పంజాబ్ ఎన్నికలు : కేజ్రీవాల్ సరికొత్త వాగ్దానం

ABN , First Publish Date - 2022-02-05T20:12:15+05:30 IST

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రభుత్వోద్యోగాల్లో

పంజాబ్ ఎన్నికలు : కేజ్రీవాల్ సరికొత్త వాగ్దానం

చండీగఢ్ : పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే ప్రభుత్వోద్యోగాల్లో అవినీతిని నిర్మూలిస్తామని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. యువత రాష్ట్రాన్ని వదిలి, విదేశాలకు వెళ్ళవలసిన తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయన్నారు. తమ భూములను కేవలం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు అమ్ముకోవలసి వస్తోందన్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే పంజాబ్‌కు ఏమవుతుందని ప్రశ్నించారు. తాము అలా జరగనివ్వబోమని తెలిపారు. యువతను ఉద్దేశించి ఆయన శనివారం విడుదల చేసిన వీడియోలో ఈ వాగ్దానం చేశారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, పరిశ్రమలు తిరిగి వస్తాయని, కొత్త పరిశ్రమలు వస్తాయని, నూతన పాఠశాలలు, కొత్త ఆసుపత్రులను నిర్మిస్తామని చెప్పారు. ఇవన్నీ తాము ఢిల్లీలో చేసి, చూపించామన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ 26 ఏళ్ళు, శిరోమణి అకాలీదళ్ 19 ఏళ్లు పరిపాలించి, సర్వనాశనం చేశాయన్నారు. 


తమ ప్రభుత్వం ఏర్పాటైతే కొత్తగా పన్నులను విధించబోమని కేజ్రీవాల్ ఇటీవల జలంధర్‌లో చెప్పారు. వీథి ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. 


పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరుగుతాయి, ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. 


Updated Date - 2022-02-05T20:12:15+05:30 IST