పుర సమరంలో సై ఆట

ABN , First Publish Date - 2021-03-01T05:22:09+05:30 IST

పుర సమరం పదునెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గర పడడంతో మరింత రంజుగా మారింది.

పుర సమరంలో సై ఆట

పుర సమరం పదునెక్కింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు దగ్గర పడడంతో మరింత రంజుగా మారింది. పార్టీల మధ్య రసరవత్తర పోరు సాగుతోంది. బేరసారాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. దాదాపు అన్ని చోట్ల కుదుటపడేందుకు అన్ని పార్టీలు వ్యూహాన్ని ఏరోజుకారోజు మళ్లిస్తున్నాయి. నగదు వెదజల్లి తద్వారా ఓటు బ్యాంక్‌ కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇక ప్రచారంలో విందు,  మందుకు కొదువ లేకుండా ఉన్నది.

జంగారెడ్డిగూడెంలో రమాదేవి రాకతో ఊపు

కొవ్వూరులో ఎడతెగని సస్పెన్స్‌

నిలదీస్తున్న పార్టీల కార్యకర్తలు

సర్దుబాటుకు నానా తిప్పలు 

వైసీపీ ఆశలు ఆవిరేనా..బీజేపీది ఇంకా బెరుకే 

ప్రచారంలో విందు, మందు

(ఏలూరు– ఆంధ్రజ్యోతి) 

పురపోరులో ఇప్పుడు కొన్ని చోట్ల తీవ్ర సస్పెన్స్‌, ఉత్కంఠ నెలకొంది. కొవ్వూరు మునిసిపాలిటీలో మూడు రోజులుగా సాగుతున్న ప్రచారం ఆ పట్టణంలో అన్ని పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అన్ని పార్టీల్లో పెద్దతలకాయలు కూడబలుక్కుని ఈ మునిసిపాలిటీలో వార్డులను పంచుకుని గెలిచేందుకు  రంగం సిద్ధమైందని ఒక్కసారిగా గుప్పుమంది. దీనికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ అన్ని పార్టీల్లోనూ లోతట్టు సమావేశాలు జరిగాయి. దీనికంటే ముందుగా ఎవరెవరు ఎక్కడ నిలబడతారో ఇంకెవరు రంగంలోంచి తప్పుకుంటారనే దానిపై సస్పెన్స్‌ తట్టుకోలేకపోతున్నారు. పార్టీల ముఖ్యులు కొందరు ఒక్కసారిగా సైలెంటు అయిపోవడంతో అటు అధికార వైసీపీలోనూ, ఇటు టీడీపీలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిని నిగ్గదీసేందుకు కార్యకర్తలు సమాయత్తం కావడంతో ఆదివారం పరిస్థితి వేడెక్కింది. కేవలం కొందరు నాటకీయంగా వ్యవహరించడం కార్యకర్తలకు రుచించడం లేదు. ఆదివారంతో ఈ హైడ్రామాకు తెరపడుతుందనుకున్నా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. వదం తులు షికార్లు చేస్తున్నాయి. వీటిపై వివరణ ఇచ్చేందుకు నేతలు ఎవరు సిద్ధంగా లేరు. అంతకంటే మించి రాజకీయ సర్దుబాటు నిజమేనన్న వాదనలకు బలం చేకూర్చేలా పరిస్థితులు ఉన్నాయి. 

జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో తెలుగుదేశానికి ఊపు వచ్చింది. ఒకరు చనిపోవడంతో 5వ వార్డు ఖాళీ అవ్వగా ఆ స్థానం నుంచి రమాదేవి ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటిదాకా పార్టీమిగతా అభ్యర్థులకు ఎన్నికల వ్యవహారం అంతా చుక్కాని లేని నావలాగ ఉండగా రమాదేవి రాకతో ఉత్సాహం రెండింతలైంది. ఆర్థికంగా అన్ని హంగులు కలిగిన రమాదేవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా మారారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రెండో దశలో రెండు వారాలుగా తెలుగుదేశం ఎలా ఒడ్డెక్కాలో అనే సందేహంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రమాదేవి రాకతో వైసీపీలోనూ ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఢీ కొంటామని ఇప్పుడు తెలుగుదేశం కొంత గళం పెంచింది. వైసీపీలోని వర్గపోరు తమకు కలిసి వస్తుందని కొందరు లోపాయికారిగా తమకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే టీడీపీ విశ్వసిస్తోంది. ఇక నిడదవోలులో వైసీపీ ఎత్తుగడలకు  ధీటుగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు టీడీపీ తరపున రంగ ప్రవేశం చేశారు. ప్రచారానికి దిగారు. దీంతో నిడదవోలులోను ఉత్సాహం కాస్తంత ఇనుమడించింది. నర్సాపురంలోనూ జనసేనతో చెలిమి ద్వారా లబ్ధి పొందేందుకు టీడీపీ ఎత్తుగడలకు పదును పెట్టింది. 

వైసీపీ ఆరాటం 

ఎట్టి పరిస్థితుల్లోనూ పుర పోరు ఏకపక్షం చేసుకోవాని వైసీపీ తొలుత ఆశలు పెట్టుకుంది. ఉపసంహరణల గడువు దగ్గర పడినప్పటికీ చాలాచోట్ల ఆ పార్టీ ఎత్తుగడలు పారలేదు. అన్నింటికంటే మించి నగదు, ఇతరత్రా డిమాండ్లకు అనుకూ లంగా ప్రత్యర్థి పార్టీవైపు ఎర వేసేందుకు సర్వ ప్రయత్నాలు చేసినా అనుకున్నట్లుగా వర్క్‌ అవుట్‌ కాలేదు. ఏలూరు  కార్పొరేషన్‌తో సహా మిగతా చోట్ల సరికొత్త సీన్‌ సృష్టించేలా ఆ పార్టీ నానా హడావుడి చేసింది. కానీ నామినేషన్ల గడువు దాదాపు దగ్గరకు వచ్చినా టీడీపీ నుంచి ఆశించినట్లుగా అభ్యర్థుల వలస జరగలేదు. దీంతో ఇక బిగ్‌ఫైట్‌ తప్పదని ఒక నిర్ణయానికి వచ్చింది. 


రోజుకు తిన్నంత ఫుడ్‌... చేతినిండా డబ్బు 

పురపోరు జనరల్‌ ఎన్నికలను తలపించే రీతిలో మరింత పదును తేలింది. ప్రచారంలో తమ వెంట నడిచే కార్యకర్తలకు లేక అద్దెకు తెచ్చుకున్న వారికి కడుపు నిండా ఫుడ్‌, చేతి నిండా డబ్బు ఇచ్చే పనిలో పడ్డారు. ఏలూరు నగరంలో ఈ హడావుడి అత్యధికంగా ఉంది. ప్రతి వార్డుల్లోనూ అభ్యర్థుల వెంట దాదాపు వంద మందికి పైగానే  జై కొడుతు, కే రింతలు కొడుతూ ప్రచారానికి ఊపు తెస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే మేయర్‌ పక్షాన ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, ఆ మేరకు రోజు వారి కష్టం నగదు రూపంలో ఇచ్చేందుకు వైసీపీ ఇప్పటికే ఆ మేరకు ఖర్చు భరిస్తోంది. ఒక్కో డివిజన్‌లో ఒక్కో రీతిలో ఒక్కో కార్యకర్తకు మూడు వందల రూపా యలతో పాటు అందరికీ కాస్తంత ఎండలు పెరిగాయి కదా కూలింగ్‌ వాటర్‌ ఫ్రీగా అందిస్తుంది. తెలుగుదేశం కూడా తమ సొంత పార్టీ కార్యకర్తలదైతే ఫర్వాలేదు కానీ డివిజన్‌ నుంచి అభ్యర్థి కోసం తరలి వచ్చే వారి కోసం  ఒకింత సొమ్ము చెల్లిస్తుంది. ఇక అధికారం ఉంది కదా అని వైసీపీ దాదాపు అన్ని డివిజన్లలోనూ కార్యాలయాలు తెరచింది. ఇక్కడ వీలైతే బిర్యానీ లేదంటే పెరుగన్నం, సాంబార్‌ రైస్‌ అందిస్తున్నారు. మరి ప్రచారంలో రోజంతా జై కొడుతూ తిరిగే కుర్రకారు ఒప్పుకుంటారా అంటే వారిని ప్రసన్నం చేసుకోవడానికి రాత్రిళ్ళు మందు, విందు సమకూరుస్తున్నారు. దీనికి మాత్రం కొదువలేదు. 


బీజేపీ మాట ఏమిటి..?

ఏలూరు కార్పొరేషన్‌తో సహా మిగతా నాలుగు మునిసిపాలిటీల్లో భారతీయ జనతాపార్టీ అక్కడక్కడ పోటీ చేస్తున్నా ఈ మేరకు పెద్దగా ప్రభావితం చేయలేకపోతు న్నారు. అసలే అంతంత మాత్రంగా దిగిన అభ్యర్థులు కేవలం కొన్ని చోట్ల మాత్రమే కాస్తంత అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తుండగా ఇంకొందరు అదీ లేదు. అప్పట్లో ఏకపక్షంగా దిగిన  బీజేపీ ఇప్పుడు జనసేన అండా దండా ఉంటుందనుకున్నా అదీ పెద్దగా కన్పించడం లేదు. జనసేన అభ్యర్థులు బరిలో ఉన్న మునిసిపాలిటీ ఏలూరు కార్పొరేషన్‌లో చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు. వందలాది మంది జనసైనికులు వెంట రాగా అభ్యర్థులు ధూమ్‌ ధామ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-03-01T05:22:09+05:30 IST