Punjab: విశ్వాస పరీక్షలో గెలిచిన సీఎం

ABN , First Publish Date - 2022-10-04T00:59:37+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ...

Punjab: విశ్వాస పరీక్షలో గెలిచిన సీఎం

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్  సింగ్ మాన్ (Bhagwant singh Mann) సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాసపరీక్షలో (confidence vote) గెలిచింది. కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా, విశ్వాస తీర్మానానికి మద్దతుగా చేతులు పైకి ఎత్తిన వారిని లెక్కించి ఫలితాన్ని ప్రకటించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 93 మంది చేతులు ఎత్తగా, ఒక్కరు కూడా వ్యతిరేకించకపోవడంతో తీర్మానానికి ఏకగ్రీవంగా సభ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 27వ తేదీన అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని భగవంత్ మాన్ ప్రవేశపెట్టారు.


కాగా, దీనిపై సోమవారం జరిగిన చర్చను ఆప్ ఎమ్మెల్యే శీతల్ అంగ్రూల్ తొలుత ప్రారంభించారు. చర్చ ప్రారంభం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు జీరో అవర్‌లో ప్రశ్నలు లేవనెత్తేందుకు స్పీకర్ అనుమంతించడం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాగా, ఆప్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని  రాజ్యాంగ ఉల్లంఘనగా పేర్కొంటూ బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అశ్విని శర్మ, జంగి లాల్ మహాజన్ ఈ సమావేశాలను బహిష్కరించారు. కాగా, ఆప్ ఎమ్మెల్యేలను ధనబలంతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని మొదట్నించీ ఆరోపిస్తున్న మాన్ ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మొగ్గుచూపింది. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరింది. అయితే, విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనే సింగిల్ ఎజెండాపై అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ తొలుత నిరాకరించారు. అయితే మరికొన్ని ప్రజా సమస్యలను కూడా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని మాన్ సర్కార్‌ ఆయనకు చెప్పడంతో అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ క్లియరెన్స్ ఇచ్చారు.

Updated Date - 2022-10-04T00:59:37+05:30 IST