పంజాజ్ కాంగ్రెస్ సంక్షోభ తరుణంలో కేరళకు రాహుల్

ABN , First Publish Date - 2021-09-29T20:05:14+05:30 IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఉదయం కేరళ బయలుదేరి వెళ్లారు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో తాజా నాయకత్వ..

పంజాజ్ కాంగ్రెస్ సంక్షోభ తరుణంలో కేరళకు రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఉదయం కేరళ బయలుదేరి వెళ్లారు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో తాజా నాయకత్వ సంక్షోభం నెలకొన్నప్పటికీ ముందస్తు షెడ్యూల్ ప్రకారమే రాహుల్ కేరళ వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. కోజికోడ్, మలప్పురంలో ఒకరోజు పర్యటన కోసం వెళ్లిన రాహుల్ అక్కడ పలు ప్రాజెక్టులు ప్రారంభించి, గురువారం ఉదయం ఢిల్లీకి తిరిగి వస్తారని తెలిపారు.


పంజాబ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి నవజ్యోత్ సింగ్ రాజీనామా చేయడంతో తాజాగా ఆక్కడ నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూ మధ్య విభేదాలు సమసిపోలేదనే అభిప్రాయాలకు ఈ పరిణామం తావిచ్చింది. అయితే, కాంగ్రెస్ నాయకత్వం మాత్రం పంజాబ్‌లో అంతా సజావుగానే ఉందని చెబుతోంది. సిద్ధూను శాంతిపజేయాలని పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పర్గత్ సింగ్‌ను పార్టీ అధిష్ఠానం కోరినట్టు తెలుస్తోంది. కాగా, ఆందోళన చెందాల్సిన పనే లేదు, అన్నీ సద్దుకుంటాయని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ పంజాబ్ కాంగ్రెస్ పరిణామాలపై తాజాగా వ్యాఖ్యానించారు.


సిద్ధూ శాంతించకుంటే..

రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధూ నిరాకరిస్తే 'ప్లాన్ బి' కూడా కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలనలో ఉందంటున్నారు. కుల్జిత్ సింగ్ నగ్రా (ఫతేగఢ్ సాహిబ్ ఎమ్మెల్యే) కానీ, రవ్‌నీత్ సింగ్ బిట్టూ (లూథియానా ఎంపీ) కానీ సిద్ధూ స్థానంలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2021-09-29T20:05:14+05:30 IST