పంజాబ్‌.. బల్లే బల్లే

ABN , First Publish Date - 2020-10-27T09:28:41+05:30 IST

ప్లేఆఫ్స్‌ కోసం పోటీపడుతున్న కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మన్‌దీ్‌ప సింగ్‌ (56 బంతుల్లో 8 ఫోర్లు

పంజాబ్‌.. బల్లే బల్లే

8 వికెట్లతో కోల్‌కతా చిత్తు 

గేల్‌, మన్‌దీ్‌ప అర్ధ శతకాలు 

రాణించిన షమి, బిష్ణోయ్‌


ప్లేఆఫ్స్‌ చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకంగా మారిన తరుణంలో.. పంజాబ్‌ అంచనాలకు మించి రాణిస్తోంది. సమష్టి కృషితో వరుసగా ఐదో విజయం సాధించిన పంజాబ్‌.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. బంతిలో బౌలర్లు మెరవగా.. మన్‌దీ్‌ప, గేల్‌ హాఫ్‌ సెంచరీలతో.. కోల్‌కతా మట్టికరిచింది. మరోసారి బ్యాటింగ్‌లో తడబడి మూల్యం చెల్లించుకుంది. 


షార్జా: ప్లేఆఫ్స్‌ కోసం పోటీపడుతున్న కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మన్‌దీ్‌ప సింగ్‌ (56 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్‌), గేల్‌ (29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) అర్ధ శతకాలతో.. ఐపీఎల్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను 8 వికెట్లతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా.. షమి (3/35), బిష్ణోయ్‌ (2/20), జోర్డాన్‌ (2/25) బౌలింగ్‌ ధాటికి  నిర్ణీత 20 ఓవర్లలో 149/9 పరుగులకే పరిమితమైంది. శుభమన్‌ గిల్‌ (57) అర్ధ శతకం చేశాడు. ఛేదనలో పంజాబ్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 150 పరుగులు చేసి గెలిచింది. గేల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

హడావిడి పడకుండా: లక్ష్యం పెద్దది కాకపోవడంతో పంజాబ్‌ కూల్‌గా విజయాన్ని అందుకొంది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (28), మన్‌దీ్‌ప మంచి ఆరంభాన్ని అందించారు. ఎదుర్కొన్న తొలి బంతినే రాహుల్‌ ఫోర్‌కు తరలించాడు. కమిన్స్‌ వేసిన 5వ ఓవర్‌లో మన్‌దీ్‌ప 6,4తో బ్యాట్‌ ఝళిపించాడు. అయితే, రాహుల్‌ను లెగ్‌ స్పిన్నర్‌ వరుణ్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో.. తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం వచ్చిన గేల్‌.. మరో ఓపెనర్‌ మన్‌దీ్‌పతో కలసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వరుణ్‌ వేసిన 10వ ఓవర్‌లో మన్‌దీ్‌ప ఫోర్‌ కొట్టగా.. గేల్‌ రెండు సిక్స్‌లు బాదాడు. దీంతో 14వ ఓవర్‌లో పంజాబ్‌ స్కోరు సెంచరీ మార్క్‌ దాటింది. ఈ క్రమంలో అర్ధ శతకం పూర్తి చేసుకున్న మన్‌దీ్‌ప.. ఇటీవల మరణించిన తన తండ్రికి నివాళిగా ఆకాశానికేసి చూశాడు. చివరి నాలుగు ఓవర్లలో 27 రన్స్‌ అవసరమవగా ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో 4,6తో గేల్‌ కూడా హాఫ్‌ సెంచరీ చేశాడు. 18వ ఓవర్‌ తొలి బంతికి గేల్‌ను అవుట్‌ చేసిన ఫెర్గూసన్‌.. రెండో వికెట్‌కు 100 రన్స్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. పూరన్‌ (2 నాటౌట్‌) 7 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించాడు. 

మ్యాక్సీ తొలి దెబ్బ:  టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. పంజాబ్‌ బౌలర్ల దెబ్బకు తడబడినా ఓపెనర్‌ గిల్‌, కెప్టెన్‌ మోర్గాన్‌ (40) ఆదుకోవడంతో ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ నితీష్‌ రాణాను డకౌట్‌ చేసిన మ్యాక్స్‌వెల్‌.. కోల్‌కతాకు షాకిచ్చాడు. రెండో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన షమి.. రాహుల్‌ త్రిపాఠి (7), దినేష్‌ కార్తీక్‌ (0)ను కీపర్‌ క్యాచ్‌తో దెబ్బకొట్టాడు. దీంతో 10/3తో కోల్‌కతా ఇబ్బందుల్లో పడింది. అయితే, గిల్‌, మోర్గాన్‌ జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డును నడిపించారు. షమి వేసిన 6వ ఓవర్‌లో ఏకంగా 21 రన్స్‌ రావడంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఊపొచ్చింది. ఆ ఓవర్‌లో మోర్గాన్‌ 2 ఫోర్లు, గిల్‌ 2 సిక్స్‌లు కొట్టారు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి నైట్‌రైడర్స్‌ 54/3తో నిలిచింది. 

బిష్ణోయ్‌ బ్రేక్‌: టచ్‌లో ఉన్న మోర్గాన్‌ను అవుట్‌ చేసిన బిష్ణోయ్‌.. నాలుగో వికెట్‌కు 81 రన్స్‌తో జోరుగా సాగుతున్న వీరి భాగస్వామ్యానికి బ్రేకులు వేశాడు. నరైన్‌ (6)ను జోర్డాన్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ దశలో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల రాక కష్టమైంది. 11-15 ఓవర్ల మధ్య 22 రన్స్‌ చేసిన కోల్‌కతా 2 వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్‌లో బిష్ణోయ్‌ బౌలింగ్‌లో డబుల్‌తో గిల్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. తర్వాతి ఓవర్‌లో నాగర్‌కోటి (6)ని మురుగన్‌ బౌల్డ్‌ చేశాడు. కమిన్స్‌(1)ను బిష్ణోయ్‌, గిల్‌ను షమి అవుట్‌ చేశారు. వరుణ్‌ చక్రవర్తి (2)ని జోర్డాన్‌ వెనక్కిపంపగా.. ఆఖర్లో ఫెర్గూసన్‌ (24 నాటౌట్‌) ధాటిగా ఆడాడు. 


స్కోరు బోర్డు

కోల్‌కతా: గిల్‌ (సి) పూరన్‌ (బి) షమి 57, నితీష్‌ రాణా (సి) గేల్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 0, త్రిపాఠి (సి) రాహుల్‌ (బి) షమి 7, దినేష్‌ కార్తీక్‌ (సి) రాహుల్‌ (బి) షమి 0, మోర్గాన్‌ (సి) మురుగన్‌ (బి) బిష్ణోయ్‌ 40, నరైన్‌ (బి) జోర్డాన్‌ 6, నాగర్‌కోటి (బి) మురుగన్‌ 6, కమిన్స్‌ (ఎల్బీ) బిష్ణోయ్‌ 1, ఫెర్గూసన్‌ (నాటౌట్‌) 24, వరుణ్‌ చక్రవర్తి (బి) జోర్డాన్‌ 2, ప్రసిద్ధ్‌ కృష్ణ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 149/9; వికెట్ల పతనం: 1-1, 2-10, 3-10, 4-91, 5-101, 6-113, 7-114, 8-136, 9-149; బౌలింగ్‌: మ్యాక్స్‌వెల్‌ 2-0-21-1, షమి 4-0-35-3, అర్ష్‌దీప్‌ సింగ్‌ 2-0-18-0, మురుగన్‌ అశ్విన్‌ 4-0-27-1, జోర్డాన్‌ 4-0-25-2, రవి బిష్ణోయ్‌ 4-1-20-2.

పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (ఎల్బీ) వరుణ్‌ చక్రవర్తి 28, మన్‌దీ్‌ప సింగ్‌ (నాటౌట్‌) 66, క్రిస్‌ గేల్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) ఫెర్గూసన్‌ 51, పూరన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 18.5 ఓవర్లలో 150/2, వికెట్ల పతనం: 1-47, 2-147. బౌలింగ్‌: ప్యాట్‌ కమిన్స్‌ 4-0-31-0, ప్రసిద్ధ్‌ కృష్ణ 3-0-24-0, వరుణ్‌ చక్రవర్తి 4-0-34-1, సునీల్‌ నరైన్‌ 4-0-27-0, ఫెర్గూసన్‌ 3.5-0-32-1.

Updated Date - 2020-10-27T09:28:41+05:30 IST