
అంతర్జాతీయ రూట్లపై ఎయిరిండియా దృష్టి
హైదరాబాద్ : ఇటీవల టాటా గ్రూప్ గూటికి చేరిన ఎయిరిండియా విస్తరణకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ రూట్లలో మరింత పెద్ద విమానాలు నడపాలని భావిస్తోంది. ఇందుకోసం ఎయిర్‌బస్ కంపెనీ కొత్తగా మార్కెట్ చేస్తున్న ఎ-350 విమానాలపై ఆసక్తి చూపిస్తోంది. దాదాపు 1,000 కోట్ల డాలర్లతో (సుమారు రూ.76,500 కోట్లు) 30 ఎ-350 విమానాలు కొనేందుకు టాటా గ్రూప్-ఎయిర్‌బస్ మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న ‘వింగ్స్ ఇండియా’ సదస్సుకు హాజరైన రోల్స్ రాయిస్ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు. దాదాపు 410 మంది ప్రయాణికులతో ఏకధాటిగా 14,000 కిలోమీటర్లకుపైగా ప్రయాణించడం ఈ విమానాల ప్రత్యేకత. ఇదే తరగతికి చెందిన బోయింగ్, ఇతర కంపెనీల విమానాలతో పోలిస్తే వీటి ఇంధన వినియోగం 25 శాతం తక్కువ.
పన్ను పోటు తగ్గించాల్సిందే:
విమానయాన సంస్థలపై ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై విమానయాన సంస్థల సీఈఓలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భారం తగ్గిస్తే తప్ప విమాన ఇంధన భారం తగ్గదని స్పష్టం చేశారు. వింగ్స్ ఇండియా-2022 సందర్భంగా జరిగిన చర్చాగోష్టిలో సీఈఓలు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విమానయాన సంస్థల ఆదాయంలో 21 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వ ఖాతాకు పోతున్న విషయాన్ని ఇండిగో సీఈఓ రొనోజాయ్ దత్తా గుర్తుచేశారు. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల్నీ మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. అప్పుడే భారత్ విమా న ప్రయాణికులు, సరుకుల రవాణాకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఫ్రెంచి కంపెనీలతో జీఎంఆర్ జట్టు:
జీఎంఆర్ గ్రూప్.. సాఫ్రాన్, ఎక్సెన్స్, ఎయిర్బ్సలతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ప్రత్యామ్నాయ విమాన ఇంధన అభివృద్ధికి ఈ సంస్థలు ప్రయోగాలు చేపడతాయి.