మాజీ ఆప్ నేత కుమార్ విశ్వాస్‌పై కేసు నమోదు చేసిన పంజాబ్ పోలీసులు

ABN , First Publish Date - 2022-04-20T19:37:05+05:30 IST

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్‌పై పంజాబ్ పోలీసులు

మాజీ ఆప్ నేత కుమార్ విశ్వాస్‌పై కేసు నమోదు చేసిన పంజాబ్ పోలీసులు

చండీగఢ్ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నేత కుమార్ విశ్వాస్‌పై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌పై తప్పుడు వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ రూప్ నగర్ పట్టణంలో ఈ కేసు నమోదైంది. కుమార్ విశ్వాస్ ఇటీవలి శాసన సభ ఎన్నికల నేపథ్యంలో మాట్లాడుతూ, కేజ్రీవాల్‌కు ఖలిస్థాన్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నట్లు ఆరోపించారు.


ఓ ఆప్ కార్యకర్త సదర్ పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్ 12న కుమార్ విశ్వాస్‌పై ఫిర్యాదు చేశారు. శాసన సభ ఎన్నికల్లో తాము ప్రచారం చేస్తుండగా, మాస్క్ ధరించిన కొందరు వ్యక్తులు తమను ఆపి, తమను ఖలిస్థానీలని ఆరోపించారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 153, 153-ఏ, 505, 502, 116, 143, 147, 323, 341, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ల ప్రకారం ఆరోపణలను నమోదు చేశారు.  బుధవారం ఘజియాబాద్‌లోని కుమార్ విశ్వాస్ ఇంటికి వెళ్లి, 48 గంటల్లోగా దర్యాప్తునకు హాజరుకావాలని సమన్లను అందజేశారు. 


పంజాబ్ సీఎంకు విశ్వాస్ హెచ్చరిక

కుమార్ విశ్వాస్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను హెచ్చరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌‌తో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఢిల్లీలో కూర్చున్న వ్యక్తి మీకు (మాన్‌కు), పంజాబ్‌కు ద్రోహం చేస్తారని హెచ్చరించారు. దేశం తన హెచ్చరికను గుర్తుంచుకోవాలన్నారు. తన ఇంటికి వచ్చిన పంజాబ్ పోలీసుల ఫొటోను జత చేశారు. 


శాసన సభ ఎన్నికల సమయంలో కుమార్ విశ్వాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కేజ్రీవాల్ స్వతంత్ర ఖలిస్థాన్ ప్రధాన మంత్రి కావాలనుకుంటున్నారని చెప్పినట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు. కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ స్పందిస్తూ కేజ్రీవాల్, ఆప్‌లపై విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో కుమార్ విశ్వాస్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించి, పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-04-20T19:37:05+05:30 IST