి పరిశీలిస్తే రూ. 25 లక్షలకు పైబడి వేలం పాట నిర్వహించాలి.  అమేరకు 2021 -22 లో రూ.25 లక్షలకు పైబడి నిర్వహించాలి. అయితే అధికారులు మాత్రం గత సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది.


   వేలం పాటకు ఐదుగురు డిపాజిట్‌ చెల్లించారు. అందరూ కలిసి రూ. 50 వేలు మాత్రమే పెంచగలిగారు. దీంతో మున్సిపాలిటీకి రూ. 22,70,000 ఆదాయం చేకూరింది. వాస్తవానికి వేలంపాట సరిగా నిర్వహిస్తే రూ. 30 నుంచి 35 లక్షల వరకు అదాయం వచ్చే అవకాశం ఉంది. అం టే సిండికేట్‌ వల్ల మున్సిపాలిటీకి దాదాపు రూ. 10 లక్షల వరకు గండిపడింది.


మూడు సంవత్సరాలుగా వారే..

 మూడు సంవత్సరాలు పులివెందుల వాసుల పెత్తనం కొనసాగుతున్నట్లు విమర్ళలున్నాయి. 2018-19, 2019-20, 2021-21 సంవత్సరాలకు  కే లక్ష్మీనారాయణమ్మ పేరుతో కొనసాగింది. వీరు పులివెందుల వాసులు. అయినా గత మూడు సంవత్సరాల నుంచి వారికే కాంట్రాక్టు దక్కింది. 2020 - 21 సంవత్సరంలో  వేలం పాట రూ.22,20,000లకు పాడారు. అందులో ఇప్పటి వరకు రూ. 11 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇంకా దాదాపు రూ. 11 లక్షల రూపాయలు బకాయి ఉన్నా చెల్లించలేదు. కరోనా కారణంగా కొంత వెసులుబాటు ఇచ్చినప్ప టికి ఇంతవరకు బకాయి చెల్లించలేదు. అయితే ఇంతవరకు అధికారులు దాన్ని పట్టించుకున్న దాఖాలాలు లేవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్‌ రఫీ అనే కాంట్రాక్టర్‌కు కాంట్రాక్టు దక్కింది. అయన కూడా పులివెందులకు చెందిన వా రుగా తెలుస్తోంది. గతంలో వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్‌ మున్సిపాలిటీకి బకాయి ఉండడంతో వేలం పాటలో పాడడానికి వీలులేదు. అందువల్లే మరో వ్యక్తిని రంగంలోని దింపినట్లు తెలుస్తోంది. 


కౌన్సిలర్ల సహకారంపై విమర్శలు

 కూరగాయల మార్కెట్‌ వేలం పాటలో వేలం పాడడానికి ఐదుగురు డిపాజిట్‌ చెల్లించారు. వారిలో నరసింహాచారి, శ్రీరాములు, నూరుల్లా, అర్షద్‌ బాష, ఎస్‌ రఫీలు ఉన్నారు. వీరిలో నరసింహచారి, నూరుల్లా, అర్షద్‌బాషలు ప్రస్తుత కౌన్సిలర్ల కుటుంబసభ్యులు, లేదా సమీప బంధువులుగా ఉన్నట్లు తెలిసింది. కౌన్సిలర్లు పాటలో పాల్గొనలేక వీరితో డిపాజిట్‌ కట్టించినట్లు తెలిసింది. అయితే పాటలో పాల్గొని వారికి సహకరించినందుకు వీరికి వేలల్లో ముట్టజెప్పినట్లు తె లిసింది. మున్సిపాలిటీ అదాయాన్ని పెంచాల్సిన కౌన్సిలర్‌లే అదాయంపై గండికొట్టారని పలువురు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. 


వేలంపాట వివరాలు పరిశీలిస్తాం..

మార్కెట్‌ కోసం జరిగిన వేలం పాట వివరాలను పరిశీలిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల తెలిపారు. తాను బదిలీపై వచ్చానని, వేలం పాట వివరాలు పరిశీలించి చర్యలు తీసుకుంటానని అమె వివరణ ఇచ్చారు. 


Updated Date - 2021-04-22T06:21:17+05:30 IST