పునరావాస కాలనీల్లో ఓటీఎస్‌ తేలేదెట్టా!

ABN , First Publish Date - 2021-12-18T04:50:53+05:30 IST

మండలంలో పునరావాస కాలనీలకు సంబంధించి తరలించిన వారికి జగనన్న గృహహక్కు కింద ఓటీఎస్‌(వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌) పథకానికి కొరుకుడు పడని సమస్యలు తలెత్తుతున్నాయి.

పునరావాస కాలనీల్లో ఓటీఎస్‌ తేలేదెట్టా!
నేలటూరు పట్టపుపాళెం

తరలించిన వారికి కట్టేదెవరు?

అధికారుల మల్లగుల్లాలు


ముత్తుకూరు, డిసెంబరు 17: మండలంలో పునరావాస కాలనీలకు సంబంధించి తరలించిన వారికి జగనన్న గృహహక్కు కింద ఓటీఎస్‌(వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌) పథకానికి కొరుకుడు పడని సమస్యలు తలెత్తుతున్నాయి. ఎప్పుడో 14 ఏళ్ల కిందటే కృష్ణపట్నం పంచాయతీలోని అయ్యవారప్పకండ్రిగ, నక్కలమిట్ట గ్రామాలను థర్మల్‌ కేంద్రాల కోసం, రామలింగాపురం, ఆదాల నగర్‌, పాదర్తిపాళెం గ్రామాలను పునరా వాసం కింద ముత్తుకూరుకు తరలించారు. వీరిలో కొందరి పేర్లు ఓటీఎస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ఆ గ్రామాల్లోని పక్కా ఇళ్లను తొలగించి థర్మల్‌ కేంద్రాలు, కృష్ణపట్నం పోర్టు నిర్మాణం చేపట్టారు. అక్కడి వారికి పరిహారం చెల్లించి పునరావాసం కల్పించి ముత్తు కూరుకు తరలించారు. అయితే ఆ పక్కాగృహాల బకాయిలు అలాగే ఉండడంతో ప్రస్తుతం ఓటీఎస్‌ జాబితాలో దాదాపు 200 మందికి పైగా పేర్లు ఉన్నట్లు సమాచారం. మరి ఓటీఎస్‌ కింద ఈ బకాయిలు ఎవరు చెల్లిస్తారన్న సందిగ్ధం అధికారుల్లో నెలకొంది. దీంతో పాటు పునరావాస కల్పన కింద నేలటూరు, నేలటూరు పట్టపుపాళెం, దళిత వాడలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వీరికి ధనలక్ష్మీపురం, మాదరా జుగూడూరు, కొత్తకోడూరు సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దశలో నేలటూరు పంచాయతీలో ఓటీఎస్‌ కింద నగదు చెల్లించేందుకు లబ్ధిదారులు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఈ పంచాయతీ పరిధిలో 68 మంది లబ్ధిదారులు ఓటీఎస్‌ జాబితాలో ఉండగా.. కేవలం ఐదుగురు మాత్రమే ఓటీఎస్‌ కింద నగదు చెల్లించి ఉన్నారు. ఇదివరకే పునరావాసం కింద ముత్తుకూరు తరలించిన వారితో పాటు, ప్రస్తుతం తరలించేందుకు సిద్ధంగా ఉన్న గ్రామాల్లో ఓటీఎస్‌ కట్టమనడం ఎంతవరకు సబబని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. వీరిని ఓటీఎస్‌ కట్టమని అడిగేందుకు మండల అధికారులు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు. మరి ఈ పునరావాస కాలనీల ఓటీఎస్‌ పరిస్థితి ఏమిటనేది జిల్లా అధికారులు తేల్చాల్సి ఉంది. 

Updated Date - 2021-12-18T04:50:53+05:30 IST