Punjab Minister Vs Medical University VC: మురికి మంచం మీద పడుకోమన్న మంత్రి... పదవిని వదులుకున్న వీసీ...

ABN , First Publish Date - 2022-07-30T15:58:57+05:30 IST

పంజాబ్‌‌లోని బాబా ఫరీద్ వైద్య విశ్వవిద్యాలయం (Baba

Punjab Minister Vs Medical University VC: మురికి మంచం మీద పడుకోమన్న మంత్రి... పదవిని వదులుకున్న వీసీ...

చండీగఢ్ : పంజాబ్‌‌లోని బాబా ఫరీద్ వైద్య విశ్వవిద్యాలయం (Baba Farid medical university) ఉప కులపతి (VC) డాక్టర్ రాజ్ బహదూర్‌ (Raj Bahadur)కు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. ఈ విశ్వవిద్యాలయంలోని ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ కోసం వచ్చిన రాష్ట్ర మంత్రి చేతన్ సింగ్ జౌరామజ్రా ఆయనను రోగుల కోసం ఉపయోగించే మంచం మీద పడుకోమని చెప్పడంతో కంగుతిన్నారు. ఆ సమయానికి ఆ మంచం మీద ఉన్న పరుపు చాలా మురికిగా ఉంది. రాజ్ బహదూర్ మంచి పేరున్న వైద్య, ఆరోగ్య రంగ నిపుణుడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలను ప్రతిపక్ష నేతలు కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ, ఆరోగ్య శాఖ మంత్రి చేతన్ సింగ్‌ను ఘాటుగా విమర్శించారు. 


ఇదిలావుండగా, వీసీ రాజ్ బహదూర్ తన పదవి నుంచి వైదొలగినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ సంఘటన వైద్య రంగంలో పని చేస్తున్నవారికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పంజాబ్ సివిల్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ (PCMSA) ప్రతినిధి డాక్టర్ అఖిల్ సరీన్ విడుదల చేసిన ప్రకటనలో, వీసీ పట్ల ఆరోగ్య శాఖ మంత్రి ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఉన్నత స్థాయి ఆరోగ్య అధికారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడం దిగ్భ్రాంతికరమని చెప్పారు. ఈ జగడం వల్ల రాష్ట్రం తనకుగల ఏకైక స్పైన్ సర్జన్‌ను పోగొట్టుకుందన్నారు. 


కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రముఖ స్పైనల్ సర్జన్, బాబా ఫరీద్ వైద్య శాస్త్రాల విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ రాజ్ బహదూర్ పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి చేతన్ సింగ్ జౌరామజ్రా (Chetan Singh Jouramajra) దురుసుగా ప్రవర్తించడం, అవమానించడం తీవ్రంగా ఖండించదగినవి, అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని పేర్కొన్నారు. వీసీ గవర్నర్‌కు జవాబుదారీ అని, గ్రీన్‌హార్న్ మినిస్టర్‌కు కాదని మండిప్డారు. 


బీజేపీ నేత మంజిందర్ సింగ్ సిర్సా (BJP Leader Manjinder Singh Sirsa ఇచ్చిన ట్వీట్‌లో, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంజాబ్ మంత్రి చేతన్ సింగ్ జౌరామజ్రా ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. డాక్టర్ రాజ్ బహదూర్‌ (Raj Bahadur)ను అవమానించారని ఆరోపించారు. చౌకబారుతనంతో, అవిద్యతో, దురహంకారంతో ప్రవర్తించినందుకు ఆయనను జవాబుదారీ చేయాలన్నారు. అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) తేవాలనుకుంటున్న విప్లవం ఇదేనా? అని ప్రశ్నించారు.


ఈ విశ్వవిద్యాలయంలోని ఆసుపత్రిలో నిర్వహించిన తనిఖీల అనంతరం మంత్రి చేతన్ శుక్రవారం మాట్లాడుతూ, సదుపాయాలను తక్షణమే మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల ఆరోగ్య సేవలను అందజేస్తామని చెప్పారు. 15 రోజుల తర్వాత మళ్లీ ఈ ఆసుపత్రిలో తాను తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు. ఆసుపత్రుల్లో మందులు, సిబ్బంది కొరత సమస్యను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. 


ఆమ్ ఆద్మీ పార్టీ  (Aam Admi Party) ప్రభుత్వం పంజాబ్‌లో భారీ ఆధిక్యంతో మార్చిలో ఏర్పడిన సంగతి తెలిసిందే.


Updated Date - 2022-07-30T15:58:57+05:30 IST