తీర్పు కంటె ముందే శిక్షలు

ABN , First Publish Date - 2020-06-25T06:29:20+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనకారిణి, ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయ విద్యార్థిని అయిన సఫూరా జర్గార్‌కు ఎట్టకేలకు మంగళవారం నాడు బెయిల్‌ లభించింది. జర్గార్‌ మీద ఢిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన హింసాకాండకు...

తీర్పు కంటె ముందే శిక్షలు

పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక నిరసనకారిణి, ఢిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయ విద్యార్థిని అయిన సఫూరా జర్గార్‌కు ఎట్టకేలకు మంగళవారం నాడు బెయిల్‌ లభించింది. జర్గార్‌ మీద ఢిల్లీలో గత ఫిబ్రవరిలో జరిగిన హింసాకాండకు సంబంధించి తీవ్రమైన అభియోగాలను ఢిల్లీ, యుపి పోలీసులు పోటాపోటీగా మోపి, ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే నాటికే గర్భవతి అయిన జర్గార్‌ను బెయిల్‌ మీద విడిపించడం కోసం రెండు నెలలుగా న్యాయపోరాటం జరుగుతూనే ఉన్నది. గతంలో ఒకసారి బెయిల్‌ లభించినప్పటికీ, మరిన్ని అభియోగాలు మోపి పోలీసులు తిరిగి నిర్బంధంలోకి తీసుకోవడంతో, జర్గార్‌ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెలువడ్డాయి. ‘ఉపా’, దేశద్రోహం వంటి తీవ్ర అభియోగాలను ఆమెపై మోపిన ప్రాసిక్యూషన్‌ బెయిల్‌ పిటిషన్‌లను గట్టిగా ప్రతిఘటిస్తూ వచ్చింది. ప్రభుత్వ వైఖరిపై విమర్శలు, వ్యతిరేకత పెరిగిపోవడంతో, ఎట్టకేలకు మంగళవారం నాడు ఢిల్లీ హైకోర్టులో సొలిసిటర్‌ జనరల్‌ ‘చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఆమె పాల్పడకుండా ఉండే షరతు మీద’ బెయిల్‌ ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని చెప్పారు. తేలికపాటి షరతుల మీద న్యాయమూర్తి ఆమెకు బెయిల్‌ ఇచ్చారు. ఇప్పుడు జర్గార్‌ 23 వారాల గర్భవతి.


జర్గార్‌ విషయంలో ప్రభుత్వ వైఖరి ప్రత్యేకంగా ఉండడానికి కారణం స్పష్టమే. ఆమె మాత్రమే కాదు, ఢిల్లీ హింసాకాండ అభియోగాల మీద, పౌరసత్వ చట్ట వ్యతిరేక ఉద్యమకారులను అనేకమందిని తీవ్రమైన చట్టాల కింద అరెస్టు చేశారు. ఉద్యమంలో చురుకుగా వ్యవహరించిన జర్గార్‌ అరెస్టు ఆ నిర్బంధం అంతటికీ ప్రతీకగా మారిపోయింది. గర్భవతి అని కూడా చూడకుండా, ఆమెపై ప్రదర్శిస్తున్న కఠిన వైఖరి ప్రజాస్వామ్యవాదులను కలచివేసింది. అన్నిటికి మించి, ఈ నిర్బంధ కాండకు కరోనా కల్లోల సమయాన్ని ఎంచుకోవడం. కేంద్రపాలిత ప్రాంతమయిన ఢిల్లీలో శాంతిభద్రతల నిర్వహణ కేంద్రప్రభుత్వం కిందనే ఉంటుందన్నది తెలిసిందే. కేవలం ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా, రకరకాల ఉద్యమకారులను అదుపులోకి తీసుకోవడానికి, లాక్‌డౌన్‌ సమయాన్ని కేంద్రం ఎంచుకోవడం, వార్థక్యం, అనారోగ్యం, ఇతర సమస్యలు– ఏవున్నా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం ఈ నిర్బంధకాండలో కనిపించింది. 


గర్భవతి అన్న కారణం– బెయిల్‌ ఇవ్వడానికి ప్రాతిపదిక కాజాలదని ఢిల్లీ పోలీసులు చివరిదాకా వాదించారు. ఢిల్లీ జైళ్లలో ఇప్పటిదాకా ఎన్ని కాన్పులయ్యాయో వివరిస్తూ, ప్రసవాలకు జైలు సురక్షితమైనదని చెప్పారు. జైళ్లలో కరోనావ్యాప్తి అవకాశాలను కూడా పోలీసులు కొట్టిపారేశారు. కరోనా సోకడానికి జైలులో అతి తక్కువ అవకాశమున్నదని చెప్పారు. మరి దేశవ్యాప్తంగా సాధారణ కేసులలో శిక్షలు అనుభవిస్తున్నవారిని, విచారణలో ఉన్నవారిని ఎందుకు విడుదల చేసినట్టు? తీవ్రమైన అభియోగాలున్న వారి విషయంలో మాత్రం పెరోల్‌, బెయిల్‌లను నిరాకరించడం దేశవ్యాప్త విధానం అయింది. మరి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులను తరలిస్తూ పట్టుబడిన సందేహాస్పద పోలీసు అధికారి దేవీందర్‌సింగ్‌కు బెయిల్‌ ఎట్లా లభించింది? అతని కంటె 81 ఏండ్ల వృద్ధుడు వరవరరావు ప్రమాదకారియా? న్యాయవాది సుధా భరద్వాజ్‌ నేరస్థురాలా? – అన్న ప్రశ్నల్లో న్యాయం కనిపించడం లేదా? 


జర్గార్‌ బెయిల్‌ గురించి వాదిస్తూ, ఆమె న్యాయవాది నిత్యా రామకృష్ణన్‌, గర్భస్థ శిశువు హక్కుల గురించి ప్రస్తావించారు. న్యాయమూర్తి రాజీవ్‌ షక్ధర్‌ ఇంకా జన్మించని శిశువుకు ఉండే హక్కుల చట్టబద్ధమైన ప్రతిపత్తి ఏమిటో వివరించమని కోరారు. నిత్యా రామకృష్ణన్‌ ఆ అంశంపై సవివరమైన పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. వివిధ దేశాల చట్టాలలో గర్భధారణ నుంచి ప్రసవం దాకా, తల్లికి, వైద్యసిబ్బందికి, ప్రభుత్వ యంత్రాంగానికి ఉండే బాధ్యతలు, అధికారాలను ఆమె ఆ పత్రంలో వివరించారు. ‘‘గర్భస్థ శిశువును కాపాడడం లక్ష్యం, దాన్ని ముందుజాగ్రత్త, సేవల ద్వారానే నెరవేర్చగలం, ఆ ముందుజాగ్రత్త అన్న అంశమే, గర్భధారణను బెయిల్‌ మంజూరుకు ఒక ప్రాతిపదిక చేస్తుంది’’ అని నిత్యా రామకృష్ణన్‌ ఆ పత్రంలో వివరించారు. 


ఒక వైపు న్యాయవిచారణ వ్యవస్థను సాధ్యమైనంత మానవీయంగా, సున్నితంగా మార్చడానికి సహృదయులు, ప్రజాపక్షపాతులు అయిన న్యాయవాదులు, న్యాయకార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. కానీ, నేరిపరిశోధనా యంత్రాంగం మాత్రం తాను తగినంత స్పందనలను అలవరచుకోకపోగా, న్యాయవిచారణా వ్యవస్థపై కూడా మొరటుదనాన్ని, ప్రతీకార సరళిని రుద్దడానికి ప్రయత్నించడం చూస్తున్నాము. ఒక నేరం రుజువు కానంతవరకు, నిందితులు నేరస్థులు కారని, వారితో గౌరవంగా వ్యవహరించాలని నేరపరిశోధక, న్యాయ యంత్రాంగాలకు కొత్తగా చెప్పవలసిన అవసరం ఉన్నదా? మానవీయ కారణాలున్నప్పుడు మరణశిక్షలు కూడా రద్దు అయ్యాయి, కఠిన శిక్షలు సరళమయ్యాయి, సుదీర్ఘనిర్బంధాలు కుంచించుకుపోయాయి. కానీ, వర్తమానంలో వికలాంగుల మీద కూడా కారుణ్యం ఉండడం లేదు. వ్యక్తిగత కార్పణ్యానికి తావుండకూడని శాంతి భద్రతల నిర్వహణప్రక్రియలు, కొందరి మీదనే గురిపెట్టి వ్యవహరిస్తున్నాయి.

Updated Date - 2020-06-25T06:29:20+05:30 IST