పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి బంధువు షాక్

ABN , First Publish Date - 2022-01-12T14:21:15+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి సమీప బంధువు అయిన జస్వీందర్ సింగ్ ధాలివాఅల్ షాక్ ఇచ్చారు....

పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి బంధువు షాక్

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన వైనం 

చండీఘడ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి సమీప బంధువు అయిన జస్వీందర్ సింగ్ ధాలివాఅల్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన చరణ్‌జిత్ సింగ్ చన్నీకి సోదరుడైన జస్వీందర్ సింగ్ ధాలివాల్ కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో బీజేపీలో చేరారు. పంజాబ్‌లోని మాజీ ఎమ్మెల్యే అరవింద్ ఖన్నా, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) నాయకుడు గురుదీప్ సింగ్ గోషా, అమృత్‌సర్ మాజీ కౌన్సిలర్ ధరమ్‌వీర్ సరిన్‌లతో సహా పలువురు నాయకులు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో పలు విపక్షపార్టీల నేతలు కమలదళంలో చేరారు.


 ఫిబ్రవరి 14వతేదీన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వివిధ పక్షాల్లో నేతల పార్టీ ఫిరాయింపుల పర్వం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు దక్కవనే అనుమానంతో కొందరు పార్టీ మారేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు గెలుచుకొని అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీపార్టీ 20 స్థానాలను గెలుచుకొని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్ 15 సీట్లు, బీజేపీ 3 స్థానాలను సాధించింది.ఈ ఎన్నికల్లో ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల పోరులో నిలవనున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీల వర్గవిభేదాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాల్సిందే. 


Updated Date - 2022-01-12T14:21:15+05:30 IST