Punjab : అమిత్ షాతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ

ABN , First Publish Date - 2022-05-20T01:41:12+05:30 IST

పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్

Punjab : అమిత్ షాతో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ

న్యూఢిల్లీ : పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) గురువారం దేశ రాజధాని నగరంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)తో సమావేశమయ్యారు. సరిహద్దుల భద్రత, దేశ భద్రత, రైతు సమస్యలు, బాస్మతి బియ్యానికి కనీస మద్దతు ధర తదితర అంశాలపై చర్చించారు. 


భగవంత్ మాన్ ఇచ్చిన ఓ ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, అమిత్ షాతో సమావేశంలో రైతుల డిమాండ్లు, భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు (బీబీఎంబీ)లో పంజాబ్‌కు ప్రాతినిధ్యంపై  చర్చించారు. బాస్మతి బియ్యానికి కనీస మద్దతు ధర (MSP), పంజాబ్ సరిహద్దు ప్రాంతాలు, భద్రతపై చర్చించారు. ఈ డిమాండ్లన్నిటినీ పరిశీలిస్తామని అమిత్ షా చెప్పారు. 


అమిత్ షాతో సమావేశం అనంతరం మాన్ విలేకర్లతో మాట్లాడుతూ, పంజాబ్‌లో అశాంతిని సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోందని, అందువల్ల అదనంగా దాదాపు 2,000 మంది పారామిలిటరీ సిబ్బందిని మోహరిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయం అందజేస్తామని అమిత్ షా చెప్పారన్నారు. ఇప్పటికే 10 కంపెనీల పారామిలిటరీ సిబ్బంది పంజాబ్ చేరుకున్నారని, మరొక 10 కంపెనీల సిబ్బందిని పంపించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ త్వరలో అనుమతి మంజూరు చేస్తుందని తెలిపారు. 


దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని అమిత్ షా చెప్పారన్నారు. దేశ భద్రత అనేది పార్టీ రాజకీయాలకు అతీతమైనదని, పంజాబ్ ప్రభుత్వానికి అవసరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారని తెలిపారు. సరిహద్దుల ఆవలి నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు సరఫరా అవుతున్నాయని, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరానని చెప్పారు. 


ఒక పారామిలిటరీ కంపెనీలో దాదాపు 100 మంది సిబ్బంది ఉంటారు. 


Updated Date - 2022-05-20T01:41:12+05:30 IST