Advertisement

సమయపాలనే ప్రధానం!

Apr 23 2021 @ 00:00AM

రంజాన్‌ మాసంలో పాటించే ఉపవాస దీక్షల్లో సమయపాలనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉపవాసాన్ని ప్రారంభించడానికి తీసుకొనే ఆహారాన్ని ‘సహరీ’ అంటారు. ఉపవాసం ముగించిన తరువాత తీసుకొనే ఆహారాన్ని ‘ఇఫ్తార్‌’ అంటారు. ఉపవాసాలు చేసేవారికి సహరీ, ఇఫ్తార్‌ల గురించి పరిజ్ఞానం ఉండడం చాలా అవసరం. నిర్ణీత సమయానికి ముందు కానీ, సమయం దాటిన తరువాత కానీ సహరీ, ఇఫ్తార్‌లు చేస్తే ఉపవాసం వ్యర్ధమయ్యే ప్రమాదం ఉంది. నమాజ్‌, ఉపవాసాలు, హజ్‌ లాంటి వాటిలో సమయపాలనకూ, క్రమశిక్షణకూ ఇస్లాం ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. ‘‘రాత్రి నల్లదనం నుంచి ఉషోదయపు తెల్లదనం ప్రస్ఫుటం అయ్యేవరకూ ఆహారం తీసుకోండి. ఆ తరువాత రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి’’ అని అల్లాహ్‌ ఆదేశించారు (దివ్య ఖుర్‌ఆన్‌ 2:187)


సహరీ చేయడం సున్నత్‌... అంటే మహా ప్రవక్త మహమ్మద్‌ ప్రవచించిన సంప్రదాయం. ‘‘ఇతర గ్రంథాలను అనుసరించే ప్రజలకూ, మనకూ ఉపవాసాల్లో బేధం సహరీ భుజించడంలోనే ఉంది’’ అని మహా ప్రవక్త తెలిపారు. ‘‘రాత్రి చివరి మూడవ జాములో చేసే భోజనాన్ని ‘సహరీ’ అంటారు. సహరీ భుజించండి. చాలా శుభం కలుగుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. 


‘‘మంచి వైపు పిలిచేవారూ, చెడు నుంచి వారించేవారూ తప్పకుండా మీలో ఉండాలి’’ అని అల్లాహ్‌ నిర్దేశించారు. అయితే, అటువంటి వ్యక్తులకు శిక్షణ సహరీ నుంచే లభిస్తుంది. సహనం, సమయపాలన, త్యాగం, క్షమ, లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవడం, మనో నిగ్రహం, జవాబుదారీతనం... వీటన్నిటినీ మనిషిలో జాగృతం చేసే శిక్షణను ఇది అందిస్తుంది. కానీ ఇవన్నీ చేకూరాలంటే వ్యక్తుల్లో సంకల్ప శుద్ధి తప్పనిసరి. ఉపవాసాన్నయినా, ఏ కార్యాన్నయినా ఇతరుల మెప్పు కోసం కాకుండా, అల్లాహ్‌ ప్రసన్నతను పొందడానికే చెయ్యాలి. కాబట్టి మనసులో గట్టి సంకల్పం చేసుకోవాలి.


మగ్రిబ్‌ నమాజ్‌కు ముందు ఉపవాసాన్ని విరమిస్తూ తీసుకొనే ఆహారాన్ని ‘ఇఫ్తార్‌’ అంటారు. సూర్యుడు అస్తమించిన వెంటనే ఇఫ్తార్‌ చేయాలి. జాప్యం చేయకూడదు. ఎందుకంటే ఉపవాసం లక్ష్యం ఆకలితో ఉండడం కాదు, ఈ దీక్ష పాటించిన వారిలో విధేయతాభావం ఏర్పడడం. రంజాన్‌ మాసం స్నేహసంబంధాలను పెంపొందించే నెల. తోటివారికి సేవలను అందించే నెల. తమ ప్రేమనూ, ఆనందాన్నీ తినుబండారాల రూపంలో, రుచికరమైన ఫలాల రూపంలో ఇఫ్తార్‌ సమయంలో పంచుతారు. ఇది చాలా పుణ్యప్రదమైన కార్యం. ఎవరైతే ఉపవాసం పాటించిన వ్యక్తితో ఇఫ్తార్‌ చేయిస్తారో, అతని అపరాధాలన్నీ మన్నన పొందుతాయనీ, అతను చేసే ఈ సత్కార్యం నరకాగ్ని నుంచి విముక్తి కలిగించడానికి సాధనం అవుతుందనీ హదీస్‌ గ్రంథం పేర్కొంటోంది. ఇఫ్తార్‌లో ఖర్జూరాన్ని వినియోగించడం మహా ప్రవక్త సంప్రదాయం. ఉపవాసం పాటించిన వ్యక్తి ఇఫ్తార్‌ సమయంలో దేని కోసం అర్థించినా దాన్ని అల్లాహ్‌ తిరస్కరించడు. 


ఉపవాసాల ద్వారా ఆకలి గురించి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. తద్వారా సమాజంలోని నిరుపేదలనూ, అన్నార్తులనూ ఆదుకొనే గుణం అలవడుతుంది. ఉపవాస దీక్ష ద్వారా మనిషిలో పాపభీతి, దైవభీతి, జవాబుదారీతనం లాంటి సుగుణాలు జనిస్తాయి. ‘‘సహరీ, ఇఫ్తార్‌లను ప్రవక్త ఆచరణ మార్గంలో పాటించే భాగ్యం కలిగించు, మా అందరి ఉపవాసాలనూ అంగీకరించు’’ అని అల్లా్‌హను ప్రార్థించాలి.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.