అన్ని వృత్తుల ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం..Punjab సీఎం భగవంత్ మాన్ మంత్రివర్గం

ABN , First Publish Date - 2022-03-19T14:16:04+05:30 IST

పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మంత్రివర్గ కూర్పులో అన్ని వృత్తుల శాసనసభ్యులకు అవకాశం కల్పించారు....

అన్ని వృత్తుల ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం..Punjab సీఎం భగవంత్ మాన్ మంత్రివర్గం

చండీఘడ్ : పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన మంత్రివర్గ కూర్పులో అన్ని వృత్తుల శాసనసభ్యులకు అవకాశం కల్పించారు.ఇద్దరు వ్యవసాయదారులు, ముగ్గురు న్యాయవాదులు, ఇద్దరు వైద్యులు, ఒక సామాజిక కార్యకర్త, ఒక ఇంజనీర్, ఒక వ్యాపారవేత్త కొత్త మంత్రివర్గంలో ఉన్నారు.పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేబినెట్‌లో తొలుత పది మంది మంత్రులు ఉంటారు. వీరి పేర్లను సీఎం మాన్ ప్రకటించారు. కేబినెట్ మంత్రులుగా ఎంపికైన ఎమ్మెల్యేలు కూడా పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పది మందిలో ఐదుగురు మాల్వా ప్రాంతానికి చెందినవారు. నలుగురు మజాకు చెందినవారు. ఒకరు దోబా ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే.


ఆనంద్‌పూర్ సాహిబ్ ఎమ్మెల్యే హర్జోత్ సింగ్ బెయిన్స్, దిర్బా ఎమ్మెల్యే హర్పాల్ సింగ్ చీమా, మలౌట్ ఎమ్మెల్యే డాక్టర్ బల్జిత్ కౌర్, మాన్సా ఎమ్మెల్యే డాక్టర్ విజయ్ సింగ్లా, బర్నాలా ఎమ్మెల్యే గుర్మీత్ సింగ్ మీత్ హయర్ లు మాల్వా బెల్ట్‌కు చెందినవారు.మజా బెల్ట్‌కు చెందిన ఎమ్మెల్యేలలో జండియాలా ఎమ్మెల్యే హర్భజన్ సింగ్, పట్టి ఎమ్మెల్యే లల్జిత్ సింగ్ భుల్లార్, అజ్నాలా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ధాలివాల్ లు ఉన్నారు.దోబా ప్రాంతం నుంచి కేబినెట్ బెర్త్ పొందిన ఏకైక ఎమ్మెల్యే హోషియార్‌పూర్ ఎమ్మెల్యే బ్రహ్మ్ శంకర్ జింపా.పది కేబినెట్ బెర్త్‌లను భర్తీ చేసిన తర్వాత మిగిలిన ఏడు ఖాళీలను రెండోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో భర్తీ చేసే అవకాశం ఉంది.


ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను ఎన్నికల్లో ఓడించిన తర్వాత డాక్టర్ విజయ్ సింగ్లాకు కేబినెట్ బెర్త్ లభించింది. పలువురు ఇతర ఎమ్మెల్యేలు కూడా కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రకాష్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ బాదల్, చరణ్ జిత్ సింగ్ చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ వంటి ప్రముఖ రాజకీయ ప్రముఖులను ఓడించారు.తనతో సహా 18 మందికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. మిగిలిన వారిని వివిధ వివిధ బోర్డులు, కార్పొరేషన్లకు అధిపతులుగా చేయవచ్చునని భావిస్తున్నారు.


Updated Date - 2022-03-19T14:16:04+05:30 IST