కొనుగోల్‌మాల్‌

ABN , First Publish Date - 2021-05-07T06:51:54+05:30 IST

ళారుల చేతిలో నష్టపోకుండా ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దళారులు, మిల్లర్లు, కేంద్రం నిర్వాహకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు.

కొనుగోల్‌మాల్‌

 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాయాజాలం

  దళారులు, మిల్లర్లు, అధికారులు కుమ్మక్కు

 తేమ, తాలు, మట్టిపెళ్ల సాకుతో మోసాలు

  రైతుకు ప్రయోజనం కల్పించని ప్రభుత్వ రంగ సంస్ధలు

  అధిక తూకాలతో ఇష్టానుసారంగా కొనుగోలు

నల్లగొండ, మే 6 (ఆంఽధ్రజ్యోతి ప్రతినిధి): దళారుల చేతిలో నష్టపోకుండా ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దళారులు, మిల్లర్లు, కేంద్రం నిర్వాహకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారు. తాలు, తేమ, మట్టిపెళ్లల సాకుతో ధాన్యం తూకాల్లో మోసాలు, కాంటా వేసిన బస్తాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ మార్కెటింగ్‌ శాఖ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో నష్టం వాటిల్లుతోంది. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావటం లేదు. కొనుగోలు కేంద్రాలకు వెళితే రైతులకు లాభం చేసేవారే కరువయ్యారు. వాస్తవానికైతే ప్రభుత్వ రంగసంస్థలకు వెళ్తే రైతులకు భరోసా ఉండాల్సింది పోయి నిలువునా టోకరా పెట్టడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు యాదాద్రిభువనగిరి జిల్లాలో 25.134మెట్రిక్‌ టన్నులు, సూర్యాపేట జిల్లాలో 1.25 లక్షల మెట్రిక్‌ టన్నులు, నల్లగొండ జిల్లాలో 2.20లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 

తాలు, తేమ, పెళ్లల పేరిట మోసాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిల్లర్లు, ఐకేపీ, పీఏసీఎ్‌సలు, మార్కెట్‌ కమిటీ కేంద్రాల్లో న్యాయం జరగడం లేదని రైతులు రోజూ ఏదో ఒకమూల నిరసనలకు దిగుతూనే ఉన్నారు. ఎంటీయూ-1156 రకం గ్రేడ్‌-1గా ఉంది. వీటిని పండించిన రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే తాలు ఉందని అధిక తూకం వేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1010 రకం ధాన్యం విషయంలో సైతం తాలు, పెళ్లలు, తేమ పేరిట తూకం అ ధికం వేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌, మార్కెట్లలో 40కేజీల బస్తా తూకం వేయాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో 43కిలోలు తూకం వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు సరిగా లేవంటూ మిల్లుల వద్ద కిరికిరీ పెడుతూ ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకుని మిల్లుల వద్దకు తేగానే తాలు, తేమ పేరిట తూకంలో కోత వేస్తున్నారు. వరిసాగు, దిగుబడి పెరగడంతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తూకం, ధరల్లో భారీగా మిగుల్చుకోవాలనేది మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల ముందస్తు ప్రణాళిక అని పోలీస్‌ విభాగంలోని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఒక్కో లారీ నుంచి ధాన్యం దిగుమతి చేయాలంటే రెండు నుంచి మూడు క్వింటాళ్ల వరకు కోత పెడుతున్నారు. మిల్లుల వద్ద, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ధాన్యం కేంద్రం అద్దె పేరిట రైతుల నుంచి అధికంగా కాంటా వేస్తూ నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు.

పలుచోట్ల కేసులు నమోదు

జిల్లాలోని పలుచోట్ల దళారులు, ఉద్యోగులపై కేసులు నమోదయ్యాయి. తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోళ్ల విషయంలో ఓ మహిళా రైతును మోసం చేసిన విషయంలో 17మంది హమాలీలపై పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. తూకంలో మోసం చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ తూకం మోసంలో మరికొందరి పాత్ర ఉన్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా ఏప్రిల్‌ 26వ తేదీన నల్లగొండ మండలం అన్నెపర్తి ఐకేపీ సెంటర్‌లో మోసాలకు పాల్పడుతున్నారని చర్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు ఫిర్యాదుతో పీఏసీఎస్‌ అధికారితో పాటు వ్యవసాయాధికారిపై కేసు నమోదైంది. తమపై ఉన్న కేసులను విత్‌డ్రా చేసుకోవాలంటూ రైతుపై ఒత్తిడి తెస్తున్నట్లు చర్చ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలను విస్మరించి తాలు ఉన్నాయన్న సాకుతో ధాన్యంలో తూకం కోత పెట్టడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విధంగా మూడు జిల్లాల్లోనూ పెద్దఎత్తున మోసాలు జరుగుతున్నా చాలామంది కేసులు నమోదుకాకుండా పైరవీలు సాగిస్తూ తప్పించుకుంటున్నారు.

మిల్లర్లదేపై చేయి

ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో మోసాలు జరుగుతున్నా పర్యవేక్షణ కానరావడం లేదు. ఈ విషయం పౌర సరఫరాల సంస్థ దృష్టికి వెళ్లినా పటించుకోడం లేదు. తరచూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న మిల్లులను గుర్తించి సీజ్‌ చేస్తే వారు యూనియన్‌ పేరిట అన్ని మిల్లుల్లో కొనుగోళ్ల బంద్‌కు పిలుపునిస్తూ జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీ పెద్దల వద్ద మిల్లర్లు బైఠాయించి జిల్లా అధికారులపై ఒత్తిడి చేసి సీజ్‌ చేసిన మిల్లులను తిరిగి తెరిపిస్తున్నారు. దీంతో తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమా మిల్లర్లలో పెరిగిపోతోంది. తాము సైతం పూర్తిగా బిగించి కూర్చుంటే రైతులు ఇబ్బంది పడతారు, అందుకే మేం సీజ్‌ చేస్తాం ఆ తర్వాత చూసీచూడనట్టు ఆంక్షలు ఎత్తివేస్తాం, వ్యవస్థను ఏదోలా ముందుకు నడపాలి కదా అని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.

వేబ్రిడ్జి కాంటాల్లోనూ మోసం

వేబ్రిడ్జి కాంటాల్లో మిషన్‌ మరమ్మతులకు వచ్చిన క్రమంలో అవి సరిచేసేందుకు వెళ్లినప్పుడు మిషన్‌ బార్‌ కోడ్‌ను నిర్వాహకులు తెలుసుకుంటున్నారు. దీంతో అసలు తూకానికి తక్కువగా మిషన్‌ను సెట్‌ చేసుకుంటున్నారు. కొన్ని వేబ్రిడ్జిలు స్వతంత్రంగా ఉండగా, కొన్ని మిల్లర్ల ఆధీనంలో ఉన్నాయి. తిప్పర్తి మండల కేంద్రానికి సమీపంలో రైతులు ధాన్యాన్ని స్థానికంగా కాంటా వేసుకొని 20కిలోలు అదనంగా వేసుకొని మిర్యాలగూడలోని సాగర్‌ రోడ్డులో గల వే బ్రిడ్జి దగ్గర కాంటా వేయించారు. కాగా రెండు క్వింటాళ్లు తూకం తక్కువగా వచ్చింది. అర్ధగంట వ్యవధిలో తక్కువ రావడం ఏమిటని ఆందోళనతో రైతులు మరో వేబ్రిడ్జి దగ్గర కాంటా వేయించగా మోసం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన రైతులు మిర్యాలగూడలోని యాద్గార్‌పల్లి రోడ్డులోని వేబ్రిడ్జి వద్ద కాంటా వేయించగా నాలుగు క్వింటాళ్లు తరుగు వచ్చింది. అనుమానంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తూనికలు కొలతల అధికారులు రంగంలోకి దిగడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో అన్ని మిల్లుల్లోని వేబ్రిడ్జిలు, స్వతంత్రగా కొనసాగుతున్న వేబ్రిడ్జిలను తనిఖీ చేసి రెండు కేసులు నమోదు చేశారు.

Updated Date - 2021-05-07T06:51:54+05:30 IST